= అధిక వడ్డీలకు అప్పులు.. ఇష్టారీతిన వసూళ్లు
= హద్దు మీరుతున్న వడ్డీ వ్యాపారుల ఆగడాలు
= కాజీపేట, మడికొండలో కోరలు చాస్తున్న అక్రమ వడ్డీ వ్యాపారం
= పోలీసులను ఆశ్రయిస్తున్న భాధితులు..
= వ్యాపారులకు పోలీసుల వత్తాసు..?
= పోలీసుల తీరుపై బాధితుల ఆగ్రహం..
= కమిషనర్ సార్ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి
వేద న్యూస్, ఫోకస్ టీమ్ :
గ్రేటర్ వరంగల్ కాజీపేట,మడికొండ ప్రాంతాల్లో అక్రమ వడ్డీ వ్యాపారం రోజు రోజుకూ విస్తరిస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో డబ్బులు తీసుకున్న పేద,మధ్యతరగతి కుటుంబాలను కొంతమంది వడ్డీ వ్యాపారులు మానసికంగా,ఆర్థికంగా వేధిస్తున్నారని భాధితులు ఆరోపిస్తున్నారు. అధిక వడ్డీల పేరుతో కుటుంబాలను రోడ్డున పడేస్తూ భయాందోళనలకు గురి చేస్తున్న ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. మడికొండ ప్రాంతంలో కొందరు వడ్డీ వ్యాపారులు రూ.10 నుంచి రూ.15 శాతం వరకు అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారని బాధితులు వెల్లడిస్తున్నారు. అప్పు తీసుకునే సమయంలో మధురంగా మాట్లాడే వ్యాపారులు తిరిగి చెల్లింపులో స్వల్ప ఆలస్యం జరిగినా అమానుషంగా ప్రవర్తిస్తున్నారని వాపోతున్నారు. “డబ్బులు కడతావా.. లేక చస్తావా” అంటూ నేరుగా బెదిరింపులకు దిగుతున్నారని బాధిత కుటుంబాలు చెబుతున్నాయి. కొంతమంది వ్యాపారులు కొంతమంది యువకులకు మధ్యం తాగించి వెంటబెట్టుకొని బాధితుల ఇళ్లపైకి వెళ్లి గొడవలు సృష్టిస్తున్నారు. ఇంట్లో ఉన్న మహిళలు,వృద్ధులు,చిన్నపిల్లలను సైతం భయపెడుతూ అవమానకరంగా మాట్లాడుతున్నారని భాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్పు తీసుకున్న వారి కుటుంబ సభ్యులపై కూడా ఒత్తిడి తెచ్చి,సామాజికంగా అవమానించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఒకరు ఊరు విడిస్తే.. మరొకరు ఆత్మహత్యాయత్నం..!?
మడికొండకు చెందిన ఒక ఆటో డ్రైవర్ సుమారు 6సంవత్సరాల క్రితం ఒక వడ్డీ వ్యాపారి నుండి రూ.1లక్ష 50వేలు అధిక వడ్డీతో అప్పు తీసుకోగా 5సంవత్సరాలు కేవలం వడ్డీ మాత్రమే రూ.4లక్షల 50వేలు కట్టగా ఒక సంవత్సరం నుండి వడ్డీ చెల్లించక పోవడంతో వడ్డీ కోసం భాధితుడి ఇంటి పైకి వ్యాపారి కొంతమందిని తీసుకుపోయి బెదిరింపులకు గురిచేయగా భయపడిన ఆటో డ్రైవర్ మానసిక ఒత్తిడికి గురై ఊరు వదిలి కుటుంబంతో కలిసి గోపాలపురంలో కిరాయికి ఉంటున్నాడు. అది తెలుసుకున్న వ్యాపారి ఆటో డ్రైవర్ ఇంట్లో లేని సమయంలో అతని ఇంటికి వెళ్లి భార్యతో అమర్యాదగా మాట్లాడినట్టు భాధితుడు వాపోయాడు. ఈ వ్యవహారంపై బాధితుడు కరీంనగర్ జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ఒక పోలీస్ స్టేషన్ను ఆశ్రయించినప్పటికీ న్యాయం జరగలేదని ఆరోపిస్తున్నారు. చివరకు పోలీసులు వడ్డీ వ్యాపారులకే మద్దతుగా వ్యవహరించడంతో పాటు బాధితులు ఇంకా వడ్డీ వ్యాపారికే అప్పు ఉన్నట్లు కాగితాలు రాయించనట్టు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరొక ఘటనలో ఇటీవల ఓ బాధితుడు వడ్డీ వ్యాపారి వేధింపులు భరించలేక గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు తెలిసింది. ఐదు రోజులు ఎంజీఎంలో చికిత్స పొంది ఇంటికి రాగా ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉండడంతో ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. వడ్డీ వ్యాపారుల నుండి తమకు ప్రాణహాని ఉందని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. ఇలా వడ్డీ వ్యాపారులపై పోలీసులకు ఫిర్యాదులు చేసినప్పటికీ కేసులు నమోదు చేయడంలో నిర్లక్ష్యం చూపుతున్నారని భాధితులకు విమర్శిస్తున్నారు. స్థానిక ప్రజలు చెబుతున్న వివరాల ప్రకారం కాజీపేట,మడికొండ ప్రాంతాల్లో అక్రమ వడ్డీ వ్యాపారం గుట్టుచప్పుడు కాకుండా విస్తరిస్తోందని, రోజువారీ కూలీలు,చిన్న వ్యాపారులు,ఆటో డ్రైవర్లు,ప్రైవేట్ ఉద్యోగులు ఎక్కువగా ఈ వలలో చిక్కుకుంటున్నారని తెలుస్తోంది. అత్యవసర అవసరాల కోసం తీసుకున్న చిన్న మొత్తాల అప్పులు, అధిక వడ్డీల కారణంగా భారీ భారంగా మారుతున్నాయని బాధితులు చెబుతున్నారు.
వడ్డీ వ్యాపారులపై ఉక్కుపాదం మోపాలి
అక్రమ వడ్డీ వ్యాపారులపై వరంగల్ పోలీస్ కమిషనర్ వెంటనే ప్రత్యేక దృష్టి సారించి ఉక్కుపాదం మోపాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. వడ్డీ పేరుతో ప్రజలను వేధిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు వారికి సహకరిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు సిబ్బందిపై కూడా శాఖాపరమైన విచారణ జరిపించాలని కోరుతున్నారు. బాధిత కుటుంబాలకు రక్షణ కల్పించి అక్రమ వడ్డీ వ్యాపారాన్ని పూర్తిగా అరికట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.