= అడిషనల్ అసిస్టెంట్ ఇంజనీర్ జాబితాలో సీనియర్లకు మొండిచేయి
= అర్హులకు కాదని జూనియర్లకు పట్టం
= సర్కిళ్ల వారీగా వేర్వేరు తేదీల్లో డీపీసీల నిర్వహణే వివాదానికి మూలం
= జాయినింగ్ తేదీల ఆధారంగా లిస్టు తయారీ
= సీనియారిటీ కోల్పోతున్న పాత ఉద్యోగులు
= సర్వీసు నిబంధనల మార్పుతో గందరగోళం
= 2010 నుంచి వేచి చూస్తున్న వారికి పెరిగిన పోటీ
= 30 ఏళ్ల సర్వీసు ఉన్నా దక్కని గౌరవం..
= పదవీ విరమణ వేళ తప్పని ఆవేదన
= యాజమాన్యానికి, సీఎండీకి విన్నవించినా స్పందన కరువు..
వేద న్యూస్, ప్రత్యేక ప్రతినిధి:
టీజీ ఎన్పీడీసీఎల్ లో పదోన్నతుల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. సంస్థలో సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న సీనియర్లను కాదని, జూనియర్లకు ప్రాధాన్యతనిచ్చేలా అధికారులు సిద్ధం చేస్తున్న సీనియారిటీ జాబితాపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అడిషనల్ అసిస్టెంట్ ఇంజనీర్ పదోన్నతుల్లో జరుగుతున్న అన్యాయంపై అర్హులైన సీనియర్ సబ్ ఇంజనీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిబంధనల సాకుతో సీనియర్లకు మొండిచేయి
సబ్ ఇంజనీర్లకు అడిషనల్ అసిస్టెంట్ ఇంజనీర్లుగా పదోన్నతి కల్పించాలని టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం ఇటీవల ఉత్తర్వులను జారీ చేసింది. ఈ మేరకు 100 మందితో కూడిన సీనియారిటీ జాబితాను రూపొందించాలని అధికారులను ఆదేశిస్తూ మార్గదర్శకాలను విడుదల చేసింది. అయితే, అధికారులు రూపొందిస్తున్న ఈ జాబితా తప్పుల తడకగా ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేవలం జాయినింగ్ తేదీలను ప్రామాణికంగా తీసుకోవడం వల్ల అర్హులైన ఎంతోమంది సీనియర్లు తమ పదోన్నతి హక్కును కోల్పోతున్నారు.
డిపార్ట్‌మెంట్ కమిటీల నిర్వాకంతోనే ముప్పు
2018కి పూర్వం లైన్ మ్యాన్, లైన్ ఇన్‌స్పెక్టర్, సీనియర్ అసిస్టెంట్, ఫోర్ మెన్ కేడర్లలో 8 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకుని డిప్లొమా విద్యార్హత ఉన్న వారికి సబ్ ఇంజనీర్లుగా ప్రమోషన్ ఇవ్వాలని సంస్థ నిర్ణయించింది. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ సర్కిళ్ల పరిధిలో డిపార్ట్‌మెంట్ ప్రమోషన్ కమిటీలు నిర్వహించి ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. అయితే, అన్ని సర్కిళ్లకు ఒకేసారి కమిటీలు నిర్వహించకుండా.. 2018 జూలై 19 నుండి 26 వరకు వేర్వేరు తేదీల్లో నిర్వహించారు. మొదట ఖమ్మం, వరంగల్, కరీంనగర్ సర్కిళ్లలో ప్రక్రియ పూర్తి కాగా, చివరగా ఆదిలాబాద్ సర్కిల్‌లో నిర్వహించారు. కమిటీలు ముందుగా పూర్తయిన చోట ఉద్యోగులు వెంటనే విధుల్లో చేరారు. అధికారుల జాప్యం వల్ల ఆలస్యంగా కమిటీ జరిగిన సర్కిళ్లలోని ఉద్యోగులు ఆలస్యంగా జాయిన్ అయ్యారు. ఇప్పుడు కేవలం ఆ జాయినింగ్ తేదీలనే ప్రామాణికంగా తీసుకుని సీనియారిటీ లిస్ట్ తయారు చేస్తుండటంతో, అధికారుల తప్పిదానికి ఉద్యోగులు బలి కావాల్సి వస్తోంది.
మారుతున్న నిబంధనలు.. పెరుగుతున్న పోటీ
గతంలో సబ్ ఇంజనీర్ పదోన్నతికి 8 ఏళ్ల కనీస సర్వీసు నిబంధన ఉండేది. దానిని కాలక్రమేణా 4 ఏళ్లకు, ఆపై రెండన్నర ఏళ్లకు కుదించి.. చివరకు జీరో సర్వీసుగా మార్చారు. దీనివల్ల 2010 నుండి అర్హత సాధించి ప్రమోషన్ కోసం వేచి చూస్తున్న పాత ఉద్యోగులకు, 2018లో అర్హత సాధించిన వారితో పోటీ పెరిగింది. ఈ క్రమంలోనే 2018 డీపీసీల నిర్వహణలో జరిగిన జాప్యం వల్ల పాత వారికంటే కొత్తవారే సీనియారిటీలో ముందుకు వచ్చే పరిస్థితి ఏర్పడింది.
30 ఏళ్ల సర్వీసున్నా దక్కని గౌరవం
‘1993లో లైన్ మ్యాన్ గా చేరి, 2010లోనే సబ్ ఇంజనీర్ హోదాకు అర్హత సాధించాను. మరో నాలుగేళ్లలో రిటైర్మెంట్ ఉంది. కానీ, 2018లో అర్హత సాధించిన జూనియర్లకు ఇప్పుడు ఏఏఈగా ప్రమోషన్ దక్కుతోంది. మాకంటే ఎంతో జూనియర్లు మా ముందే ఉన్నతాధికారులుగా వెళ్తుంటే చూడలేకపోతున్నాం.’ ఇది ఒక బాధిత ఉద్యోగి గోడు.. దాదాపు 110 మంది సీనియర్ ఉద్యోగుల పరిస్థితి ప్రస్తుతం ఇలాగే ఉంది. ఈ లోపాన్ని సరిదిద్దకపోతే ప్రతి ప్రమోషన్ లోనూ తాము వెనుకబడిపోతామని వారు వాపోతున్నారు.
స్పందించని యాజమాన్యం..
ఈ అన్యాయంపై జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ల నుండి మొదలుకొని, సంస్థ సీఎండీ వరకు దశలవారీగా వినతి పత్రాలు సమర్పించినా యాజమాన్యం నుండి ఎలాంటి సానుకూల స్పందన రాలేదు. ప్రమోషన్ అనేది ఉద్యోగి హక్కు అని, దానిని కాలరాసేలా ఉన్న ప్రొవిజనల్ జాబితాను పునఃసమీక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు స్పందించని పక్షంలో న్యాయం కోసం కోర్టును ఆశ్రయించేందుకు బాధితులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సమగ్ర విచారణ జరిపి, అర్హులైన సీనియర్లకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.