•  ⁠సీనియర్ పొలిటీషియనే లక్ష్యంగా ప్రత్యర్థి పార్టీల విమర్శలు
  •  కూతురు కోసం అన్నీ తానై ప్రచారంలో ముందుకెళ్తున్న ఎమ్మెల్యే
  •  వరంగల్ లోక్‌సభ పరిధిలో డిఫరెంట్ పాలిటిక్స్

వేద న్యూస్, ఓరుగల్లు:
రాష్ట్రంలో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. ఓ వైపు మండుటెండలు దంచికొడుతున్నాయి. మరో వైపున పొలిటికల్ సవాళ్లు, ప్రతిసవాళ్లతో రాజకీయ వాతావరణం ఇంకా గంభీరంగా వేడెక్కుతోంది. అయితే, వరంగల్ లోక్ సభ పరిధిలో మాత్రం వెరీ డిఫరెంట్ పాలిటిక్స్ సాగుతున్నాయని చెప్పొచ్చు. అధికార కాంగ్రెస్ పార్టీ వరంగల్ పార్లమెంటు అభ్యర్థిగా కడియం కావ్య అయినప్పటికీ ప్రత్యర్థి పార్టీల వార్ మాత్రం శ్రీహరితోనే సాగుతుండటం గమనార్హం.

శ్రీహరి లక్ష్యంగా విమర్శలు..ఆయన కౌంటర్లు..
కడియం శ్రీహరి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ తరఫున స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యేగా గెలిచిన సంగతి అందరికీ తెలిసిందే. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన హస్తం పార్టీ గూటికి చేరారు.

బీఆర్ఎస్ లో తన కూతురు కడియం కావ్యను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినా కూడా ఆయన అక్కడి నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ లో చేరారు. ప్రస్తుతం తన కూతురు కడియం కావ్య తరఫున ప్రచారంలో అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ఇక బీజేపీ నుంచి అరూరి రమేశ్ అభ్యర్థిగా ఉండగా, ఆయన కూడా శ్రీహరినే టార్గెట్ చేస్తు్న్నారు. శ్రీహరి వల్లే తాను, పసునూరి దయాకర్ గులాబీ పార్టీ నుంచి బయటకు వచ్చామని ఆరోపిస్తున్నారు.

ఇక బీఆర్ఎస్ తరఫున ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఇటీవల రోడ్ షో లో కడియం శ్రీహరిని టార్గెట్ చేస్తూ విమర్శించారు. త్వరలో ఆయన రాజకీయ సమాధి అవుతారని, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే స్థానానికి ఎన్నికలు జరుగుతాయంటూ వ్యాఖ్యానించారు.

స్థానిక బీఆర్ఎస్ నాయకత్వం కూడా శ్రీహరిపైన గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. శ్రీహరిపైన రివెంజ్ తీసుకోవడానికి వారి రెడీగా ఉన్నట్టు సమాచారం. అఫీషియల్ క్యాండిడేట్ కావ్య అయినప్పటికీ పొలిటికల్ సీన్ లో సీనియర్ పొలిటీషియన్ కడియం శ్రీహరి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తుండటం గమనార్హం.
అసలు అభ్యర్థి కంటే ఆయనే ఎక్కువగా ప్రచారంలో కీలకం అవుతుండటంతో ఆయనే అభ్యర్థి అనే రీతిన పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ కూడా సాగుతోంది.