వేద న్యూస్, డెస్క్:

తెలంగాణ కెనడా సంఘం (TCA) ఆధ్వర్యంలో కెనడాలోని గ్రేటర్ టొరంటో నగరంలో తెలంగాణ వాసులు ఉగాది పండుగ సాంస్కృతిక ఉత్సవాలు డాంటే అలిగేరి అకాడమీ, కిప్లింగ్ లో అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ సంబరాలలో దాదాపు 1,500  మందికి పైగా తెలంగాణ వాసులు పాల్గొన్నారు.

గుప్తేశ్వరి వాసుపిల్లి , సరిత ప్యారసాని , ప్రసన్న గుజ్జుల , భవాని సామల, విజయ చిత్తలూరి ఉత్సవాల ప్రారంభంలో జ్యోతి ప్రజ్వలన చేయగా గుప్తేశ్వరి వాసుపిల్లి గణేష వందనంతో ఉగాది 2024 సంబురాలను స్టార్ట్ చేశారు. 

ఈ సంబురాలను తెలంగాణ కెనడా అసోసియేషన్ ఎగ్జిక్యూటీవ్ కమిటీ ఆధ్వర్యంలో బోర్డు అఫ్ ట్రస్టీ , వ్యవస్థాపక సభ్యుల సహకారంతో విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో తదుపరి ప్రముఖ పూజారి  నరసింహ చారి శ్రోతలకు పంచాంగ శ్రవణం చేశారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా శ్రీరంజని కందూరి, కుమారి ప్రహళిక మ్యాకల వ్యవహరించారు. ఈ ఉత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలకు అనూహ్యమైన స్పందన లభించింది. పలువురు పెద్దలు, చిన్నారులు సాంస్కృతిక ఉత్సవాల్లో పాల్గొని వారి ప్రతిభను చాటారు.

 

చిన్నారులతో ప్రవీణ్ నీలా దర్శకత్వంలో రచించబడిన నాటిక కృష్ణం వందే జగద్గురుం ప్రేక్షకులను మనోరింజింపజేసింది. అలాగే మనబడి చిన్నారులచే ప్రదర్శించబడిన బుర్రకథకు విశేషాదరణ లభించింది. ఈ ఉత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలకు అనూహ్యమైన స్పందన లభించింది. పలువురు పెద్దలు, చిన్నారులు సాంస్కృతిక ఉత్సవాల్లో పాల్గొని వారి ప్రతిభను చాటారు. మొత్తం 87 మంది 25 వినూత్నమైన ప్రదర్శనలతో నాలుగు గంటల పాటు ప్రేక్షకులను అలరింపజేశారు.

టీసీఏ ఉగాది సంచిక విడుదల

తెలంగాణ కెనడా సంఘం వారి అధికారిక తెలుగు పత్రిక “TCA ఉగాది సంచిక” తృతీయ సంచికను అనంతరం విడుదల చేశారు. దీనిని NCPL అధినేత రాంబాబు వాసుపిల్లి ఆవిష్కరించి పాలకమండలి సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా రాంబాబు వాసుపిల్లి మాట్లాడుతూ మాతృభాషని ప్రోత్సహిస్తున్న తెలంగాణ కెనడా సంఘం వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. తెలంగాణ కెనడా సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ మన్నెం మాట్లాడుతూ ఈ సంచిక ప్రారంభించడానికి గల ముఖ్య ఉద్దేశం మన మాతృభాష ప్రాముఖ్యత ఈ తరం నుండి భావితరాలకు అందజేయడం అని తెలిపారు. ఈ కార్యక్రమానికి విచ్చేసినవారందరికీ ఉగాది పచ్చడి, భక్షాలతో కూడిన రుచికరమైన విందు భోజనం ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహక మండలి అధ్యక్షుడు శ్రీనివాస్ మన్నెం , ఉపాధ్యక్షుడు మనోజ్ రెడ్డి, కార్యదర్శి శంతన్ నారెళ్లపల్లి, సంయుక్త కార్యదర్శి రాజేష్ అర్ర , సాంస్కృతిక కార్యదర్శి స్ఫూర్తి కొప్పు , సంయుక్త సాంస్కృతిక కార్యదర్శి కుమారి ప్రహళిక మ్యాకల , కోశాధికారి వేణుగోపాల్ ఏళ్ల , డైరెక్టర్లు –  నాగేశ్వరరావు దలువాయి , ప్రణీత్ పాలడుగు తదితరులు పాల్గొన్నారు.