• పలు అవార్డులు అందుకున్న ఖాకీ

వేద న్యూస్, వరంగల్:

పోలీసు వృత్తిపరంగా విధుల్లో బిజీగా ఉన్నప్పటికీ.. సేవాకార్యక్రమాల్లో ముందుండేందుకు ప్రయత్నం చేస్తున్నారు ఓ ఖాకీ. ఖాకీ దుస్తులంటే సేవకు ప్రతిరూపాలనే చెప్పేందుకు తన వంతుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా గత 20 ఏండ్లుగా రక్తదానం పై యువతకు అవగాహన కల్పిస్తున్నారు. ఆయనే  వరంగల్ పోలీస్ కానిస్టేబుల్, బ్లడ్ డోనర్ అండ్ బ్లడ్ మోటివేటర్  కన్నె రాజు (స్విమ్మర్ రాజు). జూన్ 14, వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే సందర్భంగా ఆయన సేవలపై స్టోరీ..

పోలీస్ శాఖలో, వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో సిటీ ఆర్మ్డ్ రిజర్వు ఏ.ఆర్ 2009 బ్యాచ్ (వరంగల్ సిటీ గార్డ్)లో పోలీస్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న.. వరంగల్ జిల్లా, ఖానాపురం మండలం, రాగంపేట గ్రామానికి చెందిన కన్నె కుమారస్వామి – రమనీల దంపతుల పెద్ద కుమారుడు బ్లడ్ డోనర్ అండ్ బ్లడ్ మోటివేటర్ కన్నె రాజు (స్విమ్మర్ రాజు). ఎవరు కూడా రక్తం దొరకకుండా చనిపోకూడదు అనే ముఖ్య ఉద్దేశంతో “రక్తదాన చైతన్య కార్యక్రమాలు ప్రారంభించినట్టు నరేశ్ వెల్లడించారు. 

 

2005  నుంచి ఇప్పటి వరకు 37సార్లు (ఓ పాజిటివ్) రక్తదానం చేసిన రాజు.. యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా 5 రాష్ట్రాలు (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఢిల్లీ, హర్యానా) రాష్ట్రాలలో (వాట్సప్, ఫేస్బుక్, ట్విట్టర్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా) 1,00,000 మందికి పైగా యువత కు రక్తదానం పై అవగాహన కల్పించారు. వివిధ సందర్భాలలో అత్యవసర సమయంలో ఉన్నవారికి 18,154 మందికి, రక్తదాతల సహకారంతో ఉచితంగా రక్తాన్ని అందజేసి.. రక్తదానంలో రా‘రాజు’గా పేరు గాంచారు. 

అత్యవసరం లో ఉన్న వారికోసం మరియు తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం ఇప్పటి వరకు 71 రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం విశేషం. కరోనా (కొవిడ్ – 19) అత్యవసర సమయంలో ప్లాస్మాదానం పై అవగాహన కల్పించి 235 మందికి ప్లాస్మా అందించారు. వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే సందర్భంగా 18 సంవత్సరాలు పూర్తయిన యువతి & యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేసి సమాజానికి ఆదర్శంగా ఉండాలని కోరుతున్నారు.