- గులాబీ బాస్ మళ్లీ సీఎం కావడం ఖాయం
- బీఆర్ఎస్ కనగర్తి గ్రామ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్
వేద న్యూస్, ఇల్లందకుంట:
ఎన్నో ఏండ్ల కలను సాకారం చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర విధాతగా నిలిచిన గొప్ప నాయకుడు మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అని బీఆర్ఎస్ కనగర్తి గ్రామ ఉపాధ్యక్షుడు తాళ్లపెల్లి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. దశాబ్దాల కల సహకారం చేసిన మహానేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు అని స్పష్టం చేశారు.
ఆదివారం ఇల్లందకుంట మండలం కనగర్తి గ్రామంలో ఆయన గులాబీ పార్టీ 25వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా గులాబీ జెండా ఆవిష్కరించారు. గులాబీ పార్టీ కనగర్తి గ్రామ అధ్యక్షుడు బండ రవి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా, ఆయన మృతికి సంతాపంగా రెండు నిమిషాల పాటు నేతలు, కార్యకర్తలు, బీఆర్ఎస్ శ్రేణులు మౌనం వహించారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ..2001లో గులాబీ జెండా పట్టుకుని.. ఉద్యమాన్ని విజయ తీరానికి చేర్చిన అధినేత, సమైక్య పాలకులను గడగడ లాడించిన ఫైర్ బ్రాండ్ లీడర్ కే.చంద్రశేఖర రావు అని పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత పదేండ్లపాటు రాష్ట్రాన్ని సంక్షేమ రంగంతో పాటు అన్ని రంగాల్లో అగ్ర భాగాన నిలిపిన పరిపాలన దక్షుడు కేసీఆర్ అని వెల్లడించారు. తెలంగాణ ను దేశంలో అగ్రభాగాన నిలిపి.. ప్రజల గుండెల్లో నిలిచిన నేత అని స్పష్టం చేశారు.

వరంగల్ లో రజ తోత్సవ సభ ద్వారా రాష్ట్రంలో రాజకీయంగా ప్రభావం ఉంటుందని చెప్పారు. తెలంగాణలోని ప్రతి అంగుళం, ప్రతి అంశంపై అవగాహన కలిగిన మేధావి, ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్న నాయకుడు కేసీఆర్ మాత్రమేనని పునరుద్ఘాటించారు. గులాబీ జెండా మాత్రమే తెలంగాణలో ప్రజలకు అండ దండ, రక్ష అని నొక్కి చెప్పారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అడ్డగోలు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని ధ్వజమెత్తారు. గ్యారంటీలు అమలు చేయని రేవంత్ సర్కార్ కు ప్రజల బాధలు అసలు పట్టడం లేదని ఫైర్ అయ్యారు. అన్ని రంగాలను అడుగున పడేసి.. కాంగ్రెస్ 17 నెలల కాలంలోనే తెలంగాణ బ్రాండ్ ను దెబ్బతీసిందని విమర్శించారు.
రాష్ట్రంలో ప్రజలందరూ గులాబీ జండా వైపే చూస్తున్నారని, కేసీ ఆర్ మళ్లీ సీఎం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.కార్యక్రమంలో బీ ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డి రాకేష్, మాజీ సర్పంచ్ వాసుదేవరెడ్డి, మాజీ ఉపసర్పంచ్ మహేందర్, మాజీ వార్డు మెంబర్లు, గులాబీ పార్టీ యువ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.