•  ఊరుకొలుపునకు జంటకు రూ.2 వేలు
  •  ఒంటరి మహిళకు రూ.వెయ్యి, కుమారుడుంటే రూ.2 వేలు
  •  భూములు ఉన్నా, ఉద్యోగం చేస్తున్నా ఇవ్వాల్సిందే..
  •  భూయజమాని ఇవ్వకుంటే కౌలు రైతే ఇవ్వాలి
  •  డబ్బులు ఇవ్వకుంటే భూమి దున్నవద్దు
  •  దామెరకుంటలో గ్రామ పెద్దల తీర్మానం
  •  ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలు, కౌలు రైతులు

వేద న్యూస్, భూపాలపల్లి:

ఊరిపెద్దల నిర్ణయం ఆ గ్రామ పేదలకు ఇక్కట్లు తెచ్చిపెట్టేలా మారింది. సదరు విలేజ్‌లో ఉండే పేదలు, కౌలురైతులు పెద్దలు తీసుకున్న నిర్ణయం మేరకు నడుచుకోకుంటే.. ఆ పెద్దలు తీసుకునే నిర్ణయానికి కట్టుబడే పరిస్థితులు నెలకొన్నాయి. వివరాల్లోకెళితే.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం మండల పరిధిలోని దామెరకుంట గ్రామంలో ఊరుకొలుపు వేడుకకు కొంత మంది గ్రామ పెద్దలు అత్యుత్సాహంతో, నియంతలా చేసిన తీర్మానంతో ప్రజలు ఆశ్చర్చానికి గురవుతున్నారు. ఈ తీర్మానం నిరుపేద, చిన్నరైతులు, కౌలు రైతు కుటుంబాలను ఆర్థిక ఇబ్బందులకు గురిచేసేలా మారిందని గ్రామస్తులు బహిరంగంగా చర్చించుకుంటున్నారు.

జంటకు రూ.2 వేల చొప్పున వసూలు

ఈ నెల 27న చేసిన తీర్మానం లేఖ ప్రకారం.. జిల్లాలోని కాటారం మండలం దామెరకుంట గ్రామపంచాయతీ పరిధిలో ఊరుకొలుపు పోచమ్మకొలుపు కొలవడానికి గ్రామ పెద్దలు, ప్రజలు అందరు కలిసి నిర్ణయించినట్టుగా తీర్మానం చేశారు. ఈ కొలుపు దామెరకుంట గ్రామ ప్రజలు ఒక జతకు(జంటకు) రూ.2 వేలు చొప్పున చందాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఊర్లో భుములు ఉండి బయట ఉన్న రైతులకు, ఉద్యోగము చెస్తున్న వారు కూడా ఒక జతకు రూ.2 వేలు చెల్లించాలని నిర్ణయించారు. ఊర్లో ఉన్నవారు మాత్రమే ఇస్తే కొలుపు ఖర్చులు సరిపోనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామ పెద్దలు తీర్మానించారు. దాదాపు రూ.12 లక్షల ఖర్చు అవుతుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సదరు తీర్మానంలో పేర్కొన్నారు.

 తీర్మానాన్ని వ్యతిరేకిస్తే చర్యలు

ఒక వేల భూమి యజమాని ఇవ్వనియెడల కౌలు రైతు ఆ డబ్బులు ఖచ్చితంగా ఇచ్చేలా తీర్మానం చేశారు. వారు కూడా ఇవ్వకుంటే ఆ భూములు దున్నకూడదని, ట్రాక్టర్లు ఆ పొలాలను దున్నకూడదని పేర్కొన్నారు. ఒంటరి మహిళకు రూ.1,000 ఇవ్వాలని, ఒంటరి మహిళకు కొడుకు ఉన్నచో రూ.2 వేలు ఇవ్వాలని స్పష్టం చేశారు. కాగా, ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తే గ్రామ పెద్దలు తీసుకునే నిర్ణయానికి శిరసావహించాలని, 20 మంది గ్రామ పెద్దలు సంతకాలు చేసి తీర్మానించారు.

మధనపడుతున్న గ్రామస్తులు

ఈ తీర్మానంతో నిరుపేద, చిన్న, కౌలు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దైవ కార్యానికి ప్రజల ఆర్థిక స్థోమతను బట్టి వారు ఇచ్చేదాన్ని బట్టి చందాలు వసూలు చేయాలని.., ఇచ్చినంత తీసుకోకుండా వారు చెప్పినంత ఖచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తీర్మానం చేయడాన్ని పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గ్రామపెద్దలు నియంతృత్వంగా వ్యవహరిస్తూ.. ఎక్కడా లేని విధంగా ఖచ్చితంగా రూ.2 వేలు ఇవ్వాలని తీర్మానం చేయడం ఏమిటని గ్రామస్తులు మధనపడుతున్నారు. ఈ విషయమై జిల్లా అధికారులు స్పందించి గ్రామంలో నిరుపేదలను బహిష్కరించేందుకు చేస్తున్న కుట్రలను అడ్డుకోవాలని కోరుతున్నారు.