*ఏడుపాయలలో భక్తుల సందడి.. పోటెత్తిన జనసంద్రం*
*రెండవ శనివారం, ఆదివారం సెలవు దినాలు కావడంతో భారీగా తరలివచ్చిన భక్తులు*
*బోనాలు, ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లింపు*
వేద న్యూస్, పాపన్నపేట
భక్తుల కోరికలు తీర్చే కొంగుబంగారంగా విరాజిల్లుతున్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా భవాని అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వారాంతపు సెలవులైన రెండవ శనివారం, ఆదివారం కావడంతో రాష్ట్రంలోని వివిధ సుదూర ప్రాంతాల నుండి భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలన్నీ భక్తజన సంద్రంగా మారాయి.
తెల్లవారుజాము నుండే ఆలయానికి చేరుకున్న భక్తులు మంజీరా నదిలోని వివిధ పాయల్లో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం క్యూలైన్లలో బారులు తీరి వనదుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి ఒడిబియ్యం, బోనాలు సమర్పించడంతో పాటు కుంకుమార్చనలు, తలనీలాలు అర్పించి తమ మొక్కులను చెల్లించుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ ప్రాంగణమంతా అమ్మవారి నామస్మరణతో మార్మోగింది.
*పకడ్బందీ ఏర్పాట్లు – పోలీసు బందోబస్తు:*
దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ సిబ్బంది సూర్య శ్రీనివాస్, ప్రతాపరెడ్డి, శ్యాం, బ్రహ్మచారి, బత్తినిరాజు, నర్సింలు, వరుణాచారి, యాదగిరి, మహేష్, నరేష్, దీపక్ తదితరులు అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆలయ వేదపండితులు శంకర శర్మ, పార్థివ శర్మ, రాము, శేఖర్, నాగరాజు తదితరులు అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
భక్తుల రద్దీ కారణంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది పటిష్టమైన బందోబస్తు నిర్వహించారు.
