ప్రకృతి సమతుల్యతలో అడవులు భూమికి ఊపిరితిత్తుల వంటివి. కానీ గత 50 ఏళ్లలో మానవుడు సాధించిన ‘అభివృద్ధి‘ వెనుక ప్రకృతి చేసిన త్యాగం వెలకట్టలేనిది. అడవుల విస్తీర్ణం తగ్గడం, కార్చిచ్చులు పెరగడం మరియు వన్యప్రాణుల ఆవాసాలు విచ్ఛిన్నం కావడం వల్ల భూగోళం నేడు ప్రమాదకర స్థితికి చేరుకుంది.
గత 50 ఏళ్లలో సంభవించిన మార్పులు:
ఒక భయంకర నిజం:
1970వ దశకం నుండి నేటి వరకు (2026) అడవుల పరిస్థితిని గమనిస్తే, మనం కోల్పోయిన సంపద అపారమైనది.
జీవవైవిధ్యం క్షీణత: వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ (డబ్ల్యూ.డబ్ల్యూ.ఎఫ్.) నివేదికల ప్రకారం, గత 50 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల జనాభా దాదాపు 69% తగ్గిపోయింది. అడవుల నరికివేత: ప్రతి నిమిషానికి సుమారు 27 ఫుట్‌బాల్ మైదానాల పరిమాణంలో ఉన్న అడవులు అంతరించిపోతున్నాయి. అమెజాన్ వంటి వర్షారణ్యాలు గత 50 ఏళ్లలో తమ విస్తీర్ణంలో 20% పైగా కోల్పోయాయి. తెలంగాణ ప్రాంతంలో మార్పు: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి నేటి తెలంగాణ వరకు చూస్తే, ఒకప్పుడు దట్టంగా ఉన్న నల్లమల, ఏటూరునాగారం కారిడార్లు నేడు రోడ్లు, మైనింగ్ మరియు ఆక్రమణల వల్ల ముక్కలైపోయాయి. పులుల సంచార మార్గాలు (కార్రిడార్స్) మూసుకుపోవడమే నేటి మానవ-జంతు సంఘర్షణకు ప్రధాన కారణం.
ఆవాసాల విచ్ఛిన్నం: మృగాల ఇంట్లో మనుషుల చొరబాటు
వన్యప్రాణులు జనావాసాల్లోకి రావడం లేదు, మనుషులే వన్యప్రాణుల ఆవాసాలను ఆక్రమిస్తున్నారు. శాస్త్రీయంగా దీనిని ‘హ్యాబిటాట్ ఫ్రాగ్మెంటేషన్’ అంటారు.
దృష్టాంతం: ఏటూరునాగారం కారిడార్‌లో పులికి సరైన ఆవాసం కల్పించలేకపోవడం మన వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనం. పులికి లేదా ఏనుగుకు వందల కిలోమీటర్ల మేర స్వేచ్ఛా సంచారం అవసరం. అడవి మధ్యలో హైవేలు, రిసార్టులు నిర్మించడం వల్ల అవి గందరగోళానికి గురై ఊళ్లలోకి వస్తున్నాయి.
కార్చిచ్చు (ఫారెస్ట్ ఫైర్స్): బుగ్గిపాలవుతున్న జీవకోటి
వ్యాసంలో పేర్కొన్నట్లుగా, కార్చిచ్చు అనేది ప్రకృతి సిద్ధంగా వచ్చే దానికంటే మానవ తప్పిదాల వల్ల వచ్చేదే ఎక్కువ. ఒక్కొక్కసారి స్వార్ధ ప్రయోజనాల కోసం కూడా అడవులకు అగ్గి పెట్టి బుగ్గిపాలు చేస్తున్నారు. ఇటీవల కొంత సాంకేతిక అభివృద్ధి చెడుతోంది. దానివల్ల కొంచెం ఉపశమనం కలుగుతోంది. గణాంకాలు: ప్రపంచవ్యాప్తంగా 420 మిలియన్ హెక్టార్ల అడవి కార్చిచ్చుల వల్ల నాశనమైంది. నష్టం: అడవి తగలబడినప్పుడు కేవలం చెట్లు మాత్రమే చనిపోవు; నేలలో ఉండే సూక్ష్మజీవులు, పక్షుల గూళ్లు, అరుదైన కీటకాలు మరియు పాకే జంతువులు సజీవ దహనమవుతాయి. ఇండోనేషియా, ఆస్ట్రేలియా (బ్లాక్ సమ్మర్), అమెజాన్ అడవుల దహనం వల్ల వెలువడిన కార్బన్ డయాక్సైడ్ గ్లోబల్ వార్మింగ్‌ను 50 ఏళ్ల వెనక్కి నెట్టింది.
