వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి :
వరంగల్ జిల్లా పరిధిలో ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీల ఎంపిక ప్రక్రియపై సోషల్ మీడియా (వాట్సాప్) ద్వారా వచ్చిన వార్తలపై జిల్లా ఉపాధి అధికారి స్పష్టమైన వివరణ ఇచ్చారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీల ఎంపికను 23-07-2025న నిర్వహించిన ఓపెన్ టెండర్ విధానం ద్వారా, అన్ని ప్రభుత్వ నిబంధనలు, నియమావళిని అనుసరించి చేపట్టినట్లు తెలిపారు. ఈ టెండర్ ప్రక్రియలో మొత్తం 63 ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలు పాల్గొనగా, వారిలో 47 ఏజెన్సీలను వరంగల్ జిల్లా ఔట్‌సోర్సింగ్ కమిటీ, జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఎంపిక ప్రక్రియ 01-09-2025 నుంచి అమల్లోకి వచ్చిందని, ఒక సంవత్సరం పాటు లేదా కొత్త ఎంపిక ప్రక్రియ అమలులోకి వచ్చే వరకు ఇది చెల్లుబాటు అవుతుందని వివరించారు. అలాగే, ఎంపికైన ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలను జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖలకు కేటాయించడం ఆయా శాఖల నుంచి వచ్చిన అవసరాలు, ఎంపికల ఆధారంగానే జరిగిందని తెలిపారు. శాఖలు సూచించిన ఆప్షన్ల ప్రకారం తుది కేటాయింపును జిల్లా కలెక్టర్ ఆమోదించినట్లు వెల్లడించారు. “ఆహాన్” ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీపై వస్తున్న ఆరోపణల విషయంలో ఇప్పటివరకు ఎలాంటి అభ్యంతరాలు అందలేదని, ఆ ఏజెన్సీ కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఎంపికైనదని జిల్లా ఉపాధి అధికారి స్పష్టం చేశారు.
