•  బ్లడ్ డొనేట్ చేసి హోప్ ఇవ్వండి
  •  అందరం ఒక్కటై ప్రాణాలను కాపాడుకుందాం
  •  నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి/జమ్మికుంట:

రక్తం అత్యంత విలువైనది.. మానవుడి శరీరంలో తగిన మేరకు రక్తనిల్వలు లేకపోతే వారు తీవ్ర అనారోగ్యం పాలవుతారు. రక్తహీనత సమస్య ప్రపంచమంతా కూడా ఉంది. అలాగే రక్తం తగినంతగా దొరకని పరిస్థితి నెలకొంది. రక్తహీనత, తలసేమియా, హీమోఫీలియా రోగులు, రోడ్డు ప్రమాదంలో తీవ్ర రక్తస్రావం జరిగిన సందర్భాల్లో ఆపదలో ఉన్న వారికి రక్తాన్ని అత్యవసరంగా ఎక్కించాలి. లేకపోతే ప్రాణాలకు ప్రమాదం ఏర్పడొచ్చు. అలాంటి రక్తం ఎవరైనా దానం చేస్తేనే దొరుకుతుంది. ఆ టైంలో బ్లడ్ డొనేట్ చేసే వారు ఆపద్బాంధవులు మాత్రమే కాదు.. ప్రాణదాతలు అని కూడా చెప్పొచ్చు. ఇలాంటి ప్రాధ్యానమైన రక్తదానాన్ని ప్రోత్సహించేలా ప్రపంచ ఆరోగ్య సంస్థ జూన్‌ 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని ఏటా జరుపుతోంది. ‘‘ రక్తం ఇచ్చి.. ఆశ ఇవ్వండి.. మనందరం కలిసి ప్రాణాలు కాపాడుకుందాం’’(Give blood, give hope: together we save lives) అనే నినాదాన్ని ఈ ఏడాది డబ్ల్యూహెచ్‌వో ప్రకటించింది.

ప్రపంచ రక్తదాతల దినోత్సవ చరిత్ర
1901లో ఆస్ట్రేలియాకు చెందిన నోబెల్ బహుమతి విజేత కార్ల్ లాండ్ స్టీనర్ మొదటిసారిగా రక్తాన్ని వర్గీకరించారు. దీంతో ఆయన జయంతి అయిన జూన్ 14 ను ప్రపంచ రక్తదాతల దినోత్సవంగా జరుపుతున్నారు. మొదటిసారిగా ఈ దినోత్సవాన్ని 2004లో విశ్వవ్యాప్తంగా నిర్వహించారు. ప్రమాదాల సమయంలో లేదా మరే ఇతర కారణంగా అయినా బాధితుల శరీరంలో తగినంతగా రక్తం లేకపోతే మరొకరి నుంచి రక్తాన్ని ఎక్కిస్తుంటారు. ఇలా ఒకరి రక్తం మరొకరికి ఇచ్చే విధానమే రక్తదానం. రక్తాన్ని తీసుకొనే వ్యక్తి గ్రహీత అయితే, ఇచ్చే వ్యక్తిదాత, ప్రాణానికి ఆధారం రక్తం. దీనిని కృత్రిమంగా తయారు చేయడానికి లేదా మరో మార్గంలో ఉత్పత్తి చేయడానికి వీలు కాదు. ప్రమాదాలు, వ్యాధులు లేక శస్త్రచికిత్స కారణంగా రక్తం కోల్పోయిన వారికి దాని అవసరం ఏర్పడుతుంది. దీనిని దాతల ద్వారా స్వచ్చందం మాత్రమే స్వీకరించగలుగుతాం.

అవేర్‌నెస్ ఇంపార్టెంట్

రక్తదాతలు ఎవరైనా రక్తాన్ని దానం చేసి, మరొకరి ప్రాణాలను కాపాడవచ్చు. రక్తం ఎప్పుడు అవసరానికి సరిపడక కొరతగానే ఉంటుంది. దీని నివారణకు రక్తదానంపై అవగాహన కల్పిస్తూ, అపోహలను తొలగించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రపంచవ్యాప్తంగా 190 దేశాలలో 13,000 రక్త నిధి కేంద్రాలద్వారా 10 కోట్ల యూనిట్లకన్న ఎక్కువనే రక్తాన్ని స్వీకరిస్తున్నట్టు తెలుస్తోంది. రక్తదాతలలో దాదాపు 30 శాతం మంది మహిళలు ఉండడం గర్వకారణమే. రక్తం దానం చేయడానికి అన్ని రకాల అర్హతలు ఉన్నప్పటికీ అవగాహన లేక చాలామంది రక్తదానం చేయడం లేదు. కొనలేనిది తయారు చేయలేనిది రక్తం. ఇది ఎంతో మంచి పని.. విద్యార్థి దశలోనే చిన్నారులకు చెప్పడం, యువతకు ఆ మేరకు అవగాహన కల్పించడం ద్వారా రక్తదాతలను పెంచవచ్చు.

 

ఎన్నిసార్లు రక్తదానం చేయవచ్చు?
ఆరోగ్యవంతులు ప్రతి 12 వారాలకు పూర్తి రక్తాన్ని దానం చేయొచ్చు. ప్రతి 2 వారాలకు ప్లాస్మాను దానం చేయొచ్చు. దానం చేసిన రక్తానికి తప్పనిసరిగా ఈ పరీక్షలు నిర్వహిస్తారు. రక్తం ద్వారా సంక్రమించే వ్యాధులకు (హెపటైటిస్ , సిఫిలిస్, హెచ్ఐవీ) వంటివి పరీక్షిస్తారు.

