వేద న్యూస్, నడికూడ :
బాధ్యతగల యువకుడిగా తన గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కోసం చేసిన కృషి నేడు ఫలించింది.వివరాల్లోకెళితే హనుమకొండ జిల్లా నడికూడ మండలం ముస్త్యాలపల్లి గ్రామానికి గత కొన్ని సంవత్సరాల నుండి బస్సు సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు, మహిళలు, రైతులు ఇబ్బందులు పడుతుండటంతో గ్రామానికి చెందిన యువకుడు మేకమల్ల వెంకటేష్ పలుమార్లు ఆర్టీసీ అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. గ్రామానికి బస్సు రావాలంటే రోడ్డుపై గుంతలు పూడ్చి, రోడ్డుకి ఇరువైపులా ఉన్న చెట్ల కొమ్మలు కొట్టాలని అధికారులు సూచించారు. అప్పటికి గ్రామాల్లో పాలకవర్గాలు లేకపోవడంతో పనిచేసేవారు లేక బస్సు సౌకర్యం ఆలస్యమైంది. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో అదే యువకుడు మేకమల్ల వెంకటేష్ గ్రామానికి సర్పంచ్ గా ఎన్నిక కావడంతోనే మొదటగా రోడ్డుపై గుంతలు పూడ్చి, చెట్ల కొమ్మలు కొట్టించి బస్సు మార్గం సుగమం చేశారు. ఆదివారం రోజున పరకాల డిపో నుండి ముస్త్యాలపల్లి గ్రామం మీదుగా హనుమకొండ జిల్లా కేంద్రానికి బస్సు సౌకర్యాన్ని అధికారులు కల్పించారు. దీంతో సర్పంచ్ వెంకటేష్ కు గ్రామస్తులు అభినందనలు తెలిపారు. సర్పంచ్ తో కలిసి గ్రామ ప్రజలు ఆర్టీసీ బస్సు కు స్వాగతం పలికారు. అనంతరం సర్పంచ్ వెంకటేష్ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు.