= అప్పుడే త్రినగరిని చుట్టుముట్టిన ఎన్నికల రాజకీయం
= మామునూరు ఎయిర్‌పోర్టుపై మావల్లే అంటే మావల్లే అంటున్న ఇరు పార్టీలు
= రూ.300 కోట్ల భూసేకరణతో కాంగ్రెస్ క్లెయిమ్
= అనుమతులు అన్నీ మావేనంటున్న కమలనాథులు
= 90 శాతం పూర్తయిన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ
= జనవరి నుండి రైల్వే కోచ్‌ల ఉత్పత్తి షురూ
= ముప్పై ఏళ్ల డ్రైనేజీ సమస్యకు మోక్షం
= జర్మన్ బ్యాంకు నిధులపై ఇరుపార్టీల రచ్చ
= బహిరంగ చర్చకు సై అంటే సై అంటున్న కాంగ్రెస్ బీజేపీ
వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి:
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల రణభేరి మోగక ముందే ఓరుగల్లు గడ్డపై పొలిటికల్ హీట్ పీక్స్‌కు చేరింది. గ్రేటర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వ్యూహ ప్రతివ్యూహాలతో ముందడుగు వేస్తున్నాయి. వరంగల్ నగర అభివృద్ధి తామంటే తామే చేశామంటూ ఇరుపార్టీల మధ్య క్రెడిట్ వార్ నడుస్తోంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారాస్త్రాలుగా మారిన పెండింగ్ ప్రాజెక్టులు, కేంద్ర, రాష్ట్ర నిధుల లెక్కలపై ఇప్పుడు ఇరుపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
మామునూరు ఎయిర్‌పోర్ట్.. ఎవరి పాత్ర ఎంత?
ఓరుగల్లు ప్రజల దశాబ్దాల కల అయిన మామునూరు విమానాశ్రయ పునరుద్ధరణ అంశం ఇప్పుడు ప్రధాన రాజకీయ వేదికగా మారింది. విమానాశ్రయ విస్తరణకు అత్యంత కీలకమైన భూసేకరణ ప్రక్రియ కోసం రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రూ.300 కోట్లను కేటాయించి, అవసరమైన భూమిని ఇప్పటికే ఎయిర్‌పోర్ట్ అథారిటీకి అప్పగించామని గట్టిగా చెప్పుకుంటోంది. అయితే, కేంద్ర ప్రభుత్వం చొరవ చూపడం వల్లే విమానాశ్రయ అభివృద్ధి, భద్రత, భవిష్యత్ కార్యకలాపాల నిర్వహణకు అవసరమైన అన్ని రకాల సాంకేతిక, చట్టపరమైన అనుమతులు మంజూరయ్యాయని బీజేపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు.
కాజీపేట రైల్వే విప్లవం.. ఉత్పత్తికి సర్వం సిద్ధం
కేంద్ర ప్రభుత్వ పరిధిలో వరంగల్ చుట్టుపక్కల జరుగుతున్న రైల్వే అభివృద్ధి పనులను బీజేపీ తన ప్రధాన ప్రచారాస్త్రంగా మలుచుకుంటోంది. ఎన్నో ఏళ్లుగా ఊరిస్తూ వచ్చిన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం ఇప్పటికే 90 శాతం పూర్తి కావడం విశేషం. రాబోయే 2027 జనవరి నుండే ఇక్కడి నుండి రైల్వే కోచ్‌ల ఉత్పత్తి అధికారికంగా ప్రారంభం కానుందని రైల్వే వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. దీనికి తోడు, సుమారు 30 ఎకరాల విస్తీర్ణంలో రూ.కోట్ల వ్యయంతో నిర్మించతలపెట్టిన సరికొత్త రైల్వే టెర్మినల్ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే అత్యాధునికంగా ముస్తాబైన వరంగల్ రైల్వే స్టేషన్‌ను అధికారులు అందుబాటులోకి తెచ్చిన విషయాన్ని కమలనాథులు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.
30 ఏళ్ల యూజీడీ సమస్యకు మోక్షం..
గ్రేటర్ వరంగల్ పరిధిలో మూడు దశాబ్దాలుగా నలుగుతున్న భూగర్భ డ్రైనేజీ సమస్యకు ఎట్టకేలకు మున్సిపల్ ఎన్నికల వేళ మోక్షం లభించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ భారీ ప్రాజెక్టును పట్టాలెక్కిస్తున్నాయి. రాబోయే 2 నుంచి 3 ఏళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టులో కేవలం మురుగునీటి పారుదలే కాకుండా, వర్షపు నీటి ప్రవాహ యాజమాన్య వ్యవస్థను కూడా అనుసంధానించారు. నగరంలో వరద ముంపును నివారించేందుకు వీలుగా స్థానిక చెరువులు, నాలాలు, నీటి వనరుల పునరుజ్జీవనానికి సైతం ఈ నిధులను వాడుతున్నారు. అయితే, అమృత్ పథకం కింద తామే నిధులు తెచ్చామని బీజేపీ చెప్తుండగా.. సమగ్ర నివేదికలు ఇచ్చి, జర్మనీ బ్యాంకుతో కీలక ఒప్పందం కుదిర్చింది తామేనని కాంగ్రెస్ క్లెయిమ్ చేసుకుంటోంది.
బహిరంగ చర్చకు ‘నాయిని’ సవాల్.. బీజేపీ సై
వరంగల్ వేదికగా కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. వరంగల్ పరిధిలో మోదీ ప్రభుత్వం రూ.17వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులను చేపట్టిందని, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, టెర్మినల్ వంటివి కేంద్రం ప్రత్యేక చొరవతోనే సాధ్యమయ్యాయని ప్రకటించారు. దీనిపై వరంగల్ వెస్ట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. కేంద్రం తెలంగాణకు, ముఖ్యంగా వరంగల్‌కు చేసిందేమీ లేదని, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఎయిర్‌పోర్ట్ భూసేకరణ, అభివృద్ధి పనులపై తాము చర్చకు సిద్ధమని, బీజేపీ నేతలు దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ విసిరిన ఈ సవాల్‌ను స్వీకరిస్తూ బీజేపీ సైతం బహిరంగ చర్చకు తాము ఎప్పుడైనా రెడీ అని ప్రకటించడంతో ఓరుగల్లు మున్సిపల్ పోరు ఇరుపార్టీల మధ్య ప్రతిష్టాత్మక సవాల్‌గా మారింది.