- గంజాయిపై ఉక్కుపాదం మోపుతాం
- మైనర్లకు వాహనాలు ఇస్తే చర్యలు
- ఇల్లందకుంట సబ్ ఇన్ స్పెక్టర్
వేద న్యూస్, ఇల్లందకుంట :
సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహనతో ఉండాలని ఇల్లందకుంట ఎస్సై క్రాంతి కుమార్ సూచించారు. ఆదివారం సాయంత్రం సిరిసేడు లో సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై క్రాంతి కుమార్ మాట్లాడుతూ.. సైబర్ నేరాలు బాగా పెరిగాయని, ఆన్లైన్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నట్లు తెలిపారు. వాట్సాప్ లో వచ్చే లింకులు ప్రెస్ చేయొద్దని దానితో బ్యాంకులో ఉన్న డబ్బులు కట్ అవుతుందని తెలిపారు.
సైబర్ నేరగాళ్ల వలలో విద్యావంతులే అధికంగా మోసపోతుండడం బాధాకరమని పేర్కొన్నారు. మల్టీలెవల్ మార్కెటింగ్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, ఇతర ఆన్లైన్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నట్లు తెలిపారు. ఏ పోలీసు అధికారి నేరుగా వాట్సాప్ వీడియోకాల్స్ చేయరని, డిజిటల్ అరెస్టులు అని చేసేకాల్స్ వస్తే సంబంధిత పోలీస్స్టేషన్లో వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రజల బలహీనతలే సైబర్ నేరగాళ్ల బలంగా మారిందన్నారు.

మారుతున్న టెక్నాలజీ, అందుబాటులోకి వచ్చిన ఏఐ టెక్నాలజీతో మోసగాళ్లు చెలరేగిపోతున్నారని, అప్రమత్తంగా ఉంటేనే నష్టం జరగదన్నారు. సైబర్ నేరగాళ్ల చేతిలో నష్టపోతే తక్షణం 1930లో ఫిర్యాదు చేయాలని సూచించారు.. యువత జలసాలకు అలవాటు పడి డ్రగ్స్, గంజాయి బారిన పడకుండా తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఎవరైనా గంజాయి అమ్మకాలు చేస్తున్నట్లు గమనిస్తే తమకు సమాచారం అందించాలని కోరారు. ఒకసారి గంజాయి డ్రగ్స్ కి అలవాటు పడితే బంధుమిత్రుల ద్వారా అప్పులు చేస్తూ చివరికి లోన్ ఆప్స్ ద్వారా అప్పులు చేసి, బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు పెట్టుబడి పెట్టి డబ్బులు రాక చివరికి చేసిన అప్పులు చెల్లింపు చేయలేక లోన్ అప్ నిర్వాహకులు పెట్టే టార్చర్ భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తమ పిల్లలు ఏం చేస్తున్నారో ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలని సూచించారు.

మైనర్లకి వాహనాలు నడపడానికి ఇవ్వొద్దని ఎవరైనా తల్లిదండ్రుల ఇస్తే వాహనాలు సీజ్ చేసి తల్లిదండ్రులపై చట్టరీత్యా కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.