రక్తదానంలో ప్రధాన రకాలు:
రక్తం – ప్లాస్మా, ఎరుపు, తెల్ల రక్త కణాలు, ప్లేట్‌లెట్స్, యాంటీబాడీస్, ఇతర భాగాలతో కూడిన ప్రామాణిక దానం. ప్లాస్మా (అఫెరిసిస్ అని పిలుస్తారు). ప్లాస్మాను ఇతర భాగాల నుండి ఒక ప్రత్యేక యంత్రం ద్వారా వేరు చేస్తారు. ఎర్ర రక్త కణాలు దానం అంతటా చక్రాల వారీగా దాతకు తిరిగి ఇవ్వబడతాయి.
ప్లేట్‌లెట్స్ (ప్లేట్‌లెట్‌ఫెరెసిస్ అని పిలుస్తారు) – ప్లాస్మా దానం మాదిరిగానే చేస్తారు. ఎర్ర రక్త కణాలు, ప్లాస్మాను దాతకు తిరిగి ఇస్తారు. గర్భిణులు రక్తదానం చేయడానికి అర్హులు కాదు. రక్తదానం చేయడానికి ముందు, ప్రసవించిన ఆరు వారాల తర్వాత చేయొచ్చు. చాలా మంది దాతలు సంవత్సరానికి 3-4 సార్లు రక్తదానం చేస్తారు.

 
రక్తదానం ఒక ప్రాణం కాపాడే పని: డాక్టర్ ఊడుగుల సురేశ్, జనరల్ ఫిజీషియన్, ‘సంజీవని’ ఆస్పత్రి జమ్మికుంట.


రక్తదానం చేయడం ఒక ప్రాణం కాపాడే పని. ఆరోగ్యవంతులు, 18 నుంచి 75 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు రక్తదానం చేయొచ్చు. రక్తదానం చేసే ముందు, తర్వాత తగినంత నీరు తాగడం చాలా ముఖ్యం. రక్తదానం ద్వారా, అవసరమైన వారికి రక్తమార్పిడి చేయవచ్చు, ఇది ప్రాణాలను కాపాడటానికి సహాయపడుతుంది. రక్తదాతలకు హిమోగ్లోబిన్ స్థాయి 12.5 g/dl కంటే ఎక్కువగా ఉండాలి.45 కిలోల కంటే బరువు ఉండాలి. మీరు దాదాపు 470 ml మొత్తం రక్తాన్ని ఇస్తారు. ఇది సగటు వయోజన రక్త పరిమాణంలో 8%. శరీరం ఈ పరిమాణాన్ని 24 నుంచి 48 గంటల్లో భర్తీ చేస్తుంది మరియు 10 నుంచి 12 వారాలలో ఎర్ర రక్త కణాలను తిరిగి నింపుతుంది.

 


3 నెలలకోసారి బ్లడ్ డొనేట్ చేయొచ్చు:
డాక్టర్ వుషకోయల తనుజ శ్రీ, ఎం.బీ.బీ.ఎస్ (గోల్డ్ మెడలిస్ట్), ఎం.డీ., డీ.ఎన్.బీ. రెస్పిరేటరీ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్, ఎఫ్‌సీఐఎంఎస్, వరంగల్.

ఆరోగ్యవంతంగా ఉన్న వ్యక్తి ప్రతి మూడు నెలలకు ఓసారి రక్తదానం చేయొచ్చు.. ఒకసారి 300 మిల్లీలీటర్ల రక్తాన్ని దానంగా అందించాలి. రక్తదాత నాడి నిమిషానికి 60 నుంచి 100 సార్లు కొట్టుకోవాలి. ఆరోగ్యవంతుని శరీరంలో 5-6 లీటర్ల రక్తం ఉంటుంది. 300-500 మిల్లిలీటర్ల రక్తాన్ని మాత్రమే ఒకసారి దానం చేస్తారు. దీనివల్ల శరీ రంలో రక్తం కొరత ఏ మాత్రం ఏర్పడదు. పైగా ఈ మోతాదు రక్తం శరీరంలో 48 గంటల్లోనే తిరిగి ఉత్పత్తి అవుతుంది. దాతలు ఇచ్చిన రక్తం ప్రత్యేక పద్ధతులలో 35 రోజుల వరకు నిలువ ఉంచే అవకాశం ఉంటుంది. రక్తదానం చేస్తే బలహీనపడి పోతారని, నీరసించి పోతారని, శ్రమతో కూడిన కష్టమైన పనులు చేసుకునేవారు గతం వలె పని చేసుకోలేరని, విపరీతమైన నొప్పి ఉంటుందని అపోహలు ఉన్నాయి. కానీ, ఇవన్నీ నిజం కాదు. రక్తదానం తర్వాత ఎలాంటి బలహీనత, అనారోగ్యం కానీ ఉండక ఎప్పటిలా ఆరోగ్యంగా ఉండి, యథావిధిగా అన్ని రకాల శ్రమతో కూడిన పనులు చక్కగా చేసుకోవచ్చు.