వేద న్యూస్, వరంగల్ క్రైమ్ : 

వరంగల్ నగరంలో ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న వ్యాపారులపై టాస్క్ ఫోర్స్ కఠిన చర్యలకు దిగింది. నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలను పాటించకుండా పాడైపోయిన వంటనూనెలు, హానికర రసాయనాలు ఉపయోగిస్తూ తినుబండరాలు తయారు చేసి నిల్వ చేస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ బృందం చింతల్, వరంగల్ ప్రాంతంలో దాడులు నిర్వహించింది. వరంగల్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు, చింతల్ లోని మరియా ట్రేడర్స్ పై టాస్క్ ఫోర్స్ తనిఖీలు చేపట్టింది. ఈ తనిఖీల్లో వినియోగానికి అనర్హమైన, పాడైపోయిన ఆహార పదార్థాలు మరియు రసాయనాలు భారీగా నిల్వ ఉంచినట్లు గుర్తించారు. టాస్క్ ఫోర్స్ బృందం మొత్తం రూ.1,06,780 విలువ గల పాడైపోయిన వంటనూనెలు, ఫుడ్ కలర్ మరియు ఇతర ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుంది. సీజ్ చేసిన ఆహార పదార్థాలు మరియు నిందితుడిని తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం సంబంధిత ఫుడ్ సేఫ్టీ అధికారులకు అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్ అధికారులు తెలిపారు.

వ్యాపారస్తులకు పోలీసుల హెచ్చరిక

కాలం చెల్లిన, పాడైపోయిన, అపరిశుభ్ర ఆహార పదార్థాలను నిల్వ ఉంచినా లేదా విక్రయించినా సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ప్రజల ఆరోగ్యానికి హానికరంగా మారే ఆహార పదార్థాలపై నిరంతర నిఘా కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఆహార పదార్థాలు కొనుగోలు చేసే ముందు వాటి గడువు తేదీలు, నాణ్యత, పరిశుభ్రతను తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు. నాసిరకం ఆహారం వల్ల వాంతులు, విరేచనాలు, గ్యాస్ట్రిక్ సమస్యలు సహా ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రజలు ఎల్లప్పుడూ పరిశుభ్రమైన, నాణ్యమైన ఆహారానికే ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. భారీ మొత్తంలో కల్తీ మరియు పాడైపోయిన వంటనూనెలు, హానికర రసాయనాలు ఉపయోగిస్తూ అపరిశుభ్ర పరిసరాలలో ఆహార పదార్థాలు తయారు చేస్తున్న వారిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన టాస్క్ ఫోర్స్ ఏసీపీ మధుసూదన్, టాస్క్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ఎల్. మంగీలాల్, సబ్-ఇన్‌స్పెక్టర్ బి. చందర్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ మౌనిక మరియు టాస్క్ ఫోర్స్ సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *