= రాష్ట్రంలో భూముల ధరతతో పాటే పెరుగుతున్న సబ్‌ రిజిస్ట్రార్ల అవినీతి
= రెవెన్యూ, పోలీస్ తర్వాత వీరిదే 3వ స్థానం
= రెండేళ్లలో సుమారు 15 మంది సబ్‌ రిజిస్ట్రార్లు అరెస్ట్.. 52 కేసులు నమోదు
= భూమి విలువ తగ్గించి చూపడం.. వివాదాస్పద భూముల రిజిస్ట్రేషన్లే టార్గెట్
= హైదరాబాద్‌ ఓఆర్ఆర్ చుట్టూ అత్యధికంగా 60 శాతం కేసులు
= కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, గండిపేట్, ఎల్బీనగర్ కార్యాలయాలపై ఏసీబీ, విజిలెన్స్ ఉక్కుపాదం
= అక్రమాస్తుల్లో సబ్‌ రిజిస్ట్రార్ల సరికొత్త రికార్డులు
= ఏసీబీకి చెక్కినా.. సస్పెండ్ అయినా లెక్క చేయని వైనం

వేద న్యూస్, ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో భూముల ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో.. వాటిని రిజిస్ట్రేషన్ చేసే సబ్‌ రిజిస్ట్రార్ల అవినీతి కూడా అంతే వేగంగా పెరిగిపోతోంది. ఏసీబీ గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో అవినీతి ఎక్కువగా జరిగే ప్రభుత్వ శాఖల్లో రిజిస్ట్రేషన్ల శాఖ ఏకంగా మూడో స్థానంలో నిలిచింది. మొదటి రెండు స్థానాల్లో రెవెన్యూ, పోలీస్ శాఖలు ఉండగా.. వాటికి పోటీగా రిజిస్ట్రేషన్ల శాఖలో అక్రమార్కులు వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారు. 2024 నుంచి 2026 ఏప్రిల్ వరకు కేవలం రెండేళ్ల వ్యవధిలోనే రిజిస్ట్రేషన్ల శాఖకు చెందిన సుమారు 15 మంది సబ్‌ రిజిస్ట్రార్లు ఏసీబీ చేతికి చిక్కి జైలు పాలవగా.. 52 కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. రంగారెడ్డి, మేడ్చల్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని పలువురు అధికారుల అక్రమాస్తుల విలువ వందల కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

నకిలీ పాస్‌పోర్టులు, వీసాలతో హైటెక్ దందాలు!
భూమి అసలు ప్రభుత్వ విలువను భారీగా తగ్గించి చూపడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయానికి గండి కొట్టి, అందులో కొంత శాతాన్ని లంచంగా తీసుకునే ఘనులు ఎక్కువయ్యారని విజిలెన్స్ దాడుల్లో తేలింది. నిషేధిత జాబితా (22A)లో ఉన్నవి, కోర్టు వివాదాల్లో నలుగుతున్న భూములను నిబంధనలకు విరుద్ధంగా రిజిస్టర్ చేయడానికి రూ. లక్షల్లో నగదు చేతులు మారుతోంది. డాక్యుమెంట్లు నకిలీవని తెలిసినా భారీ మొత్తంలో ముడుపులు అందితే చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. ఇటీవల జూబ్లీహిల్స్‌లో వ్యవసాయ విభాగంలో ఉండే భూమిని రిజిస్ట్రేషన్ చేయకూడదని తెలిసినా.. ఓ అధికారి భారీగా ముడుపులు తీసుకుని రిజిస్ట్రేషన్ చేయడంతో శాఖాపరమైన విచారణ జరుగుతోంది. రంగారెడ్డి జిల్లాలో మరో అధికారి వ్యాలిడేషన్ ముసుగులో అడ్డగోలుగా అక్రమ వసూళ్లకు పాల్పడటంతో ఆయన్ను మరో శాఖకు డిప్యుటేషన్‌పై పంపారు.

