= తెలంగాణలో ఎన్నడూ లేని రీతిలో విరుచుకుపడుతున్న అవినీతి నిరోధక శాఖ
= నూతన ప్రభుత్వం వచ్చాక 512 కేసులు..
= రూ.1,300 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు..
= మార్కెట్ విలువ రూ.13వేల కోట్లకు పైమాటే!
= గడిచిన కొద్ది నెలల్లోనే 190కి పైగా కేసులతో 14 ఏళ్ల రికార్డ్ బ్రేక్
= 1983 తర్వాత రికార్డు స్థాయిలో కేసులు నమోదు
= మరో 100 మంది అధికారులపై నిఘా..
= 65 మంది ‘అవినీతి అనకొండల’ జాబితా రెడీ
= రెవెన్యూ, పోలీస్, జీహెచ్‌ఎంసీ, ఆర్‌టీఏ, విద్యుత్‌తో పాటు పీసీబీ, మైనింగ్, అటవీ శాఖలపై కన్ను..
= ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పాత ఫైళ్లు రీ ఓపెన్..
= ఏసీబీకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన రేవంత్ సర్కార్
= డీజీ చారు సిన్హా నేతృత్వంలో సీక్రెట్ టీమ్స్ రెడీ..
వేద న్యూస్, ప్రత్యేక ప్రతినిధి
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారుల గుండెల్లో ఏసీబీ శబ్దం వింటేనే గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.. అవినీతిపై రాజీ లేనే లేదు అని ప్రభుత్వం ఇస్తున్న స్పష్టమైన సంకేతాలతో అవినీతి నిరోధక శాఖ తన విశ్వరూపాన్ని చూపిస్తోంది. లంచాలు మరిగిన కింది స్థాయి సిబ్బంది నుంచి ఉన్నతాధికారుల వరకు ఎవరినీ వదలకుండా ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటికే 100 మంది కీలక అధికారులను తమ రాడార్‌లో ఉంచిన ఏసీబీ, పక్కా ఆధారాలు లభించిన 65 మంది అవినీతి అనకొండల జాబితాను సిద్ధం చేసి దాడులకు రంగం సిద్ధం చేసినట్టు సమాచారం. ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో బ్యూరోక్రసీలోని కీలక స్థానాల్లో ఉన్న అధికారులు ఇప్పుడు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కాగా, రాష్ట్రంలో రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఏసీబీ అధికారులు అత్యంత వేగంగా స్పందిస్తూ ఇప్పటివరకు ఏకంగా 512 కేసులు నమోదు చేశారు.
100 మందిపై నిఘా.. 65 మంది బడా అధికారుల జాబితా సిద్ధం
ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్, ఇంటెలిజెన్స్ నివేదికలు, విజిలెన్స్ డేటా, గత ఆరు నెలల ఆర్థిక లావాదేవీల విశ్లేషణ ఆధారంగా ఏసీబీ ఈ విడత అత్యంత శాస్త్రీయంగా నెట్‌వర్క్‌ను ఛేదిస్తోంది. కేవలం ఫిర్యాదులకే పరిమితం కాకుండా అధికారుల స్థిరాస్తులు, బ్యాంకింగ్ లావాదేవీలు, కుటుంబ సభ్యులు, బినామీల పేరిట ఉన్న రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, విదేశీ ఖాతాలపై కన్ను వేసింది. ప్రాథమికంగా 65 మంది ఉన్నతాధికారుల సమగ్ర జాతకాలను సేకరించిన ఏసీబీ బృందాలు.. డిజిటల్ సాక్ష్యాలు, వీడియో రికార్డింగ్‌లు సిద్ధమయ్యాక నేరుగా దాడులకు పాల్పడుతున్నాయి.
ఐఏఎస్, ఐపీఎస్‌లకూ పొంచి ఉన్న ముప్పు
సాధారణంగా ఐఏఎస్, ఐపీఎస్ వంటి అఖిల భారత సర్వీస్ అధికారులపై విచారణకు అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17A ప్రకారం ప్రభుత్వ ముందస్తు అనుమతి తప్పనిసరి. అయితే, ప్రస్తుత ప్రభుత్వం ఏసీబీకి సంపూర్ణ స్వేచ్ఛ ఇవ్వడంతో పాటు సీఎస్ స్థాయి నుంచి అవసరమైన ఆమోదాలు ముందస్తుగానే లభిస్తుండటంతో సాంకేతిక అడ్డంకులు తొలగిపోయాయి. ముఖ్యంగా రెవెన్యూ, ల్యాండ్ సర్వే విభాగాల్లో క్వాసి-జ్యుడీషియల్ వివాదాలను అడ్డుపెట్టుకుని వందల కోట్ల విలువైన భూములను క్రమబద్ధీకరించిన పాత ఫైళ్లను ఏసీబీ తిరిగి తోడుతోంది. దీంతో గతంలో కీలక పదవుల్లో పనిచేసి, ప్రస్తుతం లూప్‌లైన్ లేదా ఇతర శాఖల్లో ఉన్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల మెడకూ ఈ ఉచ్చు బిగుస్తోంది.
సంచలనం రేపిన 512 కేసులు..
రాష్ట్రంలో నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఏసీబీ అధికారులు అత్యంత వేగంగా స్పందిస్తూ ఇప్పటివరకు ఏకంగా 512 కేసులు నమోదు చేశారు. ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారమే అవినీతి అధికారులు రూ.1,300 కోట్లకు పైగా అక్రమాస్తులు సంపాదించినట్లు గుర్తించగా, వీటి ప్రస్తుత ఓపెన్ మార్కెట్ విలువను లెక్కగడితే ఏకంగా రూ.13,000 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. సగటున ఒక చిన్న స్థాయి అధికారి దాడుల్లో పట్టుబడ్డా ఆయన ఆస్తి మార్కెట్ విలువ రూ.10 కోట్లకు తగ్గకపోవడం, ఒక ఉద్యోగి తన జీవితకాల సర్వీస్ పూర్తి చేసినా అందులో సగం కూడా న్యాయబద్ధంగా సంపాదించడం అసాధ్యమనే వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. గతంలో పట్టుబడ్డ అధికారుల ఆస్తుల చిట్టాను పరిశీలిస్తే విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి రావు రూ.200 కోట్ల పైచిలుకు ఆస్తులు, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంజనీర్లు నూనె శ్రీధర్‌కు రూ.110 కోట్లు, భూక్యా హరిరాంకు రూ.120 కోట్లు, ఈఎన్సీ మురళీధర్ రావుకు రూ.200 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ తేల్చింది. ఇక ఆర్ అండ్ బి ఈఎన్సీ మోహన్ నాయక్ రూ.170 కోట్లు, డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్ రూ.120 కోట్లు, హెచ్‌ఎమ్‌డీఏ మాజీ డైరెక్టర్ శివరామకృష్ణ రూ.200 కోట్లకు పైగా, ఇరిగేషన్ అసిస్టెంట్ ఇంజనీర్ నీకేష్ కుమార్ రూ.150 కోట్లు, డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ కిషన్ నాయక్ రూ.100 కోట్లు, ఇటీవలే పట్టుబడ్డ హెచ్‌ఎమ్‌డీఏ చీఫ్ ఇంజనీర్ బచ్చు రవీందర్ రూ.100 కోట్లకు పైగా ఆస్తులు ఆర్జించారని, వీరంతా వందల కోట్లు గడించిన వారేనని ఏసీబీ ఆధారాలతో సహా బహిర్గతం చేసింది.
సమాచారం లీక్ కాకుండా చారు సిన్హా పక్కా స్కెచ్
ఏసీబీ డైరెక్టర్ జనరల్ చారు సిన్హా నేతృత్వంలో శాఖాగత ప్రక్షాళన వేగంగా జరుగుతోంది. సోదాల సమాచారం ముందే లీక్ కాకుండా ఉండేందుకు అత్యంత రహస్య బృందాలను రంగంలోకి దించడం, తనిఖీలను డిజిటల్ సాక్ష్యాలుగా రికార్డు చేయడం వంటి సంస్కరణలు తెచ్చారు. ఫలితంగానే గడిచిన కొద్ది నెలల్లోనే 190కి పైగా కేసులు నమోదు చేసి 14 ఏళ్ల రికార్డును తిరగరాశారు. దాడులు చేయడం మాత్రమే కాకుండా.. కోర్టుల్లో బలమైన ఆధారాలు సమర్పించి అవినీతిపరులకు శిక్షలు పడేలా చూడటమే లక్ష్యంగా ఏసీబీ అడుగులు వేస్తోంది. రాబోయే రోజుల్లో బడా అధికారుల అరెస్టులతో తెలంగాణ పాలనా యంత్రాంగంలో మరిన్ని ప్రకంపనలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిరంతర నిఘా: డీజీ చారు సిన్హా
రాష్ట్రంలో అవినీతిని అరికట్టడమే ధ్యేయంగా అవినీతి నిరోధక శాఖ విరుచుకుపడుతుండగా, 1983 తర్వాత ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో కేసులు నమోదు చేసి లంచగొండుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. తాజాగా జరిగిన రెండో త్రైమాసిక పనితీరు ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో డీజీ చారు సిన్హా అధికారులకు దిశానిర్దేశం చేస్తూ.. అవినీతి దేశాన్ని లోపలి నుంచి తొలిచేసే ప్రమాదకర వ్యాధి అని, దానిపై ఎలాంటి రాజీ లేకుండా పారదర్శకంగా పోరాడాలని స్పష్టం చేశారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిరంతర నిఘా, శాస్త్రీయ దర్యాప్తుతో విరుచుకుపడాలని ఆదేశించిన డీజీ, ఉత్తమ సేవలు అందించిన సిబ్బందికి ‘రివార్డ్ మేళా’ ద్వారా ప్రశంసాపత్రాలు అందజేశారు. అవినీతి రహిత పాలనే తమ ప్రధాన లక్ష్యమని డీజీ వెల్లడించారు.
కీలక శాఖల్లో పేట్రేగిన అవినీతి
ప్రజలతో నిత్యం సంబంధం ఉండే రెవెన్యూ, పోలీస్, జీహెచ్‌ఎంసీ, ఆర్‌టీఏ, రిజిస్ట్రేషన్స్, విద్యుత్ శాఖల్లో చిన్న పనికి కూడా అమ్యామ్యాలు చెల్లించాల్సి రావడంపై ప్రజా ఆగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఏసీబీ దృష్టి కేంద్రీకరించింది. వీటితో పాటు ప్రజలతో నేరుగా సంబంధం లేకపోయినా విచ్చలవిడిగా లంచాలు దండుకుంటున్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, అటవీ, డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, మైనింగ్ శాఖల్లోని అధికారులపై వెల్లువెత్తుతున్న ఫిర్యాదుల ఆధారంగా ఏసీబీ ఉచ్చు బిగిస్తోంది.
