పర్వతాలు భూమి మొత్తం భూభాగంలో దాదాపు 24 శాతం నుండి 27 శాతం వరకు ఆక్రమించి, భారతదేశ మొత్తం భూభాగంలో 30 శాతం ఆక్రమించాయి. అనేక కారణాల వల్లఈ సహజ కవచాలైన పర్వత సహజ వనరులు రోజురోజుకూ తగ్గిపోతున్నాయి.
ప్రపంచ జనాభాలో సుమారు 15 శాతం మంది ప్రజలు పర్వత ప్రాంతాలలోనే నివసిస్తున్నారు. ఈ ఒక్క విషయం పర్వతాల ప్రాముఖ్యతను మనకు తెలియజేస్తుంది. పర్వతాల పరిరక్షణ, వాటిలోని జీవవైవిధ్యం, పర్యావరణ వ్యవస్థల గురించి ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో ప్రతి సంవత్సరం డిసెంబర్ 11వ తేదీన అంతర్జాతీయ పర్వత దినోత్సవాన్ని (ఇంటర్నేషనల్ మౌంటైన్ డే) జరుపుకుంటారు.
2025 అంతర్జాతీయ పర్వత దినోత్సవం (ఇంటర్నేషనల్ మౌంటైన్ డే) థీమ్ “పర్వతాలు, అంతకు మించి నీరు, ఆహారం, జీవనోపాధికి హిమానీనదాలు ముఖ్యమైనవి”, ఇది 2025ని అంతర్జాతీయ హిమానీనదాల సంరక్షణ సంవత్సరంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించిన సమయంలో వేగంగా హిమానీనదాలు కరుగడం, వాతావరణ ప్రభావాలు మరియు ఈ కీలకమైన మంచినీటి వనరులు మరియు పర్వత సమాజాలను రక్షించడానికి అత్యవసర చర్య తీసుకోవలసిన అవసరాన్ని ప్రాముఖ్యతను తెలియచేస్తుంది.
పర్వతాల ఆవిర్భావం ఒక అద్భుత ప్రక్రియ భూమి చల్లబడే క్రమంలో సంభవించిన భౌగోళిక మార్పుల ఫలితంగా పర్వతాలు ఏర్పడ్డాయి. భూమి ఉపరితలం మొదట్లో ద్రవ రూపంలో, వాయు రూపంలో ఉండే పదార్థాలతో కూడిన ఒక అగ్నిగోళం. సుమారు 200 కోట్ల సంవత్సరాల క్రితం ఈ గోళం చల్లబడి, ఉపరితలం గట్టిపడటం ప్రారంభించింది.
ఈ గట్టి పొర కింద అత్యంత వేడి ద్రవ రూపంలోని పదార్థాలు ఉన్నాయి.భూమి చల్లబడి కుంచించుకుపోయే (కాంట్రాక్షన్) ప్రక్రియలో, ఉపరితలంపై ఉన్న సుమారు 20 కిలోమీటర్ల మందపాటి గట్టి పొరలో ముడతలు ఏర్పడ్డాయి.
గ్రానైట్ ఫలకాలతో ఏర్పడిన ఈ ఉపరితల పొర, ఒత్తిడికి గురైనప్పుడు ధనుస్సుల్లాగా వంగి, కొన్ని ప్రాంతాలు పైకి లేచాయి. ఈ ఫలకాలు ముడుచుకుపోయి, పగిలి, నెర్రెల రూపంలో విచ్చిన్నం చెందాయి. ఈ వంగిన, విరిగిన శిలా భాగాలే భూమి పైకి పొడుచుకు వచ్చి పర్వతాలుగా రూపుదిద్దుకున్నాయి. పర్వతాల ఉపయోగాలు, ప్రాముఖ్యత పర్వతాలు కేవలం భౌగోళిక నిర్మాణాలు మాత్రమే కావు; అవి మానవ మనుగడకు, పర్యావరణ సమతుల్యతకు మూల స్థావరాలు.
పర్వతాలు – జీవవైవిధ్యం
పర్వతాలు ప్రపంచ జనాభాలో సగం మందికి పైగా ప్రజలకు జల వనరుల రూపంలో మంచినీటిని అందిస్తున్నాయి. మన దేశంలోని అనేక జీవ నదులు (ఉదాహరణకు, గంగా, యమునా) పర్వతాలలోనే జన్మించాయి. ఇవి మేఘాలకు అడ్డంకిగా నిలిచి, వర్షాలు కురవడానికి ముఖ్య కారణంగా తగినంత వర్షపాతనికి ఊతమిస్తున్నాయి.
భూగర్భ జలాన్ని పెంచుతూ జీవకోటి మనుగడకు తోడ్పడుతున్నాయి. పర్వత శ్రేణులు అనేక రకాల వృక్ష, జంతు జాతులకు ఆవాసాలుగా ఉంటూ అపారమైన జీవవైవిధ్యాన్ని కలిగి ఉన్నాయి. చారిత్రక, భౌగోళికంగా పర్వతాలు దేశాలకు సహజసిద్ధమైన రక్షణ కవచాలుగా నిలిచాయి. ఆది మానవుని కాలం నుంచి అనేక నాగరికతలకు పర్వతాలు ఆలవాలమై, మన సాంస్కృతిక వారసత్వానికి చిహ్నాలుగా నిలిచాయి.
సవాళ్లు, పరిష్కారాలు
“స్థిరమైన భవిష్యత్తు కోసం పర్వత పరిష్కారాలు – ఆవిష్కరణ, అనుసరణ, యువత, అంతకు మించి” అనేది 2024 అంతర్జాతీయ పర్వత దినోత్సవం థీమ్. ఈ థీమ్ పర్వతాలు ఎదుర్కొంటున్న సవాళ్లను ఎదుర్కోవడానికి తక్షణ చర్యలు అవసరమని నొక్కి చెబుతోంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా వాతావరణ మార్పు జరిగి పర్వతాలపైన ఉన్న మంచు దిబ్బలు వేగంగా కరిగిపోతున్నాయి.
ఇది దిగువ ప్రాంతాల్లోని కోట్ల మంది ప్రజల మంచినీటి సరఫరాపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. బాహ్య కుత్రిమ కాలుష్యం వలన వాతావరణ కాలుష్యం, సహజ వనరుల విచక్షణారహిత వినియోగం పర్వత ప్రాంత ప్రజల మనుగడను కష్టతరం చేస్తోంది. మానవ అవసరానికి మించి స్వార్ధ మానవ మానవ జోక్యం వలన గ్రానైట్ వంటి ఖనిజ సంపద కోసం పర్వతాలను తవ్వడం, వాటి సహజ రూపాన్ని దెబ్బతీయడం వల్ల పర్యావరణ సమతుల్యతకు, వాటర్ షెడ్ల పునాదులకు ప్రమాదం ఏర్పడుతోంది. ఈ అంశం ప్రస్తుతం చాలా ముఖ్యమైనది మరియు సమకాలీన పర్యావరణ సమస్యల్లో ఒకటి పరిగనించి సమస్య పరిష్కారమార్గం చూసుకోవాలి.
పర్వతాల సహజత్వానికి ముప్పు
పర్వతాలు, గుట్టలు ఏ విధంగా ఆక్రమణలు, పోడు వ్యవసాయం, మైనింగ్ వంటి కార్యకలాపాల వల్ల తమ సహజత్వాన్ని కోల్పోతున్నాయో పరిశీలన చేసుకోవాలి. అది ఎలాగంటే పర్వతాలు, గుట్టలు కేవలం ప్రకృతి సౌందర్యం మాత్రమే కాదు, అవి జీవవైవిధ్యానికి, జలవనరులకు, పర్యావరణ సమతుల్యతకు కేంద్రాలు.
కానీ, మానవ కార్యకలాపాల వల్ల ఇవి తీవ్రమైన ఆక్రమణకు, విధ్వంసానికి గురవుతున్నాయి. ఆక్రమణలు (ఎంక్రోచ్చ్మెంట్స్) పర్వతాలు, గుట్టల భూములను ఆక్రమించడం అనేక రూపాల్లో జరుగుతోంది. నివాస ప్రాంతాల విస్తరణ దిశగా పెరుగుతున్న జనాభా అవసరాల కోసం పట్టణాలు, గ్రామాలు పర్వతాల వైపు విస్తరిస్తున్నాయి.
