వేద న్యూస్, ఇల్లందకుంట:

రైతులకు యూరియా తిప్పలు తప్పడం లేదు. పంటకు యూరియా కోసం అన్నదాతలు పొద్దుగాల 5 గంటల నుంచి  పడిగాపులు కాస్తున్నారు. చెప్పులు లైన్ లో పెట్టి.. మరీ పీఏసీఎస్ ఎదుటే నిలుచుంటున్నారు. ఇక ఒక రైతుకు ఒకటే యూరియా బస్తా మాత్రమే ఇస్తున్నారని, అది సరపోదని కొందరు ఫార్మర్స్ అంటున్నారు. కానీ, అలా అయినా మంచిదే తీసుకుందామని రైతులు క్యూ కడుతున్నారు. 

ఒక్క యూరియా బస్తా కోసం పాస్ బుక్ జిరాక్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్ పట్టుకుని శనివారం కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ గోదాం వద్ద రైతులు ఎదురుచూశారు. ఉదయం 5 గంటల నుండి చెప్పులతో క్యూ లైన్ లో నిలబడి.. యూరియా టోకెన్స్ కోసం వేచి చూశారు. 

రైతులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఉదయం ఎనిమిది గంటలకు గోదాం షెటర్ ఓపెన్ చేసి టోకెన్స్ రైతులకు జారీ చేయగా, టోకెన్స్ ముగిసిన సమయం తర్వాత పీఏసీఎస్ ఇల్లందకుంట సిబ్బంది యూరియా పంపిణీ చేశారు.

గడ్డివాని పల్లె కు 50 బస్తాలు, టేకుర్తికి 80 బస్తాలు, చిన్న కోమటిపల్లికి 100 బస్తాలు, వంతడుపులకు 60 బస్తాలు, శ్రీరాముల పల్లెకు 130 బస్తాలు, ఇల్లంతకుంటకు 200 బస్తాల యూరియా ఇచ్చారు. కాగా, ఇచ్చిన యూరియా బస్తాలు తమకు సరిపోలేదని, తమకు మరిన్ని కావాలని కొందరు రైతులు కోరుతున్నారు. ప్రజా ప్రభుత్వంలో రైతులకు ఎరువుల సరఫరాకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.