వైద్య సేవలకు అడ్డుగా దౌర్జన్యాలు
ప్రైవేట్ ఆసుపత్రులపై రౌడీయిజం నీడ
యువతలో పెరుగుతున్న దౌర్జన్య ధోరణి
వైద్యులపై ఒత్తిడి.. రోగులపైనే ప్రభావం
వైద్య సేవలకు భద్రత కల్పించాల్సిన అవసరం
రాజకీయ పేర్ల దుర్వినియోగాన్ని అరికట్టాలనే అభిప్రాయం
బాధ్యతాయుత సమాజ నిర్మాణానికి అందరి సహకారం అవసరం

వేద న్యూస్, కరీంనగర్ ప్రతినిధి:
సామాన్యుడి నుంచి ప్రముఖుల వరకు ప్రతీ ఒక్కరికీ అత్యంత ముఖ్యమైనవి వైద్య సేవలు. అందులో ప్రభుత్వరంగంతో పాటు ప్రైవేటు ఆస్పత్రుల వైద్య సేవలూ ముఖ్యమైనవే. కాగా, ప్రజలకు అత్యవసర సమయంలో వైద్య సేవలు అందించే ప్రైవేట్ ఆసుపత్రుల్లో కొందరి దౌర్జన్యాలు, బెదిరింపులు ఆందోళన కలిగిస్తున్నాయి. కొందరు వ్యక్తులు రాజకీయ నాయకుల పేర్లు ప్రస్తావిస్తూ ఆసుపత్రి యాజమాన్యాలు, వైద్యులు, సిబ్బందిపై ఒత్తిడి తీసుకురావడం చర్చనీయాంశంగా మారుతోంది. జిల్లాలోని జమ్మికుంట పట్టణంలో ఈ తతంగం నడుస్తున్నట్లు తెలుస్తున్నది. ‘మా వెనుక పెద్దవాళ్లు ఉన్నారు’ అంటూ కొందరు బెదిరింపులకు దిగుతున్నారు. చిన్న వివాదాలను పెద్దవిగా చేసి, ‘మా వాళ్లకు చెబుతాం’, ‘రాజకీయ నాయకులతో మాట్లాడుతాం’ అంటూ బెదిరించడం, ఆసుపత్రుల్లో గందరగోళం సృష్టించడం వంటి ధోరణులు పెరుగుతున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.

వైద్యుడిపై బెదిరింపు.. చివరికి నష్టపోయేది ఎవరు?
వైద్యుడు భయపడితే లేదా ఆసుపత్రి సిబ్బంది ఒత్తిడికి గురైతే దాని ప్రభావం నేరుగా రోగులపై పడే అవకాశం ఉంది. అత్యవసర విభాగంలో ప్రతి నిమిషం విలువైనది. వైద్యులు భయపడకుండా, స్వేచ్ఛగా వైద్య నిర్ణయాలు తీసుకునే వాతావరణం ఉండాలి. అలా కాకుండా వైద్యుడిని బెదిరించడం అంటే కేవలం ఒక వ్యక్తిని బెదిరించడం కాదు.. అత్యవసర వైద్య సేవల వ్యవస్థను బలహీనపరచడమే. ఈ నేపథ్యంలో రాజకీయ నాయకులు స్పందించాల్సిన సమయం ఆసన్నమైంది. తమ పేర్లను ఉపయోగించి ఎవరైనా బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిసినప్పుడు రాజకీయ నాయకులు స్పష్టంగా ఖండించాల్సిన అవసరం ఉంది. ‘మా పేరు చెప్పుకుని ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే సహించం’ అనే సందేశం రాజకీయ నాయకుల నుంచి వస్తే అది సమాజానికి మంచి సంకేతంగా మారుతుంది. రాజకీయ పలుకుబడి అంటే ప్రజలకు సేవ చేయడానికి ఉపయోగించాల్సిన శక్తి.. వ్యక్తిగత దౌర్జన్యాలకు రక్షణ కవచం కాదనే విషయం స్పష్టమవ్వాలి.

యువతకు భవిష్యత్తు కావాలి..
యువతకు కావాల్సింది రౌడీయిజం కాదు.. భవిష్యత్ మాత్రమే అనే సంగతిని గుర్తెరగాలి. యువతకు ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, క్రీడలు, విద్య, వ్యసన విముక్తి కార్యక్రమాలు, కెరీర్ మార్గదర్శకత్వం అందించడంపై ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు దృష్టి పెట్టాలి.
రౌడీయిజంతో సంపాదించేది తాత్కాలిక భయం మాత్రమేనని గుర్తించాలి. విద్యతో సంపాదించేది జీవితాంతం గౌరవం. సమాజం ఆలోచించాల్సిన సమయం, విషయం ఇది. కాగా, యువత ఎందుకు ఈ దారిలోకి వెళ్తున్నది? అనేదే ఇక్కడ అసలు ప్రశ్న. యువతలో పెరుగుతున్న దౌర్జన్య ధోరణికి కారణాలేమిటనే దానిపైన చర్చ జరగాలి. మద్యం?, నిరుద్యోగం?, చెడు స్నేహాలు?, రాజకీయ నాయకుల చుట్టూ తిరిగితే పలుకుబడి వస్తుందనే భ్రమ? నుంచి బయటపడాల్సిన ఆవశ్యకతను గుర్తించాలని నిపుణులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో హింసాత్మక ప్రవర్తనను అనుకరించడం? ఇవన్నీ ఒక్కొక్కటిగా లేదా కలిపి ప్రభావం చూపే అవకాశం ఉంది. మద్యం.. నిరుద్యోగం.. చెడు స్నేహాలు.. రాజకీయ అండదండల భ్రమ వంటి కారణాలపై లోతైన చర్చ అవసరం. నేటి సమాజంలో ప్రతీ ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉండాలంటే అందులో రాజకీయ నాయకులపైన మరింత గురుతర బాధ్యత ఉంటుందని చెప్పొచ్చు. నిరుద్యోగం వల్ల వచ్చే నిరాశ, మద్యం, ఇతర వ్యసనాలు, కుటుంబ పర్యవేక్షణ లోపం, తక్షణ డబ్బు సంపాదించాలనే కోరిక, సమాజంలో ‘భయపెడితేనే గౌరవం’ అనే తప్పుడు భావన యువతను తప్పుదారి పట్టించే ప్రమాదం ఉందని సామాజిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సందర్భంలో అన్ని శాఖల ఉన్నతాధికారులు, ముఖ్యంగా పోలీసు అధికారులు యువతలో పెడదోవకు దారి తీస్తున్న అంశాలు, వారికి కౌన్సెలింగ్ ఇవ్వడం వంటి విషయాలను ప్రాధాన్యతగా గుర్తించాలని, యువతను సన్మార్గంలో నడిపించేందుకుగాను అవసరమైన మేరకు నిఘా పెట్టాలనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *