– TGRPDCL కు లైసెన్స్ జారీ చేసిన రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి 

– నాలుగు నెలల్లో కార్యకలాపాల ప్రారంభం

– వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కొనసాగింపు 

– మోటర్లకు మీటర్లు వుండవు – తేల్చి చెప్పిన ERC 

వేద న్యూస్, హైదరాబాద్ : 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న తెలంగాణ రైతు విద్యుత్ పంపిణీ సంస్థ (TGRPDCL) కు తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (TGERC) విద్యుత్ పంపిణీ లైసెన్స్ మంజూరు చేసింది. ఉగాది పర్వదినానం మార్చ్ 19 న TGRPDCL లైసెన్స్ కోసం TGERC కి దరఖాస్తు చేసింది. ఈ లైసెన్స్ దరఖాస్తు పై మే 29 న బహిరంగ విచారణ నిర్వహించిన ERC, రైతు సంఘాలు, ఉద్యోగ సంఘాలు, వినియోగదారుల సంస్థలు, విద్యుత్ రంగ నిపుణులు తమ అభ్యంతరాలు, సూచనలను పరిశీలించి, అందిన అన్ని అభిప్రాయాలను అంశాల వారీగా పరిగణనలోకి తీసుకుని కమిషన్ తన ఉత్తర్వుల్లో సమాధానాలు ఇచ్చింది. O.P. No.11 of 2026, O.P. No.14 of 2026 మరియు O.P. No.15 of 2026లపై ఉమ్మడి ఉత్తర్వులు జారీ చేస్తూ, విద్యుత్ చట్టం-2003లోని సెక్షన్ 14తో పాటు సెక్షన్ 131 ప్రకారం కు లైసెన్స్ మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కొత్త డిస్కం రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ విద్యుత్ వినియోగదారులు, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు, మిషన్ భగీరథ/సంయుక్త రక్షిత తాగునీటి పథకాలు, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB), అలాగే ప్రత్యేక పంపిణీ ట్రాన్స్ఫార్మర్ల ద్వారా విద్యుత్ పొందుతున్న మున్సిపల్ తాగునీటి కనెక్షన్లకు సేవలు అందించనుంది. ఈ ఉత్తర్వు తేదీ నుంచి నాలుగు నెలల తర్వాత TGRPDCL వ్యాపార కార్యకలాపాలు ప్రారంభమయ్యే తేదీగా కమిషన్ ప్రకటించింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చట్టంలోని సెక్షన్ 131 ప్రకారం చట్టబద్ధమైన ట్రాన్స్ఫర్ స్కీమ్ ను జారీ చేసిన తర్వాతే లైసెన్స్ అమల్లోకి వస్తుంది. విద్యుత్ చట్టంలోని సెక్షన్ 18 ప్రకారం TGSPDCL, TGNPDCL దాఖలు చేసిన దరఖాస్తులను కూడా కమిషన్ ఆమోదించింది. TGRPDCL కార్యకలాపాలు ప్రారంభమైన తేదీ నుంచి బదిలీ అయ్యే వినియోగదారుల వర్గాలను ఈ రెండు డిస్కంల పరిధి నుంచి తొలగిస్తూ వాటి లైసెన్సులను సవరించింది. మిగతా వినియోగదారులకు సేవలు అందించే బాధ్యతలు, భౌగోళిక పరిధిలో ఎలాంటి మార్పు ఉండదు. మార్పిడి ప్రక్రియ సజావుగా జరిగేలా కమిషన్ పలు కీలక ఆదేశాలు జారీ చేసింది.

– రాష్ట్ర ప్రభుత్వం సెక్షన్ 131 ప్రకారం ట్రాన్స్ఫర్ స్కీమ్ జారీ చేసి సంబంధిత ఆస్తులు, అప్పులు, వినియోగదారులను TGRPDCLకు బదిలీ చేయాలి.

– TGRPDCL మూడు నెలల్లో లోడ్ అంచనాలు, లైన్ నష్టాల తగ్గింపు, ఇంటర్ఫేస్ మీటరింగ్, సిబ్బంది, ఆర్థిక అంశాలతో కూడిన సమగ్ర వ్యాపార ప్రణాళికను కమిషన్కు సమర్పించాలి.

– TGRPDCL, TGSPDCL, TGNPDCL మధ్య ఆపరేషన్ & మెయింటెనెన్స్, వినియోగదారుల డేటా బదిలీ, విద్యుత్ సరఫరా, ఎనర్జీ అకౌంటింగ్ తదితర అంశాలపై అవగాహన ఒప్పందాలు (MOUs), సేవా ఒప్పందాలు (SLAs), బల్క్ సప్లై ఒప్పందాలు కుదుర్చుకుని కమిషన్ ఆమోదానికి సమర్పించాలి.

– 2026-27 ఆర్థిక సంవత్సర మిగిలిన కాలానికి టారిఫ్, ప్రభుత్వ సబ్సిడీ పంపిణీపై డిస్కంలు కమిషన్ను ఆశ్రయించాలి. 2027-28 టారిఫ్ ప్రతిపాదనలను నవంబర్ 30, 2026లోపు సమర్పించాలి.

– TGRPDCL కనీసం రెండు వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదికలను (Consumer Grievance Redressal Forums) ఏర్పాటు చేయాలి. అప్పటి వరకు TGSPDCL, TGNPDCLలోని ప్రస్తుత ఫోరంలే బదిలీ అయ్యే వినియోగదారుల ఫిర్యాదులను పరిష్కరిస్తాయి.

– మార్పిడి ప్రక్రియలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు సహా కొత్త విద్యుత్ కనెక్షన్ల మంజూరును ఎట్టి పరిస్థితుల్లోనూ నిలిపివేయరాదు. TGRPDCL పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించే వరకు TGSPDCL, TGNPDCL యథావిధిగా దరఖాస్తులు స్వీకరించి కొత్త కనెక్షన్లు మంజూరు చేయాలి. ఉద్యోగుల హక్కులు, సీనియారిటీ, పెన్షన్, రిజర్వేషన్ రోస్టర్, పదోన్నతి అవకాశాలకు ఎలాంటి నష్టం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేయాలని కమిషన్ స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ హామీని కమిషన్ తన ఉత్తర్వుల్లో నమోదు చేసింది. రాష్ట్రంలోని వ్యవసాయ వినియోగదారులకు ఉచిత విద్యుత్ సరఫరా యథావిధిగా కొనసాగుతుందని, భవిష్యత్తులో కూడా ఈ విధానంలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది. అలాగే వ్యక్తిగత వ్యవసాయ పంప్సెట్లకు మీటర్లు ఏర్పాటు చేయబోమని ప్రభుత్వం ఇచ్చిన హామీని కూడా ఉత్తర్వుల్లో నమోదు చేసింది. TGRPDCL కూడా ఇతర డిస్కంల మాదిరిగానే టారిఫ్, సేవా ప్రమాణాలు, వినియోగదారుల హక్కులు, నివేదికల సమర్పణ తదితర అన్ని అంశాల్లో తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి పర్యవేక్షణలో పనిచేస్తుంది. మార్పిడి ప్రక్రియను కమిషన్ నిరంతరం పర్యవేక్షిస్తూ, అవసరమైతే ప్రజాహిత దృష్ట్యా మరిన్ని ఆదేశాలు జారీ చేస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *