వేద న్యూస్, గణపురం:
మండల కేంద్రంలో కోతుల బెడద మరోసారి బయటపడింది. గురువారం గణపురం మండల కేంద్రానికి చెందిన పడిదల విజయేందర్ సింధూర కుమార్తె వర్షిత ఉదయం పాఠశాలకు వెళుతున్న క్రమంలో కోతులు ఒక్కసారిగా దాడి చేయడంతో వర్షిత తీవ్రంగా గాయపడింది. వర్షిత కేకలు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని కోతులను తరిమికొట్టి, ఆ చిన్నారిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు. మండల కేంద్రంలో కోతుల బెడద రోజురోజుకూ పెరుగుతున్నా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు గాయపడ్డ చిన్నారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో కోతుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీలు ఇచ్చిన నాయకులు ఇప్పుడు ఎక్కడున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, అటవీశాఖ సిబ్బంది స్పందించి కోతులను పట్టుకుని గ్రామం నుంచి తరలించే చర్యలు చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే చిన్నారులు, మహిళలు, వృద్ధులు బయటకు రావడానికే భయపడే పరిస్థితి నెలకొంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.