గుట్టల వాలుపై ఇళ్ళు, కాలనీలు నిర్మించడం వల్ల సహజ వాలు (స్లోప్) మారిపోయి, కొండచరియలు విరిగిపడే (ల్యాండ్స్లయిడ్స్) ప్రమాదం పెరుగుతుంది. అనేక అధికారిక, అనధికార నిర్మాణాల రూపాలలో రిసార్టులు, హోటళ్లు, వినోద కేంద్రాలు, రోడ్ల నిర్మాణాల కోసం గుట్టలను చదును చేయడం లేదా వాటిని ఆక్రమించడం జరుగుతోంది. దీనివల్ల సహజ పారుదల వ్యవస్థ (డ్రైనేజీ సిస్టం) దెబ్బతిని వరదలు వచ్చే అవకాశం పెరుగుతుంది.
గైర్హాజరు వ్యవసాయం (నాన్-లోకల్ ఫార్మింగ్) రూపంలో మైదాన ప్రాంత ప్రజలు లాభాల కోసం గుట్టల భూములను ఆక్రమించి, భారీ ఎత్తున తోటల పెంపకం లేదా ఇతర పంటలు వేయడం. పోడు వ్యవసాయం (షిఫ్టింగ్ కల్టివేషన్ లేదా ఝామ్ కల్టివేషన్) రోజు రోజుకూ పెరిగిపోతోంది.
పోడు వ్యవసాయం అనేది ప్రధానంగా అటవీ ప్రాంతాల్లోని గిరిజనులు తమ సంప్రదాయ అవసరాల కోసం చేసే ఒక పద్ధతి. అయితే, ఇది నియంత్రణ లేకపోవడం వల్ల పర్వతాలకు హాని కలిగిస్తోంది. ముఖ్యంగా పోడు విధానంలో గిరిజనులు ఒక పర్వత ప్రాంతాన్ని ఎంచుకుని, అక్కడ అడవులను నరికి, కాల్చివేసి, ఆ బూడిదను ఎరువుగా వాడుతూ కొంతకాలం పంటలు పండిస్తారు. ఆ తర్వాత భూసారం తగ్గితే, ఆ ప్రాంతాన్ని వదిలి మరో కొత్త ప్రాంతానికి మారతారు.
పోడు కోసం అడవుల నరికివేత (డెఫారెస్టేషన్), చెట్లు నరికి కాల్చడం వల్ల పర్వత ప్రాంతంలోని అడవులు వేగంగా అంతరించిపోతున్నాయి. భూక్షరం (సాయిల్ ఏరోషన్) పెరిగి భూసార క్షీణత పెరుగుతుంది. చెట్లు లేకపోవడం వల్ల, వర్షపు నీరు మట్టిని నేరుగా కొట్టుకుపోతుంది. పర్వత వాలుపై ఈ క్రమం వేగంగా జరిగి, భూసారం పూర్తిగా కోల్పోవడం జరుగుతుంది.
జీవవైవిధ్యం నష్టం ఎక్కువగా జరుగుతూ అడవులు నశించడం వల్ల ఆ ప్రాంతంలోని వృక్ష, జంతు జాతులు (ఫ్లోరా అండ్ ఫౌణ) తమ ఆవాసాలను కోల్పోయి అంతరించిపోతాయి. మైనింగ్ (మైనింగ్) అక్రమ పెర్మిషన్స్ తో పర్వతాలు, గుట్టలు ఖనిజ సంపదకు నిలయాలుగా ఉన్న ఈ సహజ గుట్టలు ఆక్రమించి భూమ్మీద నే కాకా భూమిలోపలి వరకు తోవ్వబడుతున్నాయి. ఈ ఖనిజాల కోసం భారీ స్థాయిలో జరిగే మైనింగ్ కార్యకలాపాలు అత్యంత విధ్వంసకరమైనవి.
అయితే ఈ తవ్వకాల ఉద్దేశం ఏమిటంటే గ్రానైట్, క్వార్ట్జ్, సున్నపురాయి, మొరం (గ్రావెల్) ఇసుక, బాక్సయిట్, ఇనుము వంటి ఖనిజాలను, రాళ్ళను తవ్వేందుకు మైనింగ్ జరుగుతుంది. గుట్టలను భారీ యంత్రాలతో, డైనమైట్లతో పేల్చివేయడం విధానం ద్వారా వాటి సహజ ఆకారాన్ని, నిర్మాణాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తారు.
