= అమ్మో.. నేపాలీ గ్యాంగ్!
= వరుస దోపిడీలు, హత్యలతో అరాచకం
= హైదరాబాద్‌లో పనిమనుషుల రూపంలో మృత్యుపాశం
= ఇటీవల మాజీ ఐపీఎస్ అధికారి భార్య హత్య
= ఆ ఘటన మరువకముందే మరో ఘోరం వెలుగులోకి
= కౌకూరులో రిటైర్డ్ ప్రొఫెసర్ దంపతుల ఇంట్లో భారీ దోపిడీ
= పనికి చేరిన కేవలం 13 రోజుల్లోనే స్కెచ్
= 60 తులాల బంగారం, 15 కేజీల వెండిని ఎత్తుకెళ్లారు
= వృద్ధులు, ఒంటరిగా నివసిస్తున్న సంపన్న వర్గాలే వారి టార్గెట్
= పనిలో చేరి యజమానుల నమ్మకం సంపాదించాకే అసలు కథ
= పనిమనుషుల వివరాలను తెలపాలంటున్న పోలీసులు

వేద న్యూస్, క్రైం బ్యూరో
హైదరాబాద్ మహానగరంలో నేపాలీ గ్యాంగ్‌లు వరుస దోపిడీలు, హత్యలతో సామాన్య ప్రజలను, ముఖ్యంగా వృద్ధ దంపతులను వణికిస్తున్నాయి. పనిమనుషుల రూపంలో ఇంట్లోకి ప్రవేశించి, యజమానుల నమ్మకాన్ని పొంది, ఆపై అదును చూసి ఆ ఇళ్లకే కన్నాలు వేస్తున్న ఈ ముఠాల అరాచకాలు నగరవాసుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. ఇటీవల ఒక మాజీ ఐపీఎస్ అధికారి భార్యను అతి కిరాతకంగా హత్య చేసిన ఉదంతం మరువకముందే, తాజాగా జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో రిటైర్డ్ ప్రొఫెసర్ దంపతులను బంధించి దోచుకున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

నమ్మితే అంతే సంగతులు..
హైదరాబాద్ నగరంలోని సంపన్న ప్రాంతాల్లో నివసిస్తున్న వృద్ధులు, ఒంటరిగా ఉంటున్న వారే ఈ నేపాలీ ముఠాల ప్రధాన లక్ష్యంగా మారుతున్నారు. ఈ ముఠాలు నేరుగా దాడులకు దిగకుండా, అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తాయి. మొదట పనిమనుషులుగా తక్కువ జీతానికే చేరి, యజమానులతో నమ్మకంగా మెలుగుతూ వారి దైనందిన అలవాట్లు, ఇంట్లో ఉన్న నగలు, నగదు, బీరువాల తాళాల వివరాలన్నీ నిశితంగా గమనిస్తాయి. కౌకూరులోని గోల్ఫ్ ఎన్‌క్లేవ్‌లో నివాసముంటున్న రిటైర్డ్ ప్రొఫెసర్ మురళీధర్ మోహన్(68), ఆయన భార్య డాక్టర్ విజయలక్ష్మి(58) ఇంట్లో కూడా ఇదే తరహాలో ఒక నేపాలీ జంట కేవలం 13 రోజుల క్రితమే పనిలో చేరింది. పనిలో చేరిన పక్షం రోజులు కాకముందే యజమానుల వద్ద భారీగా ఆస్తి ఉన్నట్లు గుర్తించి, వారిని దోచుకోవాలని నిర్ణయించుకున్నాయి.

వేడుక పేరుతో మత్తు మందు..
ఈ ముఠాలు తమ పథకాన్ని అమలు చేయడానికి పుట్టినరోజు వేడుకలను ఒక ఆయుధంగా వాడుకున్నాయి. పథకంలో భాగంగా నేపాల్‌కు చెందిన మరో మహిళను తమ బంధువు పేరుతో ఇంటికి పిలిపించి, ఆమె పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటామని యజమానుల అనుమతి కోరారు. వారిని నమ్మిన ప్రొఫెసర్ దంపతులు అంగీకరించడంతో, సోమవారం ఉదయం కేక్ కోసి అందులో మత్తు మందు కలిపి యజమానులకు ఇచ్చారు. ఆ కేక్ తిన్న కాసేపటికే దంపతులు మత్తులోకి జారుకుంటుండగా, తమపై దోపిడీ జరుగుతోందని గుర్తించి ‘మీకు కావాల్సింది తీసుకెళ్లండి.. కానీ మమ్మల్ని మాత్రం చంపకండి’ అని నిందితులను వేడుకున్నారు. అయినా కనికరం చూపని ఆ ముఠా, దంపతుల కాళ్లు చేతులు తాళ్లతో కట్టేసి ఒక గదిలో బంధించి బీరువాలు, అల్మారాలు పగలగొట్టి బీభత్సం సృష్టించాయి.

60 తులాల బంగారం మాయం
నిర్దాక్షిణ్యంగా వ్యవహరించిన ఈ ముఠా ఇంట్లో ఉన్న విలువైన వస్తువులన్నింటినీ సర్దేశాయి. సుమారు 60 తులాల బంగారు ఆభరణాలు, 15 కేజీల వెండి, 30 వేల రూపాయల నగదు మరియు 3 వేల డాలర్లను దోచుకుని ఇంటికి తాళాలు వేసి పరారయ్యారు. సోమవారం నుంచి మంగళవారం సాయంత్రం వరకు బాధితులు మత్తులోనే ఉండిపోయారు. మత్తు దిగిన తర్వాత మురళీమోహన్ గట్టిగా కేకలు వేయడంతో గమనించిన స్థానికులు వచ్చి తలుపులు పగలగొట్టి వారిని రక్షించడంతో ఈ అరాచకం వెలుగులోకి వచ్చింది. ఈ దోపిడీలో మొత్తం ఐదు నుంచి ఏడుగురు వ్యక్తులు పాల్గొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

రెచ్చిపోతున్న ముఠాలు..
నగరంలో వరుసగా జరుగుతున్న ఈ సంఘటనలు శాంతిభద్రతలపై ఆందోళన కలిగిస్తున్నాయి. ముఠా సభ్యులు తమ అవసరానికి ఎంతకైనా తెగించే తత్వాన్ని కలిగి ఉన్నారని, అవసరమైతే హత్యలు చేయడానికి కూడా వెనకాడరని గత సంఘటనలు రుజువు చేస్తున్నాయి. ఈ కేసును అత్యంత సీరియస్‌గా తీసుకున్న పోలీసులు, నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మల్కాజిగిరి డీసీపీ ఘటనాస్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. పనిమనుషులను ఇంట్లో చేర్చుకునేటప్పుడు యజమానులు అప్రమత్తంగా ఉండాలని, వారి పూర్తి వివరాలను సమీప పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయాలని అధికారులు పదే పదే హెచ్చరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *