– కలెక్టర్ డాక్టర్ సత్య శారద
వేద న్యూస్, గీసుకొండ :
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మరమ్మతులు, మౌలిక సదుపాయాల కల్పన పనులు చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశించారు. బుధవారం గీసుకొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను కలెక్టర్ డాక్టర్ సత్య శారద సందర్శించి కళాశాలలో విద్యార్థుల సౌకర్యార్థం కావలసిన మౌలిక సదుపాయాలు, చేపట్టుటకు ప్రతిపాదించిన మరమత్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్య శారద మాట్లాడుతూ విద్యార్థులకు ఏలాంటి ఇబ్బందులు కలగకుండా మంచి వాతావరణంలో విద్య బోధించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల మరమ్మతులకు రూ.1.36 కోట్ల నిధులు మంజూరు కాగా, అందులో గీసుగొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు రూ.8.2 లక్షల మంజూరు చేయడం జరిగిందని అన్నారు. ఆయా పనులను చేపట్టి వేగవంతంగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ కళాశాలలో విద్యార్థులకు గణితం సైన్స్, తెలుగు సబ్జెక్టులపై ప్రశ్నలు అడిగారు. విద్యార్థులను చదువులో రాణించటానికి ప్రోత్సహిస్తూ పలు సూచనలు చేశారు. ఏమైనా సమస్యలు ఉన్నాయని విద్యార్థులకు ఈ సందర్భంగా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి శ్రీధర్ సుమన్, టిజీ ఈడబ్ల్యూఐడిసి అసిస్టెంట్ ఇంజనీర్ మురళీకృష్ణ, తహసిల్దార్ రియాజోద్దీన్ ప్రిన్సిపల్ శోభా దేవి తదితరులు పాల్గొన్నారు.