వేద న్యూస్, హైదరాబాద్ ప్రతినిధి :
2027 జూన్లో జరగబోయే గోదావరి పుష్కరాల నిర్వహణకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికలపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. పుష్కరాల కోసం బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరీవాహక ప్రాంతంలోని ఆలయాలు, పుష్కరఘాట్ల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం, ఉన్నతాధికారులతో శాసనసభ సమావేశ హాలులో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. 2027 జూన్ గోదావరి పుష్కరాల నాటికి పూర్తి చేయాల్సిన పనులపై సమావేశంలో చర్చించారు. అందుకోసం రూపొందించిన ప్రణాళికలను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. వాటిపై ముఖ్యమంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు.
భక్తులకుఎలాంటి ఇబ్బందులు రాకుండా, పుష్కరాల నిర్వహణకు అనువైన ప్రదేశాలను గుర్తించడానికి ఇంజనీర్లతో టెక్నికల్ కమిటీని నియమించాలని ఆదేశించారు. ఈ కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించి వచ్చే 15 లేదా 20 రోజుల్లో నివేదికను సమర్పించాలని చెప్పారు. ఇంజనీర్ల కమిటీ నివేదికను అధికారుల కమిటీ పరిశీలించి, పూర్తి అంచనాలతో నివేదికను రూపొందించి మంత్రివర్గ ఉప సంఘానికి పంపించాలని, ఉప సంఘం ఆమోదించిన తర్వాత గోదావరి పుష్కరాల సమగ్ర ప్రణాళికపై మంత్రిమండలి తుదినిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. పుష్కరాల కోసం శాశ్వత, తాత్కాలిక పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసేలా ప్రణాళికలు ఉండాలని సూచించారు. వివిధ విభాగాల మధ్య సమన్వయ లోపం తలెత్తకుండా ప్రజా భవన్లో ప్రత్యేకంగా వార్ రూమ్ ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. పుష్కరాల ఏర్పాట్లలో భాగంగా ప్రధాన దేవాలయాలు, పర్యాటక ప్రదేశాల్లో ఘాట్ల నిర్మాణం, విస్తరణ చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా ప్రాంతాలను సందర్శించే భక్తులు, పర్యాటకులకు ఇబ్బందులు రాకుండా ప్రాంతాల మధ్య కనెక్టివిటీ సరిగా ఉండేలా చూసుకోవాలని చెప్పారు. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం అభివృద్ధి, ఆలయ విస్తరణకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ను ఈ సందర్భంగా అధికారులు వివరించగా, ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వర రావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
