- జమ్మికుంటలో అరుదైన హైడాటిడ్ సిస్ట్ శస్త్రచికిత్స విజయవంతం
- ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో డాక్టర్ మహిపాల్ ఆధ్వర్యంలో విజయవంతమైన ఆపరేషన్
వేద న్యూస్ , జమ్మికుంట:
జమ్మికుంట పట్టణంలో అరుదైన, క్లిష్టమైన శస్త్రచికిత్సను ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో జనరల్ సర్జన్ డాక్టర్ మహిపాల్ విజయవంతంగా నిర్వహించారు.
సిరిసేడు గ్రామానికి చెందిన 70 ఏళ్ల రైతు 16 సంవత్సరాల క్రితం హనుమకొండలోని ప్రముఖ ఆసుపత్రిలో కాలేయంలోని హైడాటిడ్ సిస్ట్ల తొలగింపునకు లాపరోటమీ శస్త్రచికిత్స చేయించుకున్నారు. అయితే ప్రస్తుతం ఆయనకు కాలేయంతో పాటు పొత్తికడుపులోని పెరిటోనియం ప్రాంతానికి కూడా హైడాటిడ్ వ్యాధి విస్తరించింది.
ఆపరేషన్ చేయడానికి దాదాపు 8 ఆసుపత్రులు నిరాకరించడంతో, రోగి కుటుంబ సభ్యులు పలు ఆసుపత్రులను సంప్రదించిన అనంతరం చివరకు జమ్మికుంటలోని ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ఆశ్రయించారు.
రోగిని పరీక్షించిన డాక్టర్ మహిపాల్, కాలేయంలో సుమారు 12 హైడాటిడ్ పరాన్నజీవి తిత్తులు ఉన్నట్లు గుర్తించారు. పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ, అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి ఎక్స్‌ప్లోరేటరీ లాపరోటమీ ద్వారా శస్త్రచికిత్స చేయాలని రోగి బంధువులకు వివరించారు.
శస్త్రచికిత్స సమయంలో కాలేయం, పొత్తికడుపు ప్రాంతంలో ఉన్న హైడాటిడ్ తిత్తులను, వాటి గోడలను జాగ్రత్తగా తొలగించారు. తిత్తుల్లోని పరాన్నజీవులు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా ఉండేందుకు ప్రత్యేకమైన స్కోలిసైడల్ ఏజెంట్ ఉపయోగించారు. క్లిష్టమైన పరిస్థితుల్లో డాక్టర్ మహిపాల్ తన అనుభవాన్ని ఉపయోగించి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు.
అరుదైన, సాధారణంగా అధిక వ్యయంతో కూడుకున్న ఈ శస్త్రచికిత్సను అతి తక్కువ ఖర్చుతో విజయవంతంగా నిర్వహించడంపై రోగి కుటుంబ సభ్యులు డాక్టర్ మహిపాల్ మరియు ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లో కూడా క్లిష్టమైన, అరుదైన శస్త్రచికిత్సలను అనుభవజ్ఞులైన వైద్యుల ఆధ్వర్యంలో అందుబాటులోకి తీసుకురావడం ద్వారా స్థానిక ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే తమ లక్ష్యమని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి.
