నిరంజన్‌ను పరామర్శించిన జనసేనాని పవన్ కళ్యాణ్

జనసైన నాయకులు రాజేందర్, రాకేష్,అనుదీప్ బాబు కృషి ఫలితం 

కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సాయం

వెంకటేశ్వరస్వామి తీర్థ ప్రసాదాలు అందజేత

బాలుడికి ధైర్యం చెప్పిన ఏపీ డిప్యూటీ సీఎం

జీవనోపాధిపై ప్రత్యేక చొరవ.. కుక్కపిల్ల కొనిస్తానని హామీ

భద్రకాళి అమ్మవారి దర్శనం

తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన పవన్

భద్రకాళి ఆలయంలో భద్రతా ఏర్పాట్లలో పోలీసుల వైఫల్యం

వేద న్యూస్,వరంగల్ ప్రతినిధి : 

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన అభిమానిపై ఉన్న అభిమానాన్ని, మానవత్వాన్ని మరోసారి చాటుకున్నారు. జన్యుపరమైన వ్యాధితో బాధపడుతూ మంచానికే పరిమితమైన హనుమకొండ హనుమాన్‌నగర్‌కు చెందిన 17 ఏళ్ల నిరంజన్‌ను బుధవారం స్వయంగా అతని నివాసానికి వెళ్లి పరామర్శించారు. కదల్లేని స్థితిలో ఉన్న నిరంజన్‌ను ఆప్యాయంగా పలకరించిన పవన్ కళ్యాణ్, అతని తల్లిదండ్రులు పొనుగోటి రాంగోపాల్, మానసలతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ప్రస్తుతం ఎక్కడ చికిత్స అందిస్తున్నారో, భవిష్యత్తులో వైద్యపరంగా ఉన్న అవకాశాలేమిటో అడిగి తెలుసుకున్నారు. భగవంతుడి ఆశీస్సులు నిరంజన్‌కు ఎల్లప్పుడూ ఉంటాయని కుటుంబ సభ్యుల్లో ధైర్యం నింపారు. వైద్య ఖర్చుల కోసం నిరంజన్‌కు రూ.1 లక్ష ఆర్థిక సాయం అందించిన పవన్ కళ్యాణ్, తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం నుంచి తెప్పించిన పవిత్ర వస్త్రాన్ని బాలుడికి కప్పి ఆశీర్వదించారు. దేవుడి అక్షింతలు వేసి తీర్థప్రసాదాలు అందజేశారు. నిరంజన్ ఆరోగ్యంగా ఉన్న రోజుల్లో పవన్ కళ్యాణ్‌ను అనుకరిస్తూ చేసిన నృత్య వీడియోలను కూడా ఆసక్తిగా వీక్షించారు. నిరంజన్ ఆరోగ్యం కోసం వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తానని పవన్ తెలిపారు. అమ్మవారి ప్రతిమతో పూజలు జరిపించి కుటుంబ సభ్యులకు అందజేస్తానని హామీ ఇచ్చారు. అలాగే నిరంజన్‌కు గుర్తుండిపోయేలా డైరీలో స్వయంగా సందేశం రాశారు. “ప్రియమైన నిరంజన్‌కు ప్రేమతో.. దుర్గామాత ఆశీస్సులతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నా” అంటూ రాసి అందజేశారు. కుటుంబ ఆర్థిక పరిస్థితిపై కూడా ఆరా తీసిన పవన్ కళ్యాణ్, నిరంజన్ తండ్రి గతంలో క్యాంటీన్‌లో పనిచేసిన విషయాన్ని తెలుసుకున్నారు. వారి జీవనోపాధి మెరుగుపడేందుకు క్యాంటీన్ ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని తెలంగాణ జనసేన నాయకులకు సూచించారు. పరామర్శ సమయంలో నిరంజన్ కుక్కపిల్లను పెంచుకోవాలనే కోరికను వ్యక్తం చేయగా, కుక్కపిల్లను కొనిపంపిస్తానని హామీ ఇచ్చారు. ఇందుకోసం ఇంటి యజమానితో కూడా మాట్లాడి అనుమతి ఇప్పించారు. నిరంజన్‌ను పరామర్శించిన అనంతరం

పవన్ కళ్యాణ్ వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆయన పర్యటన సందర్భంగా అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చి జనసేనానికి ఘన స్వాగతం పలికారు. పర్యటన అనంతరం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా స్పందించిన పవన్ కళ్యాణ్, తన హనుమకొండ పర్యటనకు సహకరించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రజలు తనపై చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయత, అభిమానానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, వారి ఆశీస్సులు తనకు ఎల్లప్పుడూ స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు. నిరంజన్ కుటుంబ సభ్యులు కూడా పవన్ కళ్యాణ్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కాగా, పవన్ వస్తున్నారని తెలిసినా భద్రకాళి ఆలయంలో పోలీసుల భద్రతా ఏర్పాట్లలో వైఫల్యం స్పష్టంగా కనిపించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *