= ప్రైవేట్ స్కూళ్లలో ఇష్టానుసారంగా ఫీజులు
= ఐఐటీ, ఒలింపియాడ్, టెక్నో పేరిట అదనపు బాదుడు
= పుస్తకాలు, యూనిఫారాల పేరిట కోట్లలో వ్యాపారం
= నర్సరీ చదువులకే రూ.80 వేలంట..
= హైస్కూల్ విద్యార్థులకు లక్ష పైనే..
= ఫీజుల నియంత్రణకు లేని ప్రత్యేక కమిటీ
= స్కూల్స్ లోనే అన్నీ కొనాలంటూ నిబంధనలు
= పుస్తకాలపైనే కోట్లలో సాగుతున్న దందా
= మధ్యతరగతి బతుకులకు భారంగా పిల్లల చదువు

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి
పిల్లలకు ఉత్తమ విద్య అందించాలనే తల్లిదండ్రుల ఉన్నతమైన ఆశయాన్ని పలు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. ప్రతి ఏడాది ఇష్టానుసారంగా ఫీజులు పెంచుతూ మధ్యతరగతి, పేద వర్గాలపై మోయలేని ఆర్థిక భారాన్ని మోపుతున్నాయి. వరంగల్ జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ పాఠశాలల్లో చాలా వాటిలో సీబీఎస్ఈ, ఒలింపియాడ్, ఐఐటీ ఫౌండేషన్, టెక్నో పేరిట భారీ ప్రచారాలతో అమాయక తల్లిదండ్రులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆఖరికి నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ తరగతులకే రూ.80 వేల వరకు వసూలు చేస్తుండటం గమనార్హం. ఇక కొత్త అడ్మిషన్ అయితే అదనంగా పాఠశాలను బట్టి వేలల్లో కచ్చితంగా చెల్లించాల్సిందేనని యాజమాన్యాలు తేల్చి చెబుతున్నాయి. చదువు కొనాలంటేనే భయపడేలా మధ్యతరగతి బతుకులను ఈ విద్యా వ్యాపారం ఛిన్నభిన్నం చేస్తోంది.

నియంత్రణ లేని ఫీజులు..
ప్రైవేట్ స్కూళ్లలో నియంత్రణ లేకపోవడంతో కొన్ని యాజమాన్యాలు అడ్డూఅదుపూ లేకుండా ఫీజులను నిర్ణయించాయి. సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విధంగానే ఫీజులు వసూలు చేయాల్సి ఉంటుంది. గతంలో ప్రాథమిక తరగతులకు రూ.9 వేలు, ఉన్నత తరగతులకు రూ.13 వేలుగా సర్కారు ఫీజులను నిర్ణయించగా, ఆయా యాజమాన్యాలు ఏకతాటిపైకి వచ్చి న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. దీంతో సదరు ప్రభుత్వ ఉత్తర్వులు నిలిపివేయబడ్డాయి. అప్పటి నుంచి పాఠశాల యాజమాన్యాలే సొంతంగా ఫీజులు నిర్ణయించుకునే వెసులుబాటు లభించింది. క్షేత్రస్థాయిలో ఫీజుల క్రమబద్ధీకరణకు ఒక నిర్దిష్టమైన కమిటీ లేకపోవడమే ఈ నిలువు దోపిడీకి ప్రధాన కారణంగా మారుతోంది.

ఐఐటీ, ఒలింపియాడ్ పేరిట మాయమాటలు..
ప్రస్తుతం స్కూళ్లలో ఐదో తరగతి నుంచి ఏడో తరగతి వరకు రూ.35 వేల నుంచి రూ.70 వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇక ఎనిమిదో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు ఈ ఫీజు ఏకంగా రూ.లక్ష దాటిపోతోంది. మరి ఇంత భారీ మొత్తంలో ఫీజులు ఎందుకని తల్లిదండ్రులు ప్రశ్నిస్తే.. పిల్లలకు ఐఐటీ ఫౌండేషన్ కోర్సులు బోధిస్తున్నామని ఏదో ఒక మాయమాటలు చెప్పి బురిడీ కొట్టిస్తున్నారు. మరోవైపు పాఠశాల యూనిఫాం, టై, బూట్లు, బెల్ట్.. ఇలా అన్నింటికీ ప్రత్యేక ధరలు నిర్ణయించి, కచ్చితంగా తమ వద్దే కొనుగోలు చేయాలని యాజమాన్యాలు కఠిన నిబంధనలు విధిస్తున్నాయి. బహిరంగ మార్కెట్ కంటే రెట్టింపు ధరలకు వీటిని అమ్ముతుండటంతో తల్లిదండ్రులకు అదనపు భారం తప్పడం లేదు.

పుస్తకాలకూ వేలల్లో దందా
ప్రైవేటు ఉద్యోగుల వేతనాలు, ఉపాధి శ్రామికులు, రోజువారీ కూలీల ఆదాయాలు ప్రతి ఏడాది పెరిగే పరిస్థితి ఉండదు. కానీ పిల్లల చదువులకు వచ్చేసరికి ప్రతి ఏటా స్కూల్ ఫీజులు, పుస్తకాల ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయి. కేవలం నర్సరీ చదువుకే పాఠశాల డిమాండ్‌ను బట్టి రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు అదనపు ఖర్చులు పెట్టాల్సి వస్తోంది. ఇవన్నీ చూస్తుంటే వరంగల్ లో చదువులు ఎంత ఖరీదుగా మారాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. కేవలం పుస్తకాలు కొనుగోలు చేసేందుకే ఒక్కో విద్యార్థి నుండి రూ.6వేల నుంచి రూ.10వేల వరకు పాఠశాల యాజమాన్యాలు యథేచ్ఛగా వసూలు చేస్తున్నాయి.

యాజమాన్యాలపై కాసుల వర్షం
నగరంలోని కొన్ని పెద్ద ప్రైవేటు పాఠశాలల్లో 1000 నుంచి 2వేల మంది వరకు విద్యార్థులు చదువుతున్నారు. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమైతే చాలు ఈ యాజమాన్యాలకు కాసుల వర్షం కురుస్తోంది. ఉదాహరణకు ఒక పాఠశాలలో 1000 మంది విద్యార్థులు ఉన్నారనుకుంటే.. సుమారుగా ఒక్కో విద్యార్థి చొప్పున కేవలం పుస్తకాల మీదే రూ.5వేల నుంచి రూ.6వేల చొప్పున లెక్కిస్తే ఏకంగా రూ.లక్షల్లోనే పైగా వ్యాపారం జరుగుతోంది. ఈ పుస్తకాల దందాలోనే పాఠశాల యాజమాన్యాలకు సుమారు 40 శాతం వరకు నికర లాభం ఉంటోందని విద్యా రంగ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రైవేట్ పాఠశాలల దోపిడీపై ఉక్కుపాదం మోపాలని, ఫీజుల నియంత్రణకు పటిష్టమైన చట్టం తేవాలని మధ్యతరగతి తల్లిదండ్రులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *