• న్యాయం చేయరూ…!
  •  జెడ్పీహెచ్‌ఎస్ కోసం 2016లో భూములు కోల్పోయిన బాధితులు
  •  బదులుగా 2 గుంటల భూమి, ఇల్లు కట్టిస్తామని అప్పటి మంత్రి హామీ
  •  9 ఏండ్లుగా ఎదురుచూపులు.. తమకు న్యాయం చేయాలని వేడుకోలు
  •  అధికారుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయామంటూ ఆగ్రహం
  •  స్కూల్ ఎదుట వంటసామగ్రితో బాధితుల నిరసన
  •  న్యాయం చేసే వరకు అక్కడే ఉంటామని వెల్లడి

వేద న్యూస్, కమలాపూర్:

రాష్ట్ర ఆర్థిక మంత్రి‌గా ఈటల రాజేందర్ ఇచ్చిన మాట నీటి మూట అయిందని, తమకు న్యాయం చేయాలని కోరుతూ బాధితులు ఆందోళన బాట పట్టారు. ప్రస్తుత మల్కాజిగిరి ఎంపీ, 2016లో అప్పటి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఇచ్చిన మాట.. నెరవేరలేదని , తమకు న్యాయం చేయాలని కోరుతూ బాధితులు నిరసన తెలుపుతున్నారు. కమలాపూర్ మండలకేంద్రంలో జెడ్పీహెచ్ఎస్ (బాలుర) స్కూల్ కోసం తాము భూమి ఇవ్వగా, బదులుగా ఇస్తానన్న భూమి ఇంతవరకూ ఇవ్వలేదని, అధికారుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయామని బాధితులు వెల్లడిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బాధితులు సదరు స్కూల్ ఎదుట కూర్చున్నారు. వంటసామగ్రి కూడా తెచ్చుకుని తమకు న్యాయం చేసే వరకూ అక్కడే ఉంటామని పేర్కొంటున్నారు. 

 

హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలకేంద్రంలో 2016లో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల భవనం నిర్మించారు. ఈ స్కూల్ బిల్డింగ్ కోసం భూములు సేకరించగా, అప్పుడు భూములు కోల్పోయిన బాధితులు.. బుధవారం పాఠశాల ఎదుటకు వచ్చి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరిగే వరకూ అక్కడి నుంచి కదలబోమని భీష్మించుకుని కూర్చున్నారు. తమ ఇంటికి సంబంధించిన సామగ్రి అంతా ఇక్కడికే తీసుకొచ్చుకున్నామని, న్యాయం జరిగే వరకు ఇక్కడే ఉంటామని స్పష్టం చేశారు.

పూర్తి వివరాల్లోకెళితే.. కమలాపూర్ మండలకేంద్రానికి చెందిన తోట రజిత‌కు 1.5 గుంటలు, మారం రేణుకకు 3 గుంటలు, కడారి మల్లమ్మకు 2 గుంటలు, శివజ్యోతికి ఇల్లు ఉండేవి. వాటిని.. పాత హై స్కూల్ భవనం కూలగొట్టి.. కొత్త హై స్కూల్ భవనం నిర్మించే క్రమంలో అదనంగా స్థలం అవసరం కావడంతో..పై వారందరి దగ్గర నుంచి భూమిని సేకరించారు.

2016లో ఈ ప్రక్రియ జరగగా, అప్పటి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్.. భూమి ఇస్తున్న వారందరినీ పిలిచి.. భూమిని ఇచ్చినందుకు దానికి బదులుగా గుంటకు రెండు గంటల భూమిని వేరే దగ్గర కేటాయిస్తామని, ఆ భూమిలో ఉచితంగా ఇల్లు కట్టించి ఇస్తామని, ఇంట్లో చదువుకున్న పిల్లలు ఎవరైనా ఉంటే అవకాశం ఉన్నప్పుడు పాఠశాలలో ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తామని మాట ఇచ్చారని, కమలాపూర్ గ్రామ బిడ్డ అయిన మంత్రి తమకు అన్యాయం చేయడని భావించి, కేవలం నోటిమాట ద్వారానే భూమి ఇవ్వడానికి ఒప్పుకుని నిరభ్యంతరంగా భూమిని ఇచ్చామని బాధితులు వెల్లడించారు.

అధికారులు చుట్టూ తిరిగి అలసిపోయాం

అప్పటినుంచి ఇప్పటివరకు తమకు ఎక్కడా భూమి కేటాయించలేదని, ఈ విషయమై అప్పటి మినిస్టర్ ఈటల రాజేందర్ దగ్గరికి పలుమార్లు వెళ్లామని, ఆయన తన అనుచరులకు చెప్పి ఆ పని పూర్తి చేయాలని చెప్పినా.. అధికారుల దగ్గరికి వెళ్లాలని వారు సూచించారని పేర్కొన్నారు. దాంతో అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా తమను పట్టించుకోలేదని తోటరాజు ఆవేదన వ్యక్తం చేశాడు.

2016 నుంచి ఇప్పటివరకు కలెక్టర్లు, ఎమ్మార్వోలు అందరూ మారారని కానీ, తనకు మాత్రం న్యాయం జరగలేదని, అధికారుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగినా కూడా తనకు భూమి కేటాయించట్లేదని ఇక ఓపిక పట్టలేమని స్పష్టం చేశారు. తమకు 2016లో హామీ ఇచ్చిన విధంగా గుంటకు రెండు గుంటల భూమితో పాటు ఇల్లు కట్టించి ఇవ్వాలని, అలా ఇచ్చేవరకు తామంతా పాఠశాలలోనే ఉంటామని భూమి కోల్పోయిన బాధితులు తమ గోడును వెలిబుచ్చారు.