వేద న్యూస్, పర్వతగిరి :
వర్ధన్నపేట నియోజకవర్గంలోని పర్వతగిరి మండల అధ్యక్ష పదవుల కోసం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పర్వతగిరి మండలంలోని జేజేఆర్ గార్డెన్స్ లో వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు అయూబ్ ముఖ్య అతిథిగా హాజరై అభ్యర్థుల నుండి దరఖాస్తులను స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, ప్రజాసేవ పట్ల నిబద్ధత కలిగిన నాయకత్వాన్ని ఎంపిక చేయడం అత్యంత అవసరమని తెలిపారు. గ్రామ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేయడానికి అర్హత, అనుభవం, ప్రజలతో అనుబంధం కలిగిన నాయకులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
అలాగే, పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారిని కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ మర్చిపోదని, ప్రతి ఒక్కరికీ సరైన సమయంలో తగిన అవకాశాలు లభిస్తాయని ఆయన స్పష్టం చేశారు. పార్టీ పట్ల విశ్వాసం, క్రమశిక్షణ, సేవాభావం కలిగినవారే భవిష్యత్తులో నాయకులుగా ఎదుగుతారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం ద్వారా పర్వతగిరి మండలంలో పార్టీ బలోపేతానికి కొత్త ఉత్సాహం వచ్చినట్లు నాయకులు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మరింత సమన్వయం, క్రమశిక్షణతో పార్టీని ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పర్వతగిరి మండల కమిటీ సభ్యులు ఎద్దు సత్యనారాయణ, నరకుడు వెంకటయ్య, పోశాల వెంకన్న, మదన్ గౌడ్, తిరుపతి, శ్రీరాం మడిపల్లి,సీనియర్ ప్రజాప్రతినిధులు, మండల మరియు డివిజన్ నాయకులు, యువ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు మరియు పదవులకు ఆసక్తి చూపుతున్న అభ్యర్థులు పాల్గొన్నారు.


