వాటర్‌షెడ్‌లో అవినీతి బురద..!

= ఏసీబీ వలలో కాంట్రాక్టర్ల రక్తం పీల్చిన కమీషన్ల తిమింగళాలు!

= రూ.39.14 లక్షల లావాదేవీలు.. బిల్లులకు పర్సంటేజీల పీడ

= ఫోన్లలో ఆధారాలు.. ఇద్దరు అధికారులకు ఏసీబీ సంకెళ్లు

వేద న్యూస్, భూపాలపల్లి ప్రతినిధి:

ప్రజాధనంతో చేపట్టే అభివృద్ధి పనులు కొందరు అధికారులకు కాసులు కురిపించే కాసుల గనులుగా మారుతున్నాయా? కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాల్సిన బాధ్యతను సైతం అక్రమ వసూళ్లకు అస్త్రంగా మార్చుకున్నారా? జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని వాటర్‌షెడ్‌ ప్రాజెక్టులో వెలుగుచూసిన అవినీతి ఆరోపణలు ఈ ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. భూగర్భ జలాలను పెంపొందించాల్సిన పథకంలో పర్సంటేజీల పర్వం నడిచినట్లు వచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) గురువారం ఇద్దరు అధికారులను అరెస్టు చేయడం జిల్లాలో సంచలనం రేపింది.
ప్రభుత్వ పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు నిబంధనల ప్రకారం బిల్లులు చెల్లించాల్సిన అధికారులు.. ఆ బిల్లుల మంజూరుకే పర్సంటేజీలు డిమాండ్‌ చేసినట్లు ఆరోపణలు రావడం తీవ్ర చర్చనీయాంశమైంది. బిల్లుల మొత్తంలో 10 నుంచి 25 శాతం వరకు లంచం అడిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. డబ్బులు చెల్లించకపోతే పెండింగ్‌ బిల్లులు నిలిపివేయడంతోపాటు తదుపరి పనులు కేటాయించబోమని బెదిరించినట్లు ఆరోపణలున్నాయి. రేగొండ మండలానికి చెందిన కాంట్రాక్టర్‌ ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

రూ.39.14 లక్షల లావాదేవీలు.. ఫోన్లలో కీలక ఆధారాలు!

వాటర్‌షెడ్‌ ప్రాజెక్టు అధికారి సతీష్‌రెడ్డి, సాంకేతిక అధికారి రాజు సూచించినట్లు భావిస్తున్న వివిధ బ్యాంకు ఖాతాలు, యూపీఐ ఖాతాలకు కాంట్రాక్టర్ల నుంచి రూ.39,14,000 బదిలీ అయినట్లు ఏసీబీ అధికారులు గుర్తించినట్లు సమాచారం. బిల్లుల చెల్లింపుల సమయంలో డబ్బులు బదిలీ చేయాలంటూ పంపిన ఫోన్‌ సందేశాలు, బ్యాంకు లావాదేవీల వివరాలను పరిశీలించినట్లు ఏసీబీ వెల్లడించింది. ఏడో బిల్లుకు సంబంధించి అదనంగా 25 శాతం డిమాండ్‌ చేసినట్లు కూడా ఆరోపణలున్నాయి. ఫిర్యాదుపై స్పందించిన వరంగల్‌ ఏసీబీ అధికారులు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో రికార్డులను పరిశీలించి, సంబంధిత ఫోన్లలోని సమాచారాన్ని తనిఖీ చేశారు. అందుబాటులో ఉన్న ఆధారాల ఆధారంగా కేసు నమోదు చేసి ప్రాజెక్టు అధికారి సతీష్‌రెడ్డి, సాంకేతిక అధికారి రాజును గురువారం అరెస్టు చేసి ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరుచునున్నట్లు, కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోందనీ తెలిపారు .

మూడు మండలాల్లో పనులు.. పర్యవేక్షణపై ప్రశ్నలు!

రేగొండ, మల్హర్‌రావు, పలిమెల మండలాల్లో భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా వాటర్‌షెడ్‌ పనులు చేపడుతున్నారు. వర్షపు నీటిని ఒడిసిపట్టడం, ఊటగుంటల నిర్మాణం, భూగర్భ జలాలను పెంపొందించడం వంటి పనుల కోసం ప్రజాధనం ఖర్చు చేస్తున్నారు. ఇలాంటి కీలక పథకంలోనే అక్రమ వసూళ్ల ఆరోపణలు రావడంతో పనుల పర్యవేక్షణ, బిల్లుల మంజూరు, అధికారుల జవాబుదారీతనంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జిల్లాలో గతంలో కోర్టు సిబ్బంది, కలెక్టరేట్‌లోని మైనింగ్‌ అధికారిపై వచ్చిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో తాజాగా వాటర్‌షెడ్‌ ప్రాజెక్టు అధికారుల అరెస్టు చర్చనీయాంశమైంది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల కోసం సామాన్యులు, కాంట్రాక్టర్లు లంచాలు చెల్లించాల్సిన పరిస్థితులు లేకుండా పర్యవేక్షణ వ్యవస్థను పటిష్ఠం చేయాలనే డిమాండ్‌ వినిపిస్తోంది. ప్రజా ప్రయోజనాల కోసం కేటాయించిన నిధులు లక్ష్యానికి చేరాలంటే అక్రమ వసూళ్ల ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *