వేద న్యూస్, ఇల్లందకుంట:
ఇల్లందకుంట మండలకేంద్రంలో పైప్ లైన్ లీకేజీ తో హై స్కూల్ రహదారి చెరువును తలపిస్తున్నది . మండలకేంద్రంలో మంగళవారం సీపీఎం మండల కార్యదర్శి చెల్పూరి రాము ఆ ప్రదేశాన్ని సందర్శించి.. మాట్లాడారు. రోజురోజుకూ అభివృద్ధి చెందే మండలం గా ఉండవలసిన ఇల్లందకుంటలో అధికారుల నిర్లక్ష్యంతో హైస్కూలు రహదారి చెరువును తలపిస్తున్నదని వెల్లడించారు.
ప్రజల ఆరోగ్యాలను పట్టించుకోవలసిన అధికారులు గాలికి వదిలేయడంతో ప్రజలు తాగే తాగు నీరు లీకేజీల ద్వారా మురుగునీరుగా మారి పైపుల ద్వారా వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. నిత్యం ఈ రహదారి వెంబడి మండల ఉన్నత అధికారులు, విద్యార్థిని ,విద్యార్థులు, గ్రామ ప్రజలు రాకపోకలు కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు.

గ్రామాల అభివృద్ధి… రాష్ట్ర అభివృద్ధి అని ప్రజలు బాగుండాలని.. పరిసరాల పరిశుభ్రత పాటించాలని గొప్పగా చెప్పే అధికారులకు.. ఈ రహదారి వెంబడి లీకేజీ కనిపించడం లేదా? అని ప్రశ్నించారు.
తక్షణమే జిల్లా కలెక్టర్, ఉన్నత అధికారులు స్పందించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఈ పైపుల లీకేజీ మరమ్మతులు చేయాలని కోరారు. లేనియెడల ప్రజల భాగస్వామ్యంతో పెద్ద ఎత్తన ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.