కలెక్టర్ ఇలా త్రిపాఠి
వేద న్యూస్,మిర్యాలగూడ ప్రతినిధి :
నల్గొండ జిల్లాను టిబి ( క్షయ) రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు సవాల్ గా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు.జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో గురువారం నల్గొండ జిల్లా, మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో “టీబి ముక్త్ భారత్ అభియాన్” పై ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశానికి ఆమె హాజరయ్యారు. సాంకేతికత అంతగా అభివృద్ధి చెందని రోజుల్లోనే మన దేశంలో కమ్యూనిటీ సహకారంతో అంటువ్యాధులను సమర్థవంతంగా ఎదుర్కొని పారద్రోలిన ఘనత వైద్య ఆరోగ్యశాఖకు ఉందని ,దీన్ని దృష్టిలో ఉంచుకొని టీబిని సైతం జిల్లా నుండి పూర్తిగా నిర్మూలించేందుకు ఒక సవాల్ గా స్వీకరించాలని అన్నారు.ఇందుకు వైద్య ఆరోగ్యశాఖతో పాటు, సంబంధిత శాఖలు కృషి చేయాలని చెప్పారు. ముఖ్యంగా వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న డాక్టర్లు, సిబ్బంది, ఏఎన్ఎం,ఆశా కార్యకర్తలు విధులను సాధారణ పద్ధతిలో నిర్వర్తించకుండా, గుర్తింపు వచ్చేలా పనిచేయాలన్నారు.
అక్టోబర్ 2 నాటికి క్షయ రహిత నల్గొండగా దిద్దేందుకు కృషి చేయాలన్నారు.ఇందులో భాగంగా ఆశా ఏఎన్ఎంలు గ్రామాలకు వెళ్లి ప్రజలకు టిబి పట్ల అవగాహన కల్పించాలన్నారు. రెండు వారాలకు మించి దగ్గు ఉండే వారిని గుర్తించి చైతన్యం చేసి పరీక్షలు చేయించుకునేలా చూడాలన్నారు.మిర్యాలగూడ ప్రాంతంలో రైస్ మిల్లులు ఎక్కువగా ఉండడం, దుమ్ము ,ధూళి ఎక్కువగా ఉన్నందున, ఈ ప్రాంతంలో టిబి వచ్చేందుకు ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయని,దీనిని దృష్టిలో ఉంచుకొని ఇక్కడి ప్రజలకు,ప్రత్యేకించి రైస్ మిల్లులో పనిచేసే వారు,డ్రైవర్లు, హమాలీలు,ఇతరులు అందరికి పరీక్షలు నిర్వహించేందుకు ఒక షెడ్యూల్ రూపొందించాలని మిర్యాలగూడ సబ్ కలెక్టర్ ను ఆదేశించారు. వివరాలను ఎప్పటికప్పుడు డేటా ఎంట్రీ చేయాలని చెప్పారు.అలాగే ఆశ కార్యకర్తలు ప్రతి గ్రామ పంచాయతీని సందర్శించి టీబి పై అవగాహన కల్పించాలన్నారు . బాగా పనిచేసిన ఆశ,కమ్యూనిటీ హెల్త్ వర్కర్లను సన్మానించడం జరుగుతుందని ఆమె తెలిపారు. నల్గొండ, మిర్యాలగూడ రైస్ మిల్లర్ల సంఘం తరఫున సుమారు 20 లక్షల రూపాయల విలువచేసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్ రే మిషన్ ను వైద్య ఆరోగ్య శాఖకు ఇస్తున్నందుకు ఆమె రైస్ మిల్లర్ల సంఘం ప్రతినిధులను అభినందించారు.
జిల్లా టీబి నియంత్రణ అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ టీబి ముక్త్ భారత్ అభియాన్ కింద చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. జిల్లాలో క్షయ వ్యాధి నివారణకు సర్వేను ముమ్మరం చేయడం , గుర్తించిన రోగులకు వైద్య పరీక్షలతో పాటు, క్రమం తప్పకుండా చికిత్స అందించడం, జిల్లా నుండి పూర్తిగా టీబిని నివారించేందుకు వైద్య ఆరోగ్య శాఖ ద్వారా చర్యలు తీసుకోవడం జరుగుతున్నదని తెలిపారు . 2024 లో జిల్లాలో 2426 టీబి కేసులు గుర్తించగా, ఇందులో 66 మంది చనిపోయారని, ఈ సంవత్సరం ఇప్పటివరకు 1296 మందిని గుర్తిస్తే పదిమంది చనిపోయారని ,తక్కిన వారికి చికిత్స అందిస్తున్నామని చెప్పారు. రైస్ మిల్లులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో టీబి సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్న దృష్ట్యా మిర్యాలగూడలో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. టీబి రహిత గ్రామపంచాయతీలలో భాగంగా 2023లో జిల్లాలో 36 గ్రామ పంచాయతీలలో, 2024 లో 96 గ్రామ పంచాయతీలలో ఒక్క టీబి కేసు కూడా నమోదు కాలేదని, 2025 డిసెంబర్ నాటికి టీబి లేని జిల్లాగా అన్ని గ్రామ పంచాయతీలను తీర్చిదిద్దాలని తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ మాతృ నాయక్ ,రైస్ మిల్లర్ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్నాటి రమేష్, మిర్యాలగూడ రైస్ మిల్లుల సంఘం అధ్యక్షులు శ్రీనివాస్, తదితరులు మాట్లాడారు.మిర్యాలగూడ సబ్ కలెక్టర్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్ ,రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్,డిప్యూటీ డిఎంహెచ్వోలు వేణుగోపాల్ రెడ్డి ,రవి ,పౌర సరఫరాల జిల్లా మేనేజర్ హరీష్ ,డిఎస్ఓ వెంకటేశ్వర్లు,మిర్యాలగూడ రైస్ మిల్లర్ల సంఘం కార్యదర్శి బాబి ,ప్రతినిధులు భద్రం, వైద్యాధికారులు తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.