- భూ తగాదాలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. మహిళకు తీవ్ర గాయం
- 2015 ఒప్పంద పత్రం ఉన్నా న్యాయం జరగడం లేదంటున్న బాధితులు
- సర్పంచ్ వర్గం నుంచి ప్రాణభయం ఉందంటూ పోలీసులను ఆశ్రయించిన కుటుంబం
వేద న్యూస్, వీణవంక:
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం వీణవంక మండలం లక్మాజిపల్లి గ్రామంలో ఐదు గుంటల భూమికి సంబంధించిన వివాదం ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది.
ఈ ఘటనలో గెల్లు శ్రీనివాస్ యాదవ్ కుటుంబానికి చెందిన రజితకు కాలికి తీవ్ర గాయం కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు బాధితులు తెలిపారు.
బాధితుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. తమకు సంబంధించిన ఐదు గుంటల భూమి విషయంలో కొంతకాలంగా వివాదం కొనసాగుతోందన్నారు.
ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుని దాడి జరిగినట్లు పేర్కొన్నారు. దాడిలో తన భార్య రజిత ఫై సర్పంచ్ శ్రీనివాస్ దాడి చేయగా కాలుకు బలమైన గాయం కావడంతో ఆసుపత్రిలో చేర్పించినట్లు తెలిపారు.
ఈ భూమి వివాదానికి సంబంధించి గ్రామ పెద్దమనుషుల సమక్షంలో 2015లో జరిగిన ఒప్పందానికి సంబంధించిన పత్రం తమ వద్ద ఉందని గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. అయినప్పటికీ తమకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు. తమకు న్యాయం చేయడంతో పాటు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు.
గ్రామ సర్పంచ్ వల్ల తమ కుటుంబానికి ప్రాణభయం ఉందని బాధితులు ఆరోపించారు.ఈ భూ వివాదంపై పోలీసులు విచారణ జరిపి, ఇరు వర్గాల వాదనలు మరియు అందుబాటులో ఉన్న పత్రాలను పరిశీలించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.

