– సామాన్యుడి ఆపదను సొమ్ము చేసుకుంటున్న మెడికల్ మాఫియా!

– ‘ప్రైవేటు’ వ్యక్తులతో 108 డ్రైవర్ల కాసులబంధం..?

– క్షతగాత్రులను ‘ప్రైవేటు’ ఆస్పత్రులకు చేర్చేలా నిర్వాకం

– ప్రమాద ఘటనా స్థల సమాచారం వెనువెంటనే చేరవేత

– 108 కంటే ముందే ‘ప్రైవేటు’ అంబులెన్సులు అక్కడ ప్రత్యక్షం

– ఆ తర్వాత అక్కడికి చేరుకుని వచ్చే సమయానికి వెళ్లినట్టు రిపోర్టులు

– తెరచాటున పెద్దమాఫియాగా 108 డ్రైవర్లు-ప్రైవేటు వ్యక్తుల నెట్‌వర్క్ 

వేద న్యూస్, ఫోకస్ టీమ్/వరంగల్ జిల్లా:

కాసులే ప్రధాన కాంక్షగా మెడికల్ మాఫియా కొత్త అవతారమెత్తుతోంది. మనిషి ప్రాణాన్ని నిలబెడుతున్నట్టు తెరపైకి కనిపిస్తూ.. అమానవీయంగా క్షతగాత్రుల ప్రాణాలతో చెలగాటమాడేందుకు సైతం వెనుకాడటం లేదు. ఎదుటి వ్యక్తి ‘ఆపద’ను ఆసరాగా చేసుకుని కాసుల సంపాదనకు కనికరం లేకుండా ముందుకు సాగుతున్నట్టు స్పష్టమవుతోంది. ఇందుకు భారీ నెట్‌వర్క్‌ను సైతం ఏర్పరుచుకున్నట్టు తెలుస్తోంది. కాదేదీ సంపాదనకు అనర్హం అనే రీతిన ప్రమాదాన్ని సైతం అధర్మంగా పైసలు పోగేసుకునే మార్గంగా మలుచుకుంటున్నారు.

సంపదగా సమాచారం!

ప్రైవేటు ఆస్పత్రులు తమ సంపదను పెంచుకునేందుకు సామాన్యుడి నెత్తి మీద మెడికల్ భారాన్ని రోజురోజుకూ పెంచుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తమ నెట్‌వర్క్‌ను ఇతర విభాగాల్లో సైతం ఏర్పరుచుకుంటున్నది. ఉదాహరణకు.. ఉమ్మడి వరంగల్ పరిధిలోని ఏదైనా ప్రదేశంలో ప్రమాదం జరిగినప్పుడు..అటుగా వెళ్లే వాహనదారులు లేదా బాటసారులు ‘108’కు ఫోన్ చేసి సమాచారం చేరవేస్తారు. అప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ స్థానిక 108 అంబులెన్సుల చోదకులకు ఆటోమేటిక్‌గా చేరుతుంది. ఆ సందర్భంలో సదరు అంబులెన్సుల డ్రైవర్లు.. ఆ ఇన్ఫర్మేషన్‌ను ఆ లొకేషన్‌లోని ప్రైవేటు ఆస్పత్రుల అంబులెన్స్ డ్రైవర్లకు అందిస్తారు. అంతే ఇక వారు.. క్షణాల్లో అక్కడ ప్రత్యక్షమై.. క్షతగాత్రులను ‘ప్రైవేటు’ ఆస్పత్రులకు చేరవేస్తారు. అలా ప్రైవేటు ఆస్పత్రికి పేషెంటును చేర్చగా, సదరు అంబులెన్సు డ్రైవర్లకు కమీషన్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ క్రమంలో ప్రమాద ఘటనా స్థలానికి ప్రైవేటు ఆస్పత్రుల అంబులెన్సులు వచ్చి వెళ్లిన మరుక్షణమే.. 108 అంబులెన్సులు అక్కడికి చేరుకుంటుండటం గమనార్హం. తాము వచ్చే సరికి క్షతగాత్రులు వెళ్లిపోయారని పై అధికారులకు 108 డ్రైవర్లు నివేదికలు పంపుతున్నట్టు సమాచారం. అలా వారి పనిని పూర్తి చేసుకుని.. సమాచారం చేరవేసినందుకు ‘ప్రైవేటు’ వ్యక్తుల నుంచి కాసులు సంపాదిస్తున్నారు. ఓ వైపు విధులు నిర్వహిస్తున్నట్టు చేసి తమ వృత్తి జీతంతో పాటు.. మరో వైపు ‘ప్రైవేటు’గా సైతం అధర్మంగా డబ్బులు వెనకేసుకుంటున్నారు.

యాక్సిడెంట్ స్పాట్ ‘ప్రైవేటు’ వారికి ఎలా తెలుస్తోంది?

