•  ఎంబీబీఎస్‌లో గోల్డ్ మెడల్ అందుకున్న డాక్టర్ అనిత
  •  ఎంఎస్ జనరల్ సర్జన్‌గానూ పట్టా పొందిన వైద్యురాలు
  •  ఎన్నో రకాల ఆపరేషన్లు చేసి రోగులకు పునర్జన్మ ప్రసాదించిన డాక్టర్

వేద న్యూస్, జమ్మికుంట:

సింగరేణి ప్రాంతం నుంచి వచ్చిన వారు ప్రపంచంలో ఎక్కడైనా రాణిస్తారనే నానుడిని అక్షరాలా నిజం చేస్తున్నారు డాక్టర్ అనిత కొత్త. వైద్యం అంటే సేవ చేయడమేననే లక్ష్యంతోనే ఆమె ముందుకు సాగుతున్నారు. తెల్లకోటు ధరించి ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన, ఆశయానికి చిన్ననాటనే ఆమె మనసులో బీజం పడింది. తండ్రి సింగరేణిలో పని చేస్తూ..అలసిపోయి ఇంటికి వస్తుండటం బాల్యంలోనే గమనించింది. గని కార్మికులకు తరచూ ఆరోగ్య సమస్యలు వస్తుండటంతో వారిని హైదరాబాద్‌కు పంపేవారు. ఈ నేపథ్యంలోనే వైద్యురాలు కావాలని తండ్రి ప్రేరణతో అనిత.. చదువులో ఎంతో ప్రతిభ కనబరిచి ముందుకు సాగారు. తన కల సాకారానికి కష్టపడి చదివారు. వైద్య చదువులో గోల్డ్ మెడల్ సంపాదించిన అనిత.. కొంత కాలం పాటు సింగరేణి కాలరీస్ కంపెనీ హాస్పిటల్‌లో వైద్య సేవలు అందించడం విశేషం. వృత్తిలో నైపుణ్యాన్ని సంపాదించిన డాక్టర్ అనిత.. సేవాభావాన్ని ఆచరణలో చూపిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

బెస్ట్ డాక్టర్‌గా గుర్తింపు

గోదావరిఖనికి చెందిన శంకరయ్య-లక్ష్మీ దంపతులకు 1987, మే 1న కార్మిక దినోత్సవం రోజున అనిత జన్మించారు. సింగరేణి కాలరీస్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న శంకరయ్య దంపతులకు కార్మిక దినోత్సవం రోజున కూతురు పుట్టడంతో అంతులేని ఆనందంతో ఆ కుటుంబం మురిసిపోయింది. ఇక చిన్ననాటనే తన లక్ష్యాన్ని నిర్దేశించుకున్న ఆమె..చదువుల్లో ఎంతో ప్రతిభ కనబర్చారు.

అనిత విద్యాభ్యాసం మొత్తం గోదావరిఖని‌లో జరిగింది. ఇంటర్మీడియెట్ విజయవాడలో చదివిన ఆమె..శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఆ సమయంలో ప్యాతాలజీ విభాగంలో గోల్డ్ మెడల్ అందుకున్నారు.

అనంతరం అదే వర్సిటీలో ఎంఎస్ జనరల్ సర్జన్‌గా పట్టా పొందారు. ఆ తర్వాత ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వరల్డ్ ల్యాపరోస్కోపీ సెంటర్‌లో శిక్షణ పొందారు. అది మొదలు ఎన్నో రకాల ఆపరేషన్లు చేశారు. ఈ క్రమంలోనే ప్రజల్లో బెస్ట్ డాక్టర్‌గా గుర్తింపు పొందారు. ఎంతో మంది రోగులకి పునర్జన్మ ప్రసాదించారు. మానవత్వానికి, సేవకు మారుపేరు అయిన పవిత్ర వైద్య వృత్తిలో ఉత్తమ వైద్య సేవలందిస్తూ ముందుకు సాగుతున్నారు.

కొంత కాలం పాటు సింగరేణి కాలరీస్ కంపెనీ హాస్పిటల్‌లో వైద్య సేవలు అందించారు. అనంతరం కుటుంబరీత్యా జమ్మికుంట‌కు వచ్చి తన సేవలు సంజీవని మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి‌లో కొనసాగిస్తున్నారు. ఎంఎస్, ఎఫ్ఎంఏఎస్..డాక్టర్ అనిత కొత్త జీవిత భాగస్వామి కూడా డాక్టరే. అనిత భర్త డాక్టర్ ఊడుగుల సురేశ్ ఎండీ జనరల్ ఫిజీషియన్‌గా ‘సంజీవని’ ఆస్పత్రిలో వైద్య సేవలు అందిస్తున్నారు.