= వరంగల్‌ను భయపెడుతున్న ముంపు ముప్పు
= నిబంధనలు పాతరేస్తూ అక్రమ నిర్మాణాలు
= ఆక్రమణలతో నిండిపోతున్న ఫుట్‌పాత్‌లు
= నగరవాసులకు చుక్కలు చూపుతున్న ట్రాఫిక్
= నత్తనడకన సాగుతున్న అభివృద్ధి పనులు
= రాజ్యమేలుతున్న నకిలీ ఉద్యగోలు
= కమిషనర్ వెంకన్న యాక్షన్ తీసుకుంటారా?
వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ నూతన కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన టి. వెంకన్నకు ఓరుగల్లు సమస్యలు సరికొత్త సవాళ్లతో స్వాగతం పలుకుతున్నాయి. ఓ వైపు నగరానికి వర్షం ముప్పు, మరోవైపు అస్తవ్యస్తంగా మారిన పారిశుధ్యం, నగరవ్యాప్తంగా వెలుస్తున్న అక్రమ నిర్మాణాలు, ఫుట్‌పాత్‌లు, నాలాల ఆక్రమణ, తలపోటుగా మారిన ట్రాఫిక్ సమస్యలు ఆయన ముందు కొండంత సవాళ్లుగా నిలిచాయి. వీటన్నింటికీ తోడు త్వరలోనే కార్పొరేషన్ ఎన్నికలు జరగనుండటంతో యంత్రాంగాన్ని పరుగెత్తించాల్సిన గురుతర బాధ్యత కొత్త కమిషనర్‌పై పడింది. అయితే, ఈ భౌగోళిక, రాజకీయ సమస్యల కంటే ముందే.. కార్పొరేషన్ పరిపాలనను పట్టిపీడిస్తున్న ఒక భారీ అంతర్గత కుంభకోణం ఇప్పుడు కొత్త బాస్ ముందు సవాల్ విసురుతోంది.
ముంచుకొస్తున్న ముంపు భయం
వర్షాకాలం సీజన్ ప్రారంభం కావడంతో నగరవాసులను ముంపు ముప్పు భయం మళ్లీ వెంటాడుతోంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మున్సిపల్ యంత్రాంగం యుద్ధప్రతిపాదికన ముందస్తు చర్యలు చేపట్టాల్సి ఉండగా, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా చూడటంలో, వరద నీరు సజావుగా సాగిపోయేలా ప్రణాళికలు రూపొందించడంలో అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వస్తున్నాయి. చిన్నపాటి వర్షానికే రోడ్లు చెరువులను తలపిస్తుండటంతో, రాబోయే రోజుల్లో భారీ వర్షాలు కురిస్తే నగర పరిస్థితి ఏంటనే ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది.
అస్తవ్యస్తంగా పారిశుధ్యం..
నగరంలో పారిశుధ్య నిర్వహణ పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. కాలనీల్లో రోజూ చెత్త సేకరించకపోవడంతో వీధులన్నీ చెత్తకుప్పలుగా మారుతున్నాయి. ముఖ్యంగా ప్రధాన డ్రైనేజీలు, నాలాల్లో పేరుకుపోయిన గుర్రపుడెక్క, ప్లాస్టిక్ వ్యర్థాలు, పూడిక (సిల్ట్)ను తొలగించకపోవడంతో మురుగునీరు ముందుకు సాగక వెనక్కి తన్నుతోంది. ఈ అపరిశుభ్ర వాతావరణం కారణంగా దోమలు విపరీతంగా పెరిగిపోయి డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి ప్రాణాంతక అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం పొంచి ఉంది. పారిశుద్ధ్యాన్ని పరుగులెత్తించాల్సిన విభాగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని స్థానికులు మండిపడుతున్నారు.
అడ్డూఅదుపూ లేని అక్రమ నిర్మాణాలు..