ఏదైనా ప్రదేశంలో యాక్సిడెంట్ జరిగినపుడు ఆ సంగతి..108కు ఫోన్ ద్వారా ఎవరైనా తెలియజేసినపుడు.. ఆ విషయం ప్రైవేటు ఆస్పత్రుల అంబులెన్సుల నిర్వాహకులకు ఎలా తెలుస్తున్నది? అనే విషయం ఆ సమయంలో ఎవరు ప్రశ్నించలేకపోతున్నారు. ఆపదలో సాయం త్వరగా అందాలని అనుకుంటున్నారు. కానీ, ఆ సాయం వెనక ‘మెడికల్ మాఫియా’ కోరలు చాచి వేచి కూర్చున్న సంగతి గమనించలేకపోతున్నారు. ఇక ప్రైవేటు ఆస్పత్రుల బిల్లుల నిర్వాకం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్షతగాత్రులను నడీబజారులో నిలబెట్టిన మాదిరిగా బిల్లుల మీద బిల్లులు వేసి.. అడ్వాన్స్‌గా రూ.వేలు దండుకుంటున్న సంగతి బహిర్గతమే. ఒకవేళ ‘ప్రైవేటు’ ఆస్పత్రిలో అడ్మిట్ అయిన క్షణాల్లో ప్రభుత్వాస్పత్రికి వెళ్లాలనే ఆలోచన వస్తే.. అప్పటికే అడ్వాన్స్‌గా చెల్లించిన రూ.వేలు.. వెనక్కి ఇచ్చే పరిస్థితి ఉండదు. దాంతో పేషెంట్ అటెండెంట్స్ ఆందోళనలో ‘ప్రైవేటు’ ఆస్పత్రిలోనే వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితులను కృత్రిమంగా సృష్టిస్తున్న వైనం నిశితంగా పరిశీలిస్తే స్పష్టమౌతుంది. అయితే, ఆ సమయంలో బంధువులు లేదా క్షతగాత్రులు ఆందోళనలో ఉండటం సహజమే. అప్పుడు వారు తమను ఎంజీఎం లేదా ఏదైనా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాలని అడగలేకపోతున్నారు. ఒకవేళ అడిగినా.. ప్రైవేటు లేదా 108 అంబులెన్సువాలాలు.. ప్రైవేటు ఆస్పత్రులకు తీసుకెళ్లేందుకు మొగ్గుచూపుతున్నట్టు సమాచారం. ఎందుకంటే అక్కడ వారికి పేషెంటును తీసుకొచ్చినందుకు కమీషన్ అందుతుంది కదా..కాగా, మెడికల్ మాఫియా ఇంతలా సామాన్యుడిపై వ్యవస్థీకృతంగా మారి పెనుభారం వేస్తుంటే.. ఈ మాఫియా నెట్‌వర్క్‌ను సర్కారు ఛేదించి సామాన్యుడికి సత్వర వైద్యం అందేలా కృషి చేయాలని పలువురు కోరుతున్నారు.

జరిగిన ఓ ఘటన..

వర్ధన్నపేట నియోజకవర్గానికి చెందిన ఓ వృద్ధ మహిళ తన ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలి స్పృహ కోల్పోయింది. దీంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌కు కాల్ చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న ఆంబులెన్స్ ఆ వృద్ధ మహిళను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్ చూసి పరిస్థితి విషమంగా ఉందని, వరంగల్‌కు తరలించాలని తెలిపారు. దీంతో అదే 108అంబులెన్స్ లో వరంగల్‌కు తరలిస్తున్న క్రమంలో అంబులెన్స్ డ్రైవర్ ఆ వృద్ధ మహిళ కుటుంబ సభ్యులకు ఉచిత సలహా ఇచ్చాడు. ‘ఎంజీఎం ఆస్పత్రికి తీసుకువెళ్తే అక్కడ సరిగ్గా చూడరు. ఓ మూడు ప్రైవేట్ హాస్పటల్స్ నాకు తెలుసు మీకు నచ్చితే అక్కడికి తీసుకువెళ్తాను’ అని అన్నాడు. దీంతో ఆ కుటుంబ సభ్యులు హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకొని వెళ్లారు. అంబులెన్స్ నుంచి దించగానే అడ్వాన్స్‌గా రూ.50 వేలు కట్టాలని చెప్పారు. వెంటనే వారు రూ.50 వేలు అడ్వాన్స్ కట్టారు. ఆ వృద్ధ మహిళ ఎమర్జెన్సీ వార్డులోకి వెళ్లిన 15 నిమిషాల్లో మృతి చెందారు. అసలైతే 108 అంబులెన్స్ డ్రైవర్లు ఎట్టి పరిస్థితిలో ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లకూడదు అనే నిబంధన ఉంది. ఆ నిబంధనకు దాదాపుగా డ్రైవర్లు నీళ్లు వదులుతున్న పరిస్థితులు నెలకొన్నాయి.