మానవ స్వార్థం – అమానవీయ చర్యలు: “అందరూ శాకాహారులే మరి కోడి పిల్ల ఎట్లా మాయమైంది?” అన్నట్లుగా, మనం పర్యావరణ ప్రేమికులమని చెప్పుకుంటూనే అటవీ భూములను అనేక పథకాల పేర్లతో ఆక్రమిస్తున్నాం. మానవ మృగాలం మనమే: పులి మనిషిని చంపితే ‘మ్యాన్ ఈటర్’ అని ముద్ర వేసి వేటాడుతాం. కానీ వేల జంతువుల ప్రాణాలు తీస్తున్న మానవుడిని ఏమనాలి? అభివృద్ధి ముసుగులో అడవులను నరికివేస్తూ, నోరులేని జీవుల దాహాన్ని, నీడను, ఆశ్రయాన్ని, ఆవాసాన్ని లాక్కుంటున్నాం.
చట్టాల వైఫల్యం మరియు రాజకీయ ఒత్తిడి: భారత రాజ్యాంగంలో పర్యావరణ, వన్యప్రాణి సంరక్షణ చట్టాలు ఎన్నో ఉన్నప్పటికీ, అవి క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. అధికారుల నిస్సహాయత: సంబంధిత అధికారులు తమ ఉద్యోగాలను కాపాడుకోవడమే పెద్ద సమస్యగా భావిస్తున్నారు. రాజకీయ నాయకుల ఒత్తిడి వల్ల ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోలేకపోతున్నారు. సరైన సెక్షన్లు పెట్టకపోవడం, కోర్టుల్లో కేసులు నీరుగారిపోవడం వల్ల అటవీ నేరగాళ్లకు భయం లేకుండా పోతోంది. ఒక్కొక్కసారి కేస్ చేయడానికికూడా సంబంధిత డిపార్ట్మెంటుకు ఎన్నో సమస్యలు ఎదురౌతున్నాయి.
శాస్త్రీయ దృక్పథం – పరిష్కార మార్గాలు: భవిష్యత్తు తరాలకు భూమిని మిగల్చాలంటే వెంటనే చేయాల్సిన పనులు: ప్రకృతి పునరుద్ధరణ (రీ-వైల్డింగ్): కోల్పోయిన అడవులను తిరిగి పునరుద్ధరించాలి. కేవలం చెట్లు నాటడమే కాకుండా, సహజ సిద్ధమైన అటవీ వాతావరణాన్ని సృష్టించాలి. కారిడార్ల రక్షణ: వన్యప్రాణుల సంచార మార్గాల్లో ఎటువంటి మానవ ప్రమేయం లేకుండా ‘ఏకో-సెన్సిటివ్ జోన్స్’ గా ప్రకటించాలి. సాం·కేతికత వినియోగం: శాటిలైట్ మానిటరింగ్ మరియు ఏఐ ఆధారిత కెమెరాల ద్వారా అడవిలో జరిగే ప్రతి చిన్న అక్రమాన్ని గుర్తించాలి.
ప్రకృతి మన అవసరాలను తీరుస్తుంది కానీ మన అత్యాశను కాదు. 50 ఏళ్ల క్రితం ఉన్న పచ్చదనం నేడు లేదు, నేడున్న పచ్చదనం రేపు ఉండకపోవచ్చు. మనం భూమి మీద అత్యంత తెలివైన జీవులమని విర్రవీగడం మానేసి, ఇతర జీవులకు కూడా బతికే హక్కు ఉందని గుర్తించాలి. పర్యావరణాన్ని కాపాడుకోవడం అంటే మనల్ని మనం కాపాడుకోవడమే.
– రవిబాబు పిట్టల, ఎం.ఎస్సీ., ఎం.టెక్., (పిహెచ్.డి), పర్యావరణవేత్త, మాజీ అసిస్టెంట్ ప్రొఫెసర్, జే.యన్.టీ.యు.హెచ్, హైదరాబాద్ మరియు జాయింట్ సెక్రటరీ, ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ ఎన్.జి.ఓ., తెలంగాణ స్టేట్, ఇండియా.
మొబైల్: +91 9849425271.