= ఓ వైపు కొడుకు చేసి ఘనకార్యంతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు
= మరోవైపు మంత్రి పదవి ఊడుతుందంటూ ప్రచారం..
= కొత్త పార్టీ పెడుతుండంటూ కోడై కూసిన సోషల్ మీడియా
= అనుచరులతో బీజేపీ కార్యాలయంలో హంగామా వెనుక మర్మమేంటి?
= మంత్రి పదవికి ఉద్వాసన తప్పదనే సంకేతాలా..?
= చివరి శ్వాస వరకూ బీజేపీలోనే అంటూ వివరణ ఇచ్చిన సంజయ్
= ఇదంతా కేటీఆర్ మీడియా చేస్తున్న దుష్ప్రచారం అంటూ ఫైర్
= భగీరథ్ కు బిగుస్తున్న పోక్సో.. తండ్రికేమో పదవీ గండం అంటూ ప్రచారం..

వేద న్యూస్, ప్రత్యేక ప్రతినిధి
తెలంగాణ బీజేపీలో గత కొన్ని రోజులుగా నడుస్తున్న హైడ్రామా ఇప్పుడు పతాక స్థాయికి చేరింది. కుమారుడు బండి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదు కావడం, అది కాస్తా దేశవ్యాప్తంగా సంచలనంగా మారడంతో తీవ్ర రక్షణలో పడ్డాడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ఒకవైపు ఈ కేసు కారణంగా బండి సంజయ్‌కు కేంద్ర మంత్రి పదవి నుంచి ఉద్వాసన తప్పదనే ప్రచారం ఢిల్లీ నుంచి గల్లీ వరకు గట్టిగా సాగుతుండగా.. మరోవైపు తనపై వస్తున్న ఊహాగానాలను తిప్పికొట్టేందుకు, పార్టీ అధిష్ఠానానికి తన పట్టు ఏంటో చూపించేందుకు బండి సంజయ్ వ్యూహాత్మకంగా అడుగులు వేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

అధ్యక్షుడు లేని సమయంలో బల ప్రదర్శన..
కొడుకు పోక్సో కేసు విషయంలో బండి సంజయ్ వ్యవహరించిన తీరు పార్టీ ప్రతిష్ఠను జాతీయ స్థాయిలో తీవ్రంగా దెబ్బతీసిందని హైకమాండ్ తీవ్ర ఆగ్రహంతో ఉంన్నట్లు రెండ్రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే, ఈ ఉదంతంపై పూర్తి నివేదిక ఇవ్వాల్సిందిగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావును అధిష్ఠానం అత్యవసరంగా ఢిల్లీకి పిలిపించినట్లు వార్తలు సైతం వచ్చాయి. రాంచందర్ రావు హైకమాండ్‌కు రిపోర్ట్ ఇచ్చేందుకు ఢిల్లీ వెళ్లిన సమయాన్ని చూసుకుని.. బండి సంజయ్ తన అనుచరులు, మద్దతుదారులను భారీ సంఖ్యలో పార్టీ ఆఫీసుకు రావాలంటూ మెసేజ్‌లు పంపారనే టాక్ నడుస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడు ఆఫీసులో లేని సమయంలో వందలాది మంది అనుచరులతో వచ్చి బండి సంజయ్ అక్కడ పెద్ద ఎత్తున హడావుడి చేశారని, దీని వెనుక ఒక స్పష్టమైన పొలిటికల్ స్కెచ్ ఉందనే చర్చ నడుస్తోంది. తనపై వేటు వేస్తే పార్టీకి భారీ నష్టం జరుగుతుందనే ఇండైరెక్ట్ సిగ్నల్స్ ఢిల్లీ పెద్దలకు పంపడానికే సంజయ్ ఈ ‘బల ప్రదర్శన’కు దిగారని, పదవి ఊడుతుందనే భయంతోనే ఈ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారనే సోషల్ మీడియా కోడై కూస్తోంది.

