వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి :
వరంగల్ నగరంలోని ఓ సిటీలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఘనంగా యోగా వేడుకలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం జూన్ 21న ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు ఓ సిటీ ఇండోర్ స్టేడియంలో జరగనుంది. ఈ విషయాన్ని శ్రీ ఋషి పరివార్ యోగ ఫౌండేషన్ గురూజీ రిషి రవికుమార్, అలాగే ఓ సిటీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు జోగు చంద్రశేఖర్ సంయుక్తంగా ప్రకటించారు. జూన్ 21 ఉదయం 6:00 నుంచి 8:00 వరకు ఓ సిటీ ఇండోర్ స్టేడియం, వరంగల్ లో జరుగనుంది. ఈ సందర్భంగా గురూజీ రిషి రవికుమార్ మాట్లాడుతూ
“ఆధునిక జీవనశైలిలో ఒత్తిడిని జయించడానికి, రుగ్మతలను దూరం చేయడానికి యోగా ఒక దివ్యౌషధం. ఇది శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకోవడమే అసలైన జీవన మార్గం” అని తెలిపారు.
సంస్కృతి–ఆరోగ్యం కలయిక
ఓ సిటీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు జోగు చంద్రశేఖర్ మాట్లాడుతూ, “భారతీయ సంస్కృతి ప్రపంచానికి అందించిన అపురూపమైన కానుక యోగా. ఈ ఆరోగ్య వారసత్వాన్ని అందరం కలిసి ముందుకు తీసుకెళ్లాలి” అని పిలుపునిచ్చారు.
అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొబ్బల శ్రీనివాస్ రెడ్డి, కోశాధికారి వేణు మాట్లాడుతూ యువత, మహిళలు, ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, సీనియర్ సిటిజన్లు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
కాలనీల నుంచి విశేష స్పందన
ఈ యోగా వేడుకల్లో ఓ సిటీ, సొసైటీ కాలనీ, రాంకీ, వివేకానంద కాలనీ, విశ్వకర్మ కాలనీ, మణికంఠ కాలనీ, శాంతినగర్, మట్టివాడ, వేణు రావు కాలనీలకు చెందిన అధ్యక్షులు, కమిటీ సభ్యులు, కాలనీవాసులు ఉత్సాహంగా పాల్గొననున్నారు.
సొసైటీ కాలనీ అధ్యక్షుడు కంది రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, “ఈ యోగా మహోత్సవంలో అందరం భాగస్వాములై శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలి” అన్నారు.
మణికంఠ కాలనీ అధ్యక్షుడు పోతు చంద్రశేఖర్ మాట్లాడుతూ, “ప్రతిరోజు యోగా చేద్దాం… ఆరోగ్యంగా జీవిద్దాం” అని పిలుపునిచ్చారు. వివేకానంద కాలనీ అధ్యక్షుడు గాదే కొమురయ్య మాట్లాడుతూ,“క్రమం తప్పకుండా యోగా చేయడం ద్వారా ప్రాణశక్తి పెరిగి, ఆయుష్షు వృద్ధి చెందడంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుంది” అని పేర్కొన్నారు. ఆరోగ్య సమాజం దిశగా అడుగు
ఈ కార్యక్రమం ప్రజల్లో ఆరోగ్య స్పృహను పెంపొందించి, భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన జీవనశైలికి ఆదర్శంగా నిలుస్తుందని నిర్వాహకులు విశ్వాసం వ్యక్తం చేశారు.