రాజధాని ఓఆర్ఆర్ చుట్టూనే 60 శాతం అక్రమాలు
హైదరాబాద్, రంగారెడ్డి జోన్ పరిసరాల్లోనే అత్యధికంగా అవినీతి కేసులు నమోదవుతున్నాయి. ఈ ప్రాంతంలో భూముల విలువలు కోట్లల్లో ఉండటంతో ఏసీబీ, విజిలెన్స్ సోదాలు నిరంతరాయంగా జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన కేసుల్లో కేవలం హైదరాబాద్‌కు 50 కిలోమీటర్ల పరిధిలోనే సుమారు 60 శాతం కేసులు నమోదు కావడం గమనార్హం. కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి పరిధిలో నకిలీ డాక్యుమెంట్ల వ్యవహారంలో సబ్‌ రిజిస్ట్రార్లు జైలుకు వెళ్లారు. గండిపేట సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో అక్రమ లేఅవుట్ల రిజిస్ట్రేషన్లపై ఏసీబీ వరుస దాడులు చేసింది. ఎల్బీనగర్, సరూర్‌నగర్‌లో లంచం తీసుకుంటూ సబ్‌ రిజిస్ట్రార్లు, డాక్యుమెంట్ రైటర్లు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. ఇటీవల వనస్థలిపురంలో ఓ అధికారి ఏకంగా పార్కు స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేసి సస్పెండ్ అవగా, సరూర్‌నగర్‌లో డబ్బులు తీసుకున్నట్లు మరో సబ్‌ రిజిస్ట్రార్ ఏకంగా కోర్టులోనే తప్పు ఒప్పుకుని సస్పెండ్ అయ్యారు. శంషాబాద్ పరిధిలో వ్యవసాయ భూములను అక్రమంగా ప్లాట్లుగా మార్చే క్రమంలో జరిగిన అవినీతిపై కేసులు నమోదయ్యాయి.

జిల్లాల్లోనూ విజిలెన్స్ పంజా.. 40 కార్యాలయాల్లో తనిఖీలు
రాజధానితో పాటు జిల్లాల్లోనూ అక్రమార్కుల లీలలు సాగుతున్నాయి. కరీంనగర్‌లో స్టాంప్ డ్యూటీ ఎగవేత, జీఎస్టీ వసూళ్లలో అక్రమాలపై విజిలెన్స్ దాడులు జరిగాయి. సంగారెడ్డి, పటాన్‌చెరువు పరిధిలో భూముల అక్రమ రిజిస్ట్రేషన్లపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఖమ్మంలో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో లంచాల దందాకు తెరలేపుతున్న మధ్యవర్తుల ప్రమేయం ఎక్కువగా ఉన్నట్లు ఏసీబీ గుర్తించి కేసులు పెట్టింది. నల్లగొండలో ధరణి సమస్యలను సాకుగా చూపి అమాయక రైతుల నుండి లంచాలు డిమాండ్ చేస్తున్నారనే ఫిర్యాదులపై ఏసీబీ దాడులు చేసింది. వరంగల్ జిల్లాలోనూ ఇదే పరిస్థితి. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 40కి పైగా సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో విజిలెన్స్, ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టడంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కార్యాలయాల్లో ఫైళ్లు కదలాలంటే లంచాలు ఇవ్వాల్సిందేనన్న పరిస్థితిని మార్చాలని, అవినీతి రిజిస్ట్రార్లపై పీడీ యాక్ట్ కింద కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

సస్పెండ్ అయితేనేం..
లంచాలు తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయినా, అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తూ సస్పెండైనా అక్రమార్కులకు ఏమాత్రం భయం లేకుండా పోయింది. ఎందుకంటే వెనకేసుకున్న వేల కోట్ల అక్రమ సంపాదన ముందు ఈ సస్పెన్షన్లు వారికి ఓ లెక్కా అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. విచారణల పేరుతో కొన్ని రోజులు ఇంట్లో రెస్ట్ తీసుకుని, ఆ తర్వాత పైస్థాయి అధికారులను, రాజకీయ పెద్దలను మేనేజ్ చేసుకుని మళ్లీ లూప్‌లైన్ పోస్టింగుల్లోకి చేరిపోతున్నారు. అడ్డగోలుగా సంపాదించిన డబ్బులోనే కొంత భాగాన్ని మళ్లీ లంచాల రూపంలో పై అధికారులకు ఎరగా వేసి, సీనియర్ పోస్టులను సైతం దక్కించుకుంటూ యథేచ్ఛగా తమ పాత దందాలను కొనసాగిస్తున్నారు. ఇలాంటి లూప్‌హోల్స్ వల్లే సబ్‌ రిజిస్ట్రార్ల అవినీతికి అడ్డుకట్ట పడటం లేదని, తప్పు చేసిన అధికారులను సర్వీస్ నుండి పూర్తిగా డిస్మిస్ చేస్తేనే వ్యవస్థలో మార్పు వస్తుందని మేధావులు అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *