- *పాలపిట్టకు ప్రాణగండం — దసరా సంస్కృతికి హానిగండం
- పాలపిట్ట కనిపించని దసరా వస్తే మన సంస్కృతికి అర్థమేమిటి?
- పాలపిట్టకు బంధనమా? పంజరంలో పెట్టడం నేరం
- వాణిజ్య పంటల విస్తరణ – వ్యవసాయ జీవవైవిధ్యంపై ప్రభావం
- పాలపిట్టల క్షీణతకు పక్షుల సర్వే డేటా ఒక హెచ్చరిక!
- పండుగల పరిరక్షణకు ప్రకృతి పరిరక్షణే పునాది
ప్రకృతి ఒడిలో పుట్టిన భారతీయ పండుగలు – మన సంస్కృతికి జీవనాధారం
భారతీయ సంస్కృతి ప్రకృతితో విడదీయరాని అనుబంధాన్ని కలిగి ఉంది. మన పూర్వీకులు ప్రకృతిని కేవలం వనరుల సంపదగా కాకుండా, జీవనానికి ఆధారమైన తల్లిగా భావించారు. చెట్లను పూజించడం, నదులను పవిత్రంగా ఆరాధించడం, పశువులను, పక్షులను దైవ స్వరూపాలుగా గౌరవించడం, రుతువుల మార్పులను పండుగల రూపంలో జరుపుకోవడం వంటి ఆచారాలు ఆ ప్రకృతి ప్రేమకు నిదర్శనాలు. పంట పండిన సంతోషం, వర్షానికి కృతజ్ఞత, పూలతో అలంకరణ, చెరువుల–గుట్టల–అడవుల పట్ల భక్తిభావం అన్నీ మన పండుగల్లో ప్రకృతికి ఇచ్చిన స్థానాన్ని చెబుతాయి. సంక్రాంతి, ఉగాది, బోనాలు, దసరా, దీపావళి, బతుకమ్మ, వినాయక చవితి వంటి పండుగల్లో ప్రకృతి అంశాలు ఎక్కడైనా కనిపిస్తాయి. పంట పండిన ఆనందం, వర్షానికి కృతజ్ఞత, పూలతో అలంకరణ, చెరువుల–గుట్టల–అడవుల పట్ల భక్తిభావం అన్నీ మన పండుగల్లో ప్రకృతికి ఇచ్చిన స్థానాన్ని చెబుతాయి.
అయితే నేడు పండుగల బాహ్య ఆడంబరాలు, ప్లాస్టిక్ అలంకరణలు, పి.ఓ.పి. విగ్రహాలు, అతిగా వాడే ధ్వని వ్యవస్థలు, రసాయనిక రంగులు, అధిక విద్యుత్ వినియోగం వంటి అంశాలు పండుగల అసలు ప్రాసత్య్రం సారాన్ని మసకబడేస్తున్నాయి. ప్రకృతిని ఆరాధిస్తూనే ప్రకృతిని కలుషితం చేయడం, ఆవాసాలను నాశనం చేయడం మన సంప్రదాయానికి విరుద్ధం. ప్రకృతిని వినియోగించుకునే హక్కు ఒక్క మనిషిదే కాదు. అన్ని జీవులు ఈ భూమిపై జీవించే సమానమైన హక్కు కలిగి ఉన్నాయి. పండుగ అంటే కేవలం ఆనందోత్సవం మాత్రమే కాదు; అది ప్రకృతితో సామరస్యంగా జీవించాలని తరతరాలుగా అందిస్తున్న జీవన సందేశం. మన పండుగలు భవిష్యత్తు తరాలకు చేరాలంటే, వాటికి ప్రాణం పోసే చెట్లు, నీళ్లు, గాలి, మట్టి, పక్షులు, కీటకాలు కూడా సురక్షితంగా ఉండాలి. ప్రకృతిలో వాటి పాత్ర, వాటి జీవవైవిద్య ప్రాధాన్యత ప్రతీ జీవికి ఉంటుంది. మనం వాటి ప్రాధాన్యత గుర్తించి ప్రకృతిని కాపాడి గౌరవిస్తేనే పండుగల పవిత్రత, ప్రశాంతత, ఉనికి నిలుస్తాయి.
దసరా పండుగ – పాలపిట్ట దర్శనంలోని ఆధ్యాత్మికత, సాంస్కృతిక ప్రాధాన్యం
తెలంగాణలో దసరా పండుగకు ప్రత్యేక సాంస్కృతిక ప్రాధాన్యం ఉంది. విజయదశమి రోజున జమ్మిచెట్టు పూజ, పెద్దల ఆశీర్వాదం, బంధుమిత్రుల కలయిక, శుభాకాంక్షల మార్పిడి తరతరాలుగా కొనసాగుతున్నాయి. అలాగే పాలపిట్టను దర్శించడం శుభప్రదమని ప్రజలు నమ్ముతారు. తెలంగాణ ప్రభుత్వం పాలపిట్టను రాష్ట్ర పక్షిగా గుర్తించింది; దసరా రోజున దీని దర్శనం శుభసూచకమని ప్రజల నమ్మకం కూడా అధికారికంగా పేర్కొనబడింది. కానీ ఈ నమ్మకాన్ని సరైన కోణంలో అర్థం చేసుకోవాలి. పాలపిట్టను పట్టుకోవడం, పందిళ్లలో లేదా టెంపుల్ పందళ్లలో చూపించడం, గూళ్లను భంగపరచడం శుభం కాదు; అది పక్షికి తీవ్ర బాధ, ఒత్తిడి, ప్రాణనష్టానికి దారితీసే చర్య. తెలంగాణ అటవీశాఖ కూడా దసరా సందర్భంగా పాలపిట్టలను బంధించి ప్రదర్శించకూడదని స్పష్టంగా హెచ్చరించింది. అసలు శుభం పక్షిని చూడటంలో మాత్రమే కాదు; అది స్వేచ్ఛగా, సురక్షితంగా జీవించేలా మనం ప్రవర్తించడంలో ఉంది. పాలపిట్ట దర్శన సంప్రదాయాన్ని కాపాడాలంటే, దాని చెట్లు, పొలాలు, గడ్డి భూములు, ఆహార వనరులను ఏడాది పొడవునా రక్షించడం మన కర్తవ్యం.
*పాలపిట్ట జీవావరణం – పర్యావరణ సమతుల్యతలో దాని పాత్ర*
పాలపిట్ట అనగా ఇండియన్ రోలర్ (కారాషస్ బెంఘాలెంసిస్). నీలం, గోధుమ, ఆకుపచ్చ రంగుల మిశ్రమంతో అందంగా కనిపించే ఈ పక్షి తెలంగాణ రాష్ట్ర పక్షి. ఇది సాధారణంగా వ్యవసాయ భూములు, బహిరంగ గడ్డి భూములు, పొదసానలు, చెట్లున్న గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తుంది. రోడ్డు పక్క చెట్లపై, వైర్లపై నిశ్చలంగా కూర్చుని ఆహారం కోసం వేచి ఉండటం దీని స్వభావం. పాలపిట్ట ఆహారంలో ఎక్కువ భాగం కీటకాలే. గొంగళి పురుగులు, బీటిల్స్, మిడతలు, గొల్లభామలు వంటి కీటకాలను ప్రధానంగా తింటుంది; అప్పుడప్పుడు చిన్న సరీసృపాలు, కప్పలు వంటి జీవులను కూడా ఆహారంగా తీసుకుంటుంది. అందువల్ల ఇది వ్యవసాయ పర్యావరణ వ్యవస్థలో సహజ కీటక నియంత్రణకు దోహదపడే ప్రయోజనకర పక్షి. పాలపిట్ట సంఖ్య తగ్గడం కేవలం ఒక పక్షి జాతి సమస్య కాదు; పొలాల్లో కీటకాల సమతుల్యత, ఆహార గొలుసు, జీవవైవిధ్యంపై ప్రభావం చూపే సూచిక కూడా. ఒక ప్రాంతంలో పాలపిట్టలు తక్కువగా కనిపిస్తే, ఆహార లభ్యత, గూడు పెట్టుకునే చెట్లు, పురుగుమందుల వాడకం, భూమి వినియోగ మార్పులు వంటి అనేక అంశాలను శాస్త్రీయంగా పరిశీలించాలి. పాలపిట్టను రక్షించడం అంటే దాని జీవన వ్యవస్థను రక్షించడమే.
రసాయనిక పురుగుమందులు – పక్షుల ప్రాణాలకు కనిపించని విషపు ముప్పు
వ్యవసాయంలో పంట నష్టాన్ని తగ్గించేందుకు పురుగుమందులు అవసరమవుతాయి. కానీ అవసరానికి మించి, శాస్త్రీయ సిఫారసులు లేకుండా, తరచుగా లేదా అధిక మోతాదుల్లో వాటిని వాడటం ప్రమాదకరం. పురుగుమందులు లక్ష్య కీటకాలతో పాటు తేనెటీగలు, భూమి కింద జీవించే సూక్ష్మజీవులు, పక్షులకు ఆహారమయ్యే ఇతర కీటకాలను కూడా ప్రభావితం చేయవచ్చు. విషప్రభావానికి గురైన కీటకాలను పక్షులు తిన్నప్పుడు, ఆ రసాయనాలు పక్షుల శరీరంలోకి చేరే అవకాశం ఉంటుంది. రసాయనం స్వభావం, మోతాదు, పక్షి జాతి, బహిర్గత కాలం వంటి అంశాలను బట్టి ప్రభావం మారుతుంది. కొన్ని సందర్భాల్లో పక్షులకు ప్రవర్తనా మార్పులు, పునరుత్పత్తి సమస్యలు, ఆహార కొరత, మరణం సంభవించవచ్చు. అందుకే పొలాల్లో కీటకాలను పూర్తిగా నిర్మూలించాలనే దృక్పథం సరైనది కాదు. సమగ్ర సస్యరక్షణ, జీవ నియంత్రణ, పంట మార్పిడి, అవసరమైనప్పుడు మాత్రమే సిఫారసు చేసిన మోతాదుల్లో పురుగుమందుల వినియోగం అవసరం. రైతులకు పక్షి-హిత వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించాలి. పంటను రక్షించే పేరుతో ప్రకృతి జీవనానికి ముప్పు తెచ్చితే, అది దీర్ఘకాలంలో వ్యవసాయానికే నష్టం.
*చెట్లులేని పొలాలు – పాలపిట్టకు కరిగిపోతున్న సహజ నివాసం*
గతంలో గ్రామీణ ప్రాంతాల్లో పొలాల గట్లపై చెట్లు, పొదలు, సహజ కంచెలు సర్వసాధారణం. అవి పక్షులకు విశ్రాంతి స్థలాలుగా, ఆహారం కోసం వేచి ఉండే కొమ్మలుగా, కొన్ని జాతులకు గూడు పెట్టుకునే అవకాశాలుగా ఉపయోగపడేవి. పాలపిట్ట వంటి పక్షులకు బహిరంగ ప్రదేశాలు, చెట్లు, కీటకాలు లభించే పొలాలు అనుకూల ఆవాసాలు. కానీ వ్యవసాయ యాంత్రీకరణ, భూముల విస్తరణ, రహదారులు, నిర్మాణాలు, వాణిజ్య అవసరాల కోసం భూమి మార్పుల వల్ల పొలాల గట్లపై చెట్లు, పొదలు తగ్గిపోతున్నాయి. చెట్లు లేని పొలాలు పంట ఉత్పత్తికి ఉపయోగపడవచ్చు; కానీ పక్షులకు, కీటకాలకు, ఇతర జీవులకు ఆశ్రయం లేకుండా చేస్తాయి. దీనికి పరిష్కారం అన్ని చెట్లను తొలగించడం కాదు; పొలాల అంచుల్లో స్థానిక వృక్షాలను నాటడం, పాత చెట్లను సంరక్షించడం, సహజ కంచెలను నిలబెట్టడం. రైతు పొలం పంటలకే కాకుండా, ప్రకృతిలోని ఇతర జీవులకు కూడా జీవనాధారంగా మారాలి. అప్పుడే పాలపిట్ట వంటి పక్షులు మన పొలాల మధ్య స్వేచ్ఛగా ఎగురుతూ కనిపిస్తాయి.
వాణిజ్య పంటల విస్తరణ – వ్యవసాయ జీవవైవిధ్యంపై ప్రభావం
వ్యవసాయం కేవలం ఆహార ఉత్పత్తి కాదు; మట్టి, నీరు, మొక్కలు, కీటకాలు, పక్షులు, సూక్ష్మజీవులు పరస్పరం ఆధారపడే జీవన వ్యవస్థ. ఒకప్పుడు జొన్న, సజ్జ, కొర్ర, కంది, పెసర, మినుము, కూరగాయలు వంటి విభిన్న పంటలు సాగు చేసేవారు. ప్రస్తుతం మార్కెట్ డిమాండ్, ధరలు, నీటి లభ్యత, సాగు ఖర్చుల కారణంగా వరి, పత్తి, మిరప, ఉల్లి వంటి వాణిజ్య పంటల వైపు మొగ్గు పెరిగింది. వాణిజ్య పంటల సాగు తప్పు కాదు. కానీ ఒకే రకమైన పంటను విస్తృతంగా సాగు చేయడం, పంటల వైవిధ్యం తగ్గించడం, పొలాల్లోని సహజ వృక్ష సంపదను తొలగించడం వల్ల కొన్ని జీవులకు ఆహారం, ఆశ్రయం తగ్గవచ్చు. పంట మార్పిడి, మిశ్రమ పంటలు, పప్పుధాన్యాల సాగు, పొలాల అంచుల్లో స్థానిక మొక్కల పెంపకం వంటి పద్ధతులు వ్యవసాయ జీవవైవిధ్యాన్ని మెరుగుపరుస్తాయి.
రైతుల ఆర్థిక ప్రయోజనాలను కాపాడుతూనే పర్యావరణ ప్రయోజనాలను పెంచే సమతుల్య వ్యవసాయ విధానాలు అవసరం. ప్రకృతికి స్థానం లేని వ్యవసాయం దీర్ఘకాలంలో నేల ఆరోగ్యానికి, సహజ కీటక నియంత్రణకు, పక్షుల మనుగడకు సవాలుగా మారుతుంది.
*అడవుల విధ్వంసం – వన్యప్రాణులు, పక్షుల ఉనికికి ముప్పు*
అడవులు కేవలం చెట్ల సమూహాలు కావు; అవి అనేక వృక్ష, జంతు, పక్షి, కీటక జాతులకు నిలయాలు. అడవుల నరికివేత, గనుల తవ్వకాలు, రహదారులు, నిర్మాణాలు, వ్యవసాయ విస్తరణ వంటి కారణాలతో సహజ ఆవాసాలు విచ్ఛిన్నమైతే, అక్కడ జీవించే జీవుల మనుగడపై ప్రభావం పడుతుంది. ఆహారం, నీరు, నివాసం కోల్పోయిన కొన్ని వన్యప్రాణులు గ్రామాలు, వ్యవసాయ భూములు, పట్టణ ప్రాంతాలకు రావడం జరుగుతుంది. అయితే ప్రతి పక్షి జాతి లేదా ప్రతి వన్యప్రాణి తగ్గుదలకు అడవుల నరికివేత ఒక్కటే కారణమని చెప్పలేం. ప్రతి జాతి జీవన అవసరాలను బట్టి ప్రభావాలు మారతాయి. పాలపిట్ట సాధారణంగా బహిరంగ వ్యవసాయ ప్రాంతాల్లోనూ కనిపించే పక్షి అయినప్పటికీ, స్థానిక చెట్లు, గూడు పెట్టుకునే ప్రదేశాలు, ఆహార వనరుల నష్టం దాని జీవనావకాశాలను ప్రభావితం చేయగలవు. అందువల్ల అడవుల పరిరక్షణతోపాటు గ్రామీణ చెట్ల సంపద, గుట్టలు, గడ్డి భూములు, చెరువుల పరిసరాలు, పొలాల అంచుల్లోని సహజ వృక్ష సంపదను కూడా కాపాడాలి. ప్రకృతిలోని ప్రతి ఆవాసానికి ప్రత్యేక విలువ ఉంది. అడవులను కాపాడటం అంటే అక్కడ జీవించే జీవులకే కాకుండా, మానవ సమాజానికి కూడా భవిష్యత్తును భద్రపరచడం.
*సంప్రదాయం పేరుతో పాలపిట్టకు బంధనమా? పంజరంలో పెట్టడం నేరం!*
తెలంగాణలో విజయదశమి రోజున పాలపిట్టను చూడటం ఒక సంప్రదాయంగా కొనసాగుతోంది. అయితే ఈ సంప్రదాయం పేరుతో కొందరు పాలపిట్టలను పట్టుకుని పంజరాల్లో బంధించడం, ప్రజలకు చూపించి డబ్బులు వసూలు చేయడం, సెంటిమెంట్‌ను ఆసరాగా చేసుకుని ఆర్థిక ప్రయోజనాలు పొందడం వంటి చర్యలకు పాల్పడటం ఆందోళనకరం. పాలపిట్ట ప్రకృతిలో స్వేచ్ఛగా విహరించాల్సిన వన్యపక్షి. దానిని బంధించి, ప్రజలకు చూపించడం ద్వారా సంప్రదాయాన్ని పాటిస్తున్నామని భావించడం సరికాదు. పాలపిట్టను చూడటం సంప్రదాయం కావచ్చు; కానీ దానిని బంధించడం, పట్టుకోవడం, విక్రయించడం లేదా వ్యాపార ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం కావచ్చు. భారతదేశంలో అమలులో ఉన్న వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1972 (వైల్డ్ లైఫ్ (ప్రొటెక్షన్) యాక్ట్, 1972) ప్రకారం రక్షిత వన్యప్రాణుల వేట, అక్రమ పట్టివేత, స్వాధీనంలో ఉంచుకోవడం, నిర్భందించడం, పంజారల్లో పెట్టడం, వాటి రవాణా, విక్రయం వంటి చర్యలు చట్టపరమైన నేరాలుగా పరిగణించబడవచ్చు. పాలపిట్టకు వర్తించే రక్షణ నిబంధనలు, సంబంధిత షెడ్యూల్, నేర స్వభావాన్ని బట్టి శిక్షలు నిర్ణయించబడతాయి. అందువల్ల దసరా పండుగ సందర్భంగా పాలపిట్టలను పట్టుకోవడం, వాటికి ఉచ్చులు వేయడం, పంజరాల్లో బంధించడం, ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి అక్రమంగా తరలించడం, నిల్వ ఉంచడం, సరఫరా చేయడం, విక్రయించడం వంటి చర్యలను అరికట్టేందుకు అటవీశాఖ, పోలీసుశాఖ సమన్వయంతో ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేయాలని కోరుతున్నాను. పండుగ రోజున ముఖ్యమైన కూడళ్లు, గ్రామీణ ప్రాంతాలు, మార్కెట్లు, ప్రజలు ఎక్కువగా గుమిగూడే ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహించి, పాలపిట్టలను బంధించి చూపిస్తున్నట్లు లేదా అక్రమ వ్యాపారం జరుగుతున్నట్లు గుర్తిస్తే చట్టప్రకారం కేసులు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలి. ప్రజలు కూడా ఇలాంటి ఘటనలను గమనిస్తే సంబంధిత అటవీ అధికారులకు సమాచారం అందించాలి. పిట్టను పంజరంలో బంధించి పూజించడం కాదు, ప్రకృతిలో స్వేచ్ఛగా ఎగురుతున్న పాలపిట్టను చూసి ఆనందించడమే నిజమైన ప్రకృతి ఆరాధన. సంప్రదాయం పేరుతో మూగజీవుల స్వేచ్ఛను హరించకుండా, చట్టాన్ని గౌరవిస్తూ, ప్రకృతిని పరిరక్షిస్తూ దసరా పండుగను జరుపుకుందాం. పాలపిట్టను కాపాడటం మన సంస్కృతిని, జీవవైవిధ్యాన్ని, భవిష్యత్తు తరాల ప్రకృతి వారసత్వాన్ని కాపాడటమే!
కోతులు – పక్షుల మధ్య సంబంధం – శాస్త్రీయ పరిశీలన
అడవుల్లో ఆహారం, నీరు, నివాస ప్రదేశాలు తగ్గిపోవడం వల్ల కొన్ని ప్రాంతాల్లో కోతులు గ్రామాలు, వ్యవసాయ భూములు, పట్టణ ప్రాంతాలకు రావడం కనిపిస్తుంది. కోతులు సర్వభక్షక స్వభావం కలిగిన జీవులు; పండ్లు, ఆకులు, విత్తనాలు, కీటకాలు తింటాయి. కొన్ని సందర్భాల్లో పక్షుల గుడ్లు లేదా పిల్లలను కూడా తినవచ్చు. పక్షుల గుడ్లు, పిల్లలకు ముప్పు కలిగించే సమస్యను శాస్త్రీయ దృక్పథంతో అర్థం చేసుకోవాలి. అడవుల పరిరక్షణ, సహజ ఆహార వనరుల పునరుద్ధరణ, వన్యప్రాణుల సహజ ఆవాసాల రక్షణ, మానవ–వన్యప్రాణి సంఘర్షణ తగ్గించే చర్యలు చేపట్టాలి. కోతులను హింసించడం లేదా చంపడం పరిష్కారం కాదు. పర్యావరణ వ్యవస్థలో ప్రతి జీవికి స్థానం ఉంది. ఒక జాతిని రక్షించాలనే పేరుతో మరొక జాతిని శత్రువుగా చూడకుండా, వాటి మధ్య సంబంధాలను అర్థం చేసుకుని సమగ్ర పరిష్కారాలను అమలు చేయాలి.
*పాలపిట్టల సంఖ్య తగ్గుతోందా? – పరిశీలన, పరిశోధన, పౌరుల భాగస్వామ్యం*
దసరా రోజున గతంలో కనిపించినంతగా ఇప్పుడు పాలపిట్టలు కనిపించడం లేదని కొందరు ప్రజలు భావించవచ్చు. ఇటువంటి స్థానిక పరిశీలనలు పర్యావరణ మార్పులపై అవగాహన కలిగించడానికి ఉపయోగపడతాయి. అయితే ఒక ప్రాంతంలో ఒకటి రెండు రోజులు పక్షులు కనిపించకపోవడాన్ని మాత్రమే ఆధారంగా తీసుకుని వాటి సంఖ్య తగ్గిపోయిందని లేదా అంతరించిపోతున్నాయని నిర్ధారించలేం. పక్షుల జనాభా మార్పులను తెలుసుకోవడానికి ఒకే ప్రాంతంలో, ఒకే విధమైన పద్ధతులతో, నిర్దిష్ట కాలవ్యవధుల్లో పునరావృత సర్వేలు నిర్వహించాలి. కానీ పక్షి ఘనంకాల సెర్వేలు జాతులు నశిస్తున్నాయని తెలియచేస్తున్నాయి. అందుకు ఈ పాలపిట్ట… లిస్ట్ లో ఉండడమే ఒక నిదర్శనం. పాలపిట్టల దర్శనాల తేదీలు, ప్రదేశాలు, సంఖ్య, చెట్ల లభ్యత, పంటల స్వభావం, పురుగుమందుల వినియోగం వంటి వివరాలను నమోదు చేయడం ద్వారా స్థానిక స్థాయిలో ఉపయోగకరమైన సమాచారం సేకరించవచ్చు. పక్షుల పరిశీలకులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, అటవీశాఖ, వ్యవసాయశాఖ కలిసి పౌర శాస్త్ర కార్యక్రమాలను నిర్వహించవచ్చు. గూళ్లున్న చెట్లను గుర్తించి రక్షించడం, పక్షులకు హాని కలిగించే చర్యలను సంబంధిత అధికారులకు తెలియజేయడం, పక్షుల ఫొటోలు మరియు పరిశీలనలను తేదీ, ప్రదేశంతో నమోదు చేయడం వంటి చర్యలు ఉపయోగపడతాయి. శాస్త్రీయ ఆధారాలు, స్థానిక అనుభవాలు, ప్రజల భాగస్వామ్యం కలిసినప్పుడే పాలపిట్టల వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకుని సమర్థవంతమైన పరిరక్షణ చర్యలు చేపట్టగలం.
*పాలపిట్టల క్షీణతకు పక్షుల సర్వే డేటా ఒక హెచ్చరిక!*
దసరా పండుగతో ప్రత్యేక అనుబంధం కలిగిన పాలపిట్ట (ఇండియన్ రోల్లర్ – కారాషస్ బెంఘాలెంసిస్) ఇప్పుడు పరిరక్షణ పరంగా గంభీరమైన ఆందోళన కలిగిస్తోంది. స్టేట్ ఆఫ్ ఇండియన్ బర్డ్స్ అప్డేటెడ్ విశ్లేషణ ప్రకారం, దేశవ్యాప్తంగా పక్షి పరిశీలకులు ఈ-బర్డ్ వేదికపై నమోదు చేసిన సుమారు 4.8 కోట్ల పరిశీలనల ఆధారంగా 942 పక్షి జాతుల స్థితిని అంచనా వేశారు; వీటిలో పాలపిట్ట దీర్ఘకాలిక జనాభా ధోరణి సుమారు 41.52% క్షీణతను, ఇటీవలి వార్షిక ధోరణి సుమారు 3.77% తగ్గుదలను సూచిస్తోంది. ఇవి ప్రత్యక్ష జనాభా లెక్కలు కాకుండా, పౌర శాస్త్ర పరిశీలనల ఆధారంగా రూపొందిన శాస్త్రీయ అంచనాలే అయినప్పటికీ, ఒకప్పుడు సర్వసాధారణంగా కనిపించే ఈ పక్షి క్రమంగా తగ్గుతున్నట్లు స్పష్టమైన హెచ్చరికను అందిస్తున్నాయి. దీని ఫలితంగానే అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సంఘం (ఐ.యూ.సి.ఎన్) 2025లో పాలపిట్టను ‘లీస్ట్ కన్సర్న్’ నుంచి ‘నియర్ త్రీటెనెడ్’ (ముప్పుకు చేరువైన జాతి)గా అప్‌గ్రేడ్ చేసింది. వ్యవసాయ భూముల్లో పురుగుమందుల విచక్షణారహిత వినియోగం, పొలాల గట్లపై చెట్ల నరికివేత, గడ్డి భూములు–పొదసానల క్షీణత, ఆహారంగా తీసుకునే కీటకాల తగ్గుదల, విద్యుత్ తీగల వల్ల ఎలక్ట్రోక్యూషన్ వంటి అంశాలు దీని మనుగడకు ముప్పుగా గుర్తించబడ్డాయి.
అంతేకాకుండా, దసరా సంప్రదాయం పేరుతో పాలపిట్టలను పట్టుకోవడం, పంజరాల్లో బంధించడం, పందళ్లలో ప్రదర్శించడం వంటి చర్యలు పక్షికి తీవ్ర ఒత్తిడిని, ప్రాణనష్టాన్ని కలిగిస్తాయి; అటవీశాఖ కూడా ఇటువంటి ప్రదర్శనలపై హెచ్చరిక జారీ చేసింది. పాలపిట్ట ఇంకా విస్తృత ప్రాంతాల్లో కనిపిస్తున్నప్పటికీ, ఈ క్షీణత ధోరణిని నిర్లక్ష్యం చేయడం ప్రమాదకరం. దసరా రోజున దానిని దూరం నుంచి దర్శించడమే శుభం; దాని చెట్లను, పొలాలను, సహజ ఆవాసాలను కాపాడటమే నిజమైన పూజ. పాలపిట్టను చూడటం సంప్రదాయం… పాలపిట్టను కాపాడటం మనందరి బాధ్యత!.
భారత రాజ్యాంగం చెప్పే పర్యావరణ బాధ్యత – ప్రతి పౌరుడి కర్తవ్యం
భారత రాజ్యాంగం పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యమిచ్చింది. ఆర్టికల్ 48A ప్రకారం పర్యావరణాన్ని పరిరక్షించడం, మెరుగుపరచడం, అడవులు మరియు వన్యప్రాణులను కాపాడడం కోసం రాష్ట్రం కృషి చేయాలి. అదే విధంగా ఆర్టికల్ 51ఏ(జి) ప్రకారం అడవులు, సరస్సులు, నదులు, వన్యప్రాణులతో సహా సహజ పర్యావరణాన్ని రక్షించడం, అభివృద్ధి చేయడం, జీవుల పట్ల కరుణ చూపడం ప్రతి పౌరుడి ప్రాథమిక విధి. అదనంగా, ఆర్టికల్ 51ఏ(హెచ్) శాస్త్రీయ దృక్పథం,
మానవతావాదం, విచారణాస్ఫూర్తి, సంస్కరణల భావనను పెంపొందించుకోవాలని పౌరులకు సూచిస్తుంది. ఈ రాజ్యాంగ విలువలను ఆచరణలో పెట్టడం అంటే చెట్లు నాటడమే కాకుండా ఉన్న చెట్లను కాపాడటం, నీటి వనరులను కలుషితం చేయకుండా ఉండటం, వన్యప్రాణులను వేధించకపోవడం, పక్షుల ఆవాసాలను ధ్వంసం చేయకుండా చూడటం, వ్యవసాయంలో పర్యావరణహిత పద్ధతులను ప్రోత్సహించడం కూడా. ప్రభుత్వాలు చట్టాలను సమర్థవంతంగా అమలు చేయాలి; స్థానిక సంస్థలు సహజ వనరుల పరిరక్షణకు ప్రణాళికలు రూపొందించాలి; స్వచ్ఛంద సంస్థలు ప్రజల్లో అవగాహన కల్పించాలి; ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి. రాజ్యాంగం పుస్తకాల్లో చదివే అంశంగా మాత్రమే మిగలకుండా మన దైనందిన జీవితంలో కార్యాచరణ రూపంలో ప్రతిబింబించాలి.
*పండుగల సంరక్షణకు ప్రకృతి సంరక్షణే పునాది – ఆచరణలో మార్పు రావాలి*
పండుగల సంస్కృతి భవిష్యత్తు తరాలకు చేరాలంటే వాటికి ఆధారమైన ప్రకృతి, జీవవైవిధ్యం కూడా భద్రంగా ఉండాలి. పాలపిట్టను చూడటానికి దసరా రోజున పొలాలకు వెళ్లే సంప్రదాయాన్ని కొనసాగించాలంటే, ఆ పక్షి నివసించగలిగే వాతావరణాన్ని ఏడాది పొడవునా పరిరక్షించాలి. పంటల గట్లపై స్థానిక చెట్లను పెంచడం, పాత చెట్లను కాపాడటం, అనవసరంగా పొదలను తొలగించకుండా చూడటం, రసాయనిక పురుగుమందుల వినియోగాన్ని తగ్గించే సమగ్ర సస్యరక్షణ పద్ధతులను అనుసరించడం, చెరువులు–గుట్టలు–గడ్డి భూముల సహజ స్వరూపాన్ని కాపాడటం వంటి చర్యలు అవసరం. పాఠశాలలు, కళాశాలల్లో పక్షుల పరిశీలన కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులకు జీవవైవిధ్యంపై అవగాహన కల్పించాలి. దసరా సందర్భంగా పాలపిట్టను బంధించడం, పట్టుకోవడం లేదా దాని గూళ్లను భంగం చేయడం కాకుండా, దూరం నుంచి గమనించి దాని స్వేచ్ఛను గౌరవించే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. పండుగల సందర్భంగా ప్రకృతికి హాని కలిగించే చర్యలను తగ్గించి, పర్యావరణహిత ఆచారాలను ప్రోత్సహించాలి. రైతులకు పక్షి-హిత వ్యవసాయంపై శిక్షణ ఇవ్వాలి. ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, గ్రామపంచాయతీలు కలిసి స్థానిక జీవవైవిధ్య పరిరక్షణ కార్యక్రమాలను చేపట్టాలి. పండుగను జరుపుకోవడం మన ఆనందం; ఆ ఆనందానికి కారణమైన ప్రకృతిని కాపాడటం మన బాధ్యత. పాలపిట్టను పంజరంలో బంధించడం గమనిస్తే వెంటనే అటవీశాఖకు సమాచారం ఇవ్వండి!
దసరా పండుగ సందర్భంగా పాలపిట్టలను పట్టుకుని, రెక్కలు కత్తిరించి, పంజరాల్లో బంధించి ప్రజలకు చూపించడం లేదా విక్రయించడం వంటి అక్రమాలు ఎక్కడైనా మీ దృష్టికి వస్తే మౌనంగా ఉండకండి. తెలంగాణ అటవీశాఖ ప్రచారం చేస్తున్న టోల్‌ఫ్రీ నంబర్లకు 1800 425 5364 (అటవీ వన్యప్రాణి నేరాల నియంత్రణ విభాగానికి చెందిన ఉచిత టోల్ ఫ్రీ నంబర్ – 24/7 అందుబాటులో ఉంటుంది), 1926 (అటవీ శాఖ సాధారణ హెల్ప్‌లైన్) స్వచ్ఛంద వన్యప్రాణి రక్షణ సంస్థల నంబర్లు (మరింత వేగవంతమైన సహాయం కోసం): అనిమల్ వారియర్స్ కన్సర్వేషన్ సొసైటీ (AWCS): 9697887888, పీపుల్ ఫర్ అనిమల్స్ (PFA) హైదరాబాద్: 9803338666 తెలియ చేయవచ్చు. వన్యప్రాణులను రక్షించడం అటవీశాఖ బాధ్యత మాత్రమే కాదు; ప్రతి పౌరుడి ప్రాథమిక కర్తవ్యం కూడా. సమాచారం అందించే వారి పేరు, ఫోన్ నంబర్ వంటి వ్యక్తిగత వివరాలను అటవీశాఖ గోప్యంగా ఉంచాలని కోరుతూ, భయపడకుండా అక్రమాలను అధికారుల దృష్టికి తీసుకురావాలి. పాలపిట్టను బంధించడం సంప్రదాయం కాదు —దాన్ని స్వేచ్ఛగా ఎగరనివ్వడమే నిజమైన ప్రకృతి ప్రేమ!
*రేపటి దసరాకు పాలపిట్ట కనిపించాలంటే – మనిషిలో మార్పు రావాలి*
దసరా రోజున పాలపిట్టను చూస్తే విజయాలు సిద్ధిస్తాయనే నమ్మకంతో, కొందరు పాలపిట్టలను పట్టుకుని, రెక్కలు కత్తిరించి, పంజరాల్లో బంధించి, డబ్బులకు విక్రయించడం అత్యంత బాధాకరం. శుభం కలుగుతుందనే నమ్మకంతో ఒక పక్షి స్వేచ్ఛను హరించడం ఎంతవరకు సమంజసం? ఈ చర్యలు పాలపిట్టల మనుగడకు ముప్పు కలిగించడమే కాకుండా, వాటి సంతతి క్షీణించడానికి కూడా కారణమయ్యే ప్రమాదం ఉంది. సంప్రదాయం పేరుతో మూగజీవాలను హింసించడం మన సంస్కృతి కాదు. పాలపిట్టను బంధించి చూడటం కాదు, ప్రకృతిలో స్వేచ్ఛగా ఎగురుతుంటే దర్శించడమే నిజమైన శుభసూచకం. అటవీశాఖ, పోలీసుశాఖ ఇలాంటి అక్రమాలను అరికట్టి, బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి. పాలపిట్టను చూడటం సంప్రదాయం… దాన్ని స్వేచ్ఛగా బతకనివ్వడం మన బాధ్యత!
ఒక పండుగకు సంబంధించిన సంప్రదాయం తరతరాలుగా కొనసాగాలంటే దాని వెనుక ఉన్న ప్రకృతి కూడా సజీవంగా ఉండాలి. మనం పండుగ రోజున పాలపిట్టను చూడాలని కోరుకుంటూ, మిగిలిన రోజుల్లో దాని ఆవాసాలను నాశనం చేస్తే మన సంప్రదాయానికి మనమే విరుద్ధంగా ప్రవర్తించినట్లవుతుంది. ప్రకృతిని కాపాడటం అటవీశాఖకు, ప్రభుత్వాలకు, పర్యావరణవేత్తలకు లేదా స్వచ్ఛంద సంస్థలకు మాత్రమే సంబంధించిన పని కాదు; ప్రతి రైతు, ప్రతి విద్యార్థి, ప్రతి కుటుంబం, ప్రతి పౌరుడి బాధ్యత. రైతు తన పొలంలో చెట్లను కాపాడితే, ప్రభుత్వం సహజ ఆవాసాలను పరిరక్షిస్తే, శాస్త్రవేత్తలు పక్షుల పరిస్థితిని అధ్యయనం చేస్తే, స్వచ్ఛంద సంస్థలు ప్రజల్లో అవగాహన కల్పిస్తే, ప్రజలు వన్యప్రాణులను గౌరవిస్తే పాలపిట్ట వంటి పక్షులకు మెరుగైన జీవనావకాశాలు కల్పించవచ్చు. ప్రకృతిని కేవలం ఆర్థిక లాభాల సాధనంగా కాకుండా మనుగడకు మూలాధారంగా చూడాల్సిన సమయం ఇది. పాలపిట్ట కనిపించని దసరా మనకు ఒక హెచ్చరికగా మారకముందే, పాలపిట్టను కాపాడే దసరాను మనమే నిర్మించుకోవాలి. మన పండుగలు నిలవాలి, మన సంప్రదాయాలు బతకాలి, మన పొలాలు పచ్చగా ఉండాలి, మన అడవులు సజీవంగా ఉండాలి, మన పక్షులు స్వేచ్ఛగా ఎగరాలి. అప్పుడు మాత్రమే మనం రాబోయే తరాలకు సంస్కృతిని మాత్రమే కాకుండా, ఆ సంస్కృతికి ప్రాణమైన ప్రకృతిని కూడా వారసత్వంగా అందించగలం. పాలపిట్టను చూడటం ఒక సంప్రదాయం… పాలపిట్టను కాపాడటం మన బాధ్యత! ప్రకృతిని రక్షిద్దాం – పండుగల పవిత్రతను, భవిష్యత్తు తరాల భద్రతను కాపాడుదాం. మన సంస్కృతిని నిలబెడదాం!.
“ప్రకృతి రక్షతి రక్షితః” — పక్షులను కాపాడుదాం, మన సంస్కృతిని నిలబెట్టుకుందాం!
— పిట్టల రవిబాబు, పర్యావరణవేత్త, మాజీ సహాయ ఆచార్యులు, JNTUH, హైదరాబాద్ మరియు సంయుక్త కార్యదర్శి, ఓరుగల్లు వైల్డ్‌లైఫ్ సొసైటీ (OWLS) NGO, తెలంగాణ. సెల్: +91 9849425271.*