కొత్త పార్టీ పెడుతున్నారంటూ ప్రచారం
మరోవైపు, ఒకవేళ కేంద్ర మంత్రి పదవి ఊడిపోతే లేదా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే బండి సంజయ్ సొంతంగా కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జోరందుకుంది. ఈ వార్తలపై బండి సంజయ్ తీవ్రంగా మండిపడ్డారు. పార్టీ ఆఫీస్ వేదికగా తీవ్ర భావోద్వేగానికి లోనవుతూ ఆయన సంజాయిషీ ఇచ్చారు. ‘నేను బీజేపీని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే వ్యక్తిని. చివరి శ్వాస విడిచాక నా భౌతిక దేహంపై బీజేపీ జెండా మాత్రమే కప్పాలి. నేను బీజేపీ ద్వారానే ఈ స్థాయికి వచ్చాను.. అలాంటప్పుడు నాపై ఇలాంటి ఆరోపణలు చేయడం తగదు. కొత్త పార్టీ పెట్టడం లాంటి చిల్లర మల్లర రాజకీయాలు చేసే ఆలోచన నా జీవితంలో లేదు.. నేను ఎప్పటికీ బీజేపీ కార్యకర్తనే” అని భావోద్వేగంతో వివరణ ఇచ్చారు.

కేటీఆర్ మీడియా కుట్రే అంటూ..
ఇదంతా కేటీఆర్ మీడియా, వారి ఫేక్ ఐడీలు చేస్తున్న కుట్రపూరిత పనేనని సంజయ్ కొట్టిపారేశారు. కేసీఆర్ కొడుకులా ఫేక్ మీడియాలు నడిపి దుష్ప్రచారం చేసే అలవాటు మాకు లేదు. గతంలో వారి గడి గోడలు బద్దలు కొట్టామనే ఫ్రస్ట్రేషన్‌తోనే మాపై బురద జల్లుతున్నారు.. వాటిని మేము పట్టించుకోము అని ఘాటుగా విమర్శించారు. తన కుమారుడి విషయంలో వస్తున్న విమర్శలకు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. దేశ రాజకీయాల్లో కొడుకుపై ఆరోపణలు రాగానే.. చట్టాన్ని గౌరవిస్తూ స్వయంగా పోలీసులకు అప్పగించిన ఏకైక నాయకుడిని నేనే. బండి భగీరథ్ విషయంలో నేను ఎప్పటికీ ధర్మాన్నే పాటిస్తాను. నన్ను అరెస్ట్ చేస్తారనే ప్రచారంపై నేను మాట్లాడను.. కోర్టులోనే అన్ని విషయాలు తేలుతాయి అని స్పష్టం చేశారు.

పార్టీ అండగా ఉంటుందా? వెలివేస్తుందా?
బండి సంజయ్‌కు సంఘీభావంగా కార్యాలయానికి చేరుకున్న భారీ సంఖ్యలో బీజేపీ శ్రేణులు.. న్యాయం గెలుస్తుంది.. సంజయ్ మా నాయకుడు అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ ఆఫీస్ ప్రాంగణాన్ని హోరెత్తించారు. ఒకవైపు క్షేత్రస్థాయి కార్యకర్తలు బండి వైపు నిలబడుతున్నట్లు కనిపిస్తున్నా.. జాతీయ స్థాయిలో ‘బేటీ బచావో – బేటీ పడావో’ అని నినదించే బీజేపీ, ఒక కేంద్ర మంత్రి కొడుకుపై పోక్సో కేసు ఉండటాన్ని ఎంతవరకు భరిస్తుందనేది పెద్ద ప్రశ్న. మొత్తానికి కొడుకు చేసిన ఘనకార్యంతో రాజకీయంగా తీవ్ర అగ్నిపరీక్షను ఎదుర్కొంటున్న బండి సంజయ్‌ను పార్టీ కాపాడుకుంటుందా? లేక క్రమశిక్షణా చర్యల పేరిట మంత్రివర్గం నుంచి, పార్టీ నుంచి వెలివేస్తుందా? అనేది రానున్న కొన్ని రోజుల్లో తేలనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *