•  బీజేపీ ధర్మసాగర్ మండల ప్రధాన కార్యదర్శి సందీప్ 
  • సగం మందికి కూడా రూ.2 లక్షల ‘మాఫీ’ కాలేదని విమర్శ 
  • ఇప్పటికైనా రాష్ట్ర సర్కారు చిత్తశుద్ధితో రైతులకిచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ 

 

వేద న్యూస్, వరంగల్:

కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న రూ.2 లక్షల రుణమాఫీ అట్టర్ ఫ్లాపేనని బీజేపీ ధర్మసాగర్ మండల ప్రధాన కార్యదర్శి కొంగంటి సందీప్ విమర్శించారు. శుక్రవారం ఆయన ధర్మసాగర్ మండలకేంద్రంలో మీడియాతో మాట్లాడారు.

తమది రైతు సర్కారు అని చెప్పుకుంటున్న రేవంత్‌రెడ్డి పాలన పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా ఉందని ఆరోపించారు. తాను సమాచార హక్కు చట్టం ప్రకారం ధర్మసాగర్ మండల పరిధిలోని దేవునూరు గ్రామ రైతులకు రుణ‘మాఫీ’ అయిన రైతుల జాబితా ఇవ్వాలని సమాచారం కోరానని, అధికారులు ఇచ్చిన వివరాల ప్రకారం సగం మందికి కూడా ‘మాఫీ’ కాలేదని అధికారికంగా తేలిందని వివరించారు.

రైతు శ్రేయస్సు కోసం చిత్తశుద్ధితో ప్రభుత్వం వ్యవహరించడం లేదని స్పష్టమౌతోందని వెల్లడించారు. దేవునూరు గ్రామంలో 813 మంది పట్టాదారులుండగా, ఈ ఏడాది ఆగస్టు 15 వరకు 279 మంది అన్నదాతలకు మాత్రమే రుణాలు ‘మాఫీ’ అయ్యాయని పేర్కొన్నారని తెలిపారు.

ఈ లెక్కన కనీసంగా సగం మంది రైతాంగానికి కూడా రైతు రుణ మాఫీ నుంచి విముక్తి లభించలేదనేది స్పష్టంగా అర్థమవుతోందని చెప్పారు. మిగతా రైతులకు సంబంధించిన ‘మాఫీ’ ప్రక్రియ ప్రాసెస్‌లో ఉందని ప్రభుత్వం ప్రకటనల్లో పేర్కొంటున్నదని, ఈ ప్రాసెస్ ఇంకెంత కాలం కొనసాగుతుందని సందీప్ ప్రశ్నించారు. రైతురుణమాఫీ చేశామని గొప్పగా చెప్పుకుంటున్న హస్తం పార్టీ సర్కారు ‘రైతు భరోసా’ విషయంలో స్పష్టతనివ్వాలని కోరారు.

వానాకాలం పూర్తయి యాసంగి పంటలకు సమయం ఆసన్నమవుతున్న సందర్భంలో పెట్టుబడికి రైతులు అప్పులు చేసే పరిస్థితి ఉంటుందని, ఈ నేపథ్యంలో సర్కారు ‘రైతు భరోసా’ కింద పెట్టుబడి సాయం ఇవ్వడంపైన దృష్టి సారించాలని సూచించారు.

రైతు కూలీలు, మహిళలకు చేస్తానన్న సాయం, ప్రతి మహిళకు నెలకు రూ.2,500, గ్యాస్ సబ్సిడీ, ప్రతి మండలంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్, విద్యార్థులకు రుణానికి సంబంధించిన గ్యారంటీ వంటి రకరకాల హామీల అమలుకు సంబంధించిన అంశాలన్నీ పక్కనపెట్టి.. రాష్ట్ర సర్కారు కేవలం హైడ్రా పేరిట డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని సందీప్ ఆరోపించారు. ఇప్పటికైనా రేవంత్ ప్రభుత్వం ప్రజల కోసం చిత్తశుద్ధితో పని చేయాలని సూచించారు.