నగరవ్యాప్తంగా మున్సిపల్ నిబంధనలను నిలువునా పాతరేస్తూ అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా వెలుస్తున్నాయి. కనీస సెట్బ్యాక్లు వదలకుండా, ఎఫ్టీఎల్ పరిధిని సైతం లెక్కచేయకుండా బడా బాబులు భవనాలు నిర్మిస్తున్నారు. నాలాల ఆక్రమణలు, అనుమతి లేని లేఅవుట్ల కారణంగా వర్షపు నీరు సహజ సిద్ధంగా వెళ్లే మార్గాలు మూసుకుపోతున్నాయి. టౌన్ ప్లానింగ్ అధికారుల మామూళ్ల మత్తు, అండదండలతోనే ఈ అక్రమ నిర్మాణాలు సాగుతున్నాయని, దీనివల్లే నగరంలో వరద తీవ్రత పెరుగుతోందని సామాజిక కార్యకర్తలు ఆధారాలతో సహా నిలదీస్తున్నారు.
ఫుట్‌పాత్‌ల ఆక్రమణలు..
నగరంలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకూ పరాకాష్టకు చేరుతోంది. ప్రధాన రహదారుల పక్కన ఉన్న ఫుట్‌పాత్‌లను వ్యాపారులు, తోపుడు బండ్లవారు పూర్తిగా ఆక్రమించుకోవడంతో పాదచారులు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని రోడ్ల పైనుంచే నడవాల్సి వస్తోంది. దీనికి తోడు రోడ్లపైనే వాహనాల అడ్డగోలు పార్కింగ్ వల్ల నగరంలోని కీలక జంక్షన్లలో గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోతోంది. ఈ ఆక్రమణలను తొలగించడంలో అటు మున్సిపల్, ఇటు ట్రాఫిక్ పోలీస్ విభాగాలు సమన్వయంతో కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే నగరవాసులకు ప్రయాణం నరకప్రాయంగా మారుతోంది.
నత్తనడకన అభివృద్ధి పనులు..
నగరంలో ఎక్కడ చూసినా పెండింగ్ అభివృద్ధి పనులు ప్రజలకు నరకం చూపుతున్నాయి. ప్రధాన రహదారుల విస్తరణ, స్మార్ట్ సిటీ డ్రైనేజీ పనులు, అంతర్గత రోడ్ల నిర్మాణాలు నెలల తరబడి నత్తనడకన సాగుతున్నాయి. తవ్వి వదిలేసిన గోతులు వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం పడినప్పుడు ఈ గోతుల్లో నీరు చేరి రోడ్డు ఏదో, గోతి ఏదో తెలియని పరిస్థితి నెలకొంది. పనులను వేగవంతం చేసి గడువులోగా పూర్తి చేయించడంలో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణా లోపం స్పష్టంగా కనిపిస్తోంది.
ఖజానాను గుల్ల చేస్తున్న నకిలీ ఉద్యోగులు
వీటికి తోడు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నకిలీ ఉద్యోగాల బాగోతం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. వరంగల్ నగర పరిశుభ్రత కోసం క్షేత్రస్థాయిలో వార్డుల్లో నిలిచి శ్రమించాల్సిన పబ్లిక్ హెల్త్ (పీహెచ్) విభాగంలో కొందరు అక్రమార్కులు చేరి.. ఒక్క రోజు కూడా విధులకు హాజరుకాకుండానే నెలనెల వేల రూపాయల జీతాలను యథేచ్ఛగా దండుకుంటూ మున్సిపల్ ఖజానాను నిలువునా గుల్ల చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు.. జీహెచ్ఎంసీలో అధికారుల వ్యవహారశైలిపై కూడా ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఉన్నతాధికారుల దురుసు ప్రవర్తన, కిందిస్థాయి సిబ్బందిపై వేధింపుల నేపథ్యంలో ఓ మహిళా ఉద్యోగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పూర్తి స్థాయి విచారణ జరిపి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవడంతో పాటు ఉద్యోగులకు భరోసా కల్పించే చర్యలపై కూడా కమిషనర్ ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశాలపై కొత్త కమిషనర్ దృష్టి సారిస్తారా? లేదా అనేది తేలాల్సి ఉంది.