గుట్టలు అదృశ్యం
సహజత్వానికి ముప్పు మైనింగ్ వల్ల గుట్టలు పూర్తిగా చదును చేయబడి లేదా పెద్ద లోయలుగా మారి అదృశ్యమవుతాయి. ఈ ప్రకృతి విరుద్ధ చర్యల వల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడి మైనింగ్ కారణంగా గాలి కాలుష్యం (ధూళి వల్ల) మరియు శబ్ద కాలుష్యం పెరుగుతాయి.
జల వనరుల విధ్వంసం మైనింగ్ వల్ల భూగర్భ జలాల నిల్వలు దెబ్బతిని, ఆ ప్రాంతంలోని బావులు, బోర్లలో నీటి మట్టం తగ్గిపోతుంది. నదులు, వాగులలో పూడిక (సిల్టేషన్) పెరిగి, వాటి ప్రవాహానికి అడ్డంకి ఏర్పడుతుంది.
పైన పేర్కొన్న అన్ని కార్యకలాపాల వల్ల పర్వతాలు, గుట్టలు తమ సహజత్వాన్ని అనేక విధాలుగా కోల్పోతాయి. సహజ ఆకారం మార్పు రూపంలో మైనింగ్, నిర్మాణాలు గుట్టల సహజ రూపాన్ని మార్చి, వాటిని వికృతంగా మారుస్తాయి.
ఆ పరిసరాల్లో వృక్ష సంపద నష్టం పోడు, ఆక్రమణల వల్ల పచ్చదనం పోయి, భూమి బీడుగా మారుతుంది. ఈ కారణాలవలన జీవావరణ సమతుల్యత విచ్ఛిన్నంతో వృక్షాలు, జంతువులు, సూక్ష్మజీవులు, నేల మరియు నీటి మధ్య ఉన్న సహజ సమతుల్యత దెబ్బతింటుంది. సహజ పర్వత శ్రేణులు కోల్పోవడం వలన సహజ రక్షణ సామర్థ్యం తగ్గి అడవులు నశించడం వల్ల, అవి అందించే వరద నివారణ, గాలిని శుద్ధి చేసే సామర్థ్యం తగ్గిపోతుంది.
పర్వతాల రక్షణ చర్యలు అత్యవసరం
ఈ సమస్యలను ఎదుర్కోవడానికి కఠినమైన చట్టాలు, ప్రజల్లో విస్తృత అవగాహన, మరియు సుస్థిరమైన అభివృద్ధి పద్ధతులను (సస్టైనబుల్ డెవలప్మెంట్ ప్రాక్టీసెస్) అనుసరించడం అవసరం. ఈ సమస్యలను పరిష్కరించడానికి, వాతావరణ కాలుష్యానికి కారణమయ్యే చర్యలకు దూరంగా ఉండటం మన కర్తవ్యం. సహజ వనరులను పరిరక్షించడం, పర్వతాల పరిధిలోని అద్భుతమైన ప్రకృతిని, జీవవైవిధ్యాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత.
పర్వతాలు మన భౌగోళిక స్వరూపానికి నిదర్శనాలు, వర్షపు నీటిని ఒడిసిపట్టి నదులు, వాగులు, వంకలు, లోయలు ఏర్పడటానికి దోహదపడుతున్నాయి. అవి తరతరాల నుంచి మనకు వారసత్వ సంపదను అందించాయి.
ఈ అంతర్జాతీయ పర్వత దినోత్సవం సందర్భంగా, మనం మన పర్వతాలను పరిరక్షించుకోవాలి. స్వార్థ ప్రయోజనాల కోసం వాటిని నాశనం చేయకుండా, ఈ అపురూపమైన సహజ సంపదను రాబోయే తరాలకు అందించగలగాలి. పర్వతాల పరిరక్షణే మానవ మనుగడకు, స్థిరమైన భవిష్యత్తుకు ఆధారం.
– రవిబాబు పిట్టల, ఎంఎస్సీ, ఎంటెక్(పీహెచ్‌డీ), పర్యావరణవేత్త, ఫార్మర్ అసిస్టెంట్ ప్రొఫెసర్, జేఎన్టీయూహెచ్, జాయింట్ సెక్రెటరీ, ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ.





