• 45 ఎకరాల్లో మొక్కజొన్న సాగు.. పట్టించుకోని ఆర్గనైజర్లు
  • ప్రజావాణిలో తవసిబోడు రైతుల ఆవేదన
  • ఎమ్మార్వోకు వినతి
    వేద న్యూస్ , కారేపల్లి :
    అమాయక గిరిజన రైతులను ఆశ చూపి, విత్తనాలు వేయించి, తీరా పంట చేతికొచ్చే సమయానికి ఆర్గనైజర్లు ముఖం చాటేయడంతో రైతులు రోడ్డున పడ్డారు. సింగరేణి మండలంలోని రేలకాయలపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని తవసిబోడు గిరిజన రైతులు సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో తమ గోడును వెళ్లబోసుకున్నారు. తమకు జరిగిన అన్యాయంపై తహసీల్దార్ (ఎమ్మార్వో) ఓరుగంటి వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు.

అసలేం జరిగిందంటే..
వైరాకు చెందిన తీగల బంజారి నివాసి ఆర్గనైజర్ ఎస్.కె సైదా, తవసిబోడుకు చెందిన ఏజెంట్ భూక్యా చందర్ ద్వారా స్థానిక రైతులను సంప్రదించారు. క్రిస్టల్ కంపెనీకి చెందిన ‘662 సీడ్స్’ (ఆడ, మగ మొక్కజొన్న) రకాన్ని సాగు చేయాలని, క్వింటాకు రూ. 3,200 ఇస్తామని నమ్మబలికారు. వీరి మాటలు నమ్మిన సుమారు 45 ఎకరాల్లో రైతులు ఈ పంటను సాగు చేశారు.
కంపెనీ మాట మార్చడంతో రైతుల లబోదిబో అంటున్నారు.
ప్రస్తుతం పంట కోతకు రావడంతో రైతులు ఆర్గనైజర్లకు ఫోన్ చేయగా, వారు స్పందించడం లేదు. పోనీ కంపెనీని సంప్రదిస్తే.. అసలు తమ కంపెనీలో ‘ఆడ మగ మొక్కజొన్న’ విత్తనాలే లేవని బుకాయిస్తుండటంతో రైతులు కంగుతిన్నారు. తాము నమ్మి మోసపోయామని, లక్షలాది రూపాయల పెట్టుబడి పెట్టి ఇప్పుడు పంటను ఏం చేసుకోవాలో తెలియక గిరిజన రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.

న్యాయం చేయాలని వేడుకోలు:
సంబంధిత ఆర్గనైజర్లను వెంటనే పిలిపించి, తమ పంటను కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని, తమకు జరిగిన నష్టానికి న్యాయం చేయాలని బాధితులు ఎమ్మార్వోను వేడుకున్నారు. అధికారులు స్పందించి తమను ఈ సంక్షోభం నుండి గట్టెక్కించాలని వారు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో రైతులు నరేందర్, రమేష్, వీరబాబు, నాగేశ్వరరావు, రాంబాబు, సీతారాం, దీప్లా, రాంచంద్, బాల, తదితరులు పాల్గొన్నారు.