కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు సాయి భగీరథ్ పై పోక్సో కేసు
= మద్యం తాగించి మైనర్ బాలికపై అత్యాచారం ఆరోపణలు
= హైదరాబాద్ పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో అర్ధరాత్రి హైడ్రామా
= కేసు పెట్టేందుకు పోలీసుల నిరాకరణ..
= బాధితుల ఆందోళనతో వెనక్కి తగ్గిన యంత్రాంగం
= హనీట్రాప్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటున్న బండి కొడుకు
= కరీంనగర్లో భగీరథ్ ఎదురు ఫిర్యాదు
= గతంలోనే 50 వేలు చెల్లించానన్న కేంద్ర మంత్రి కుమారుడు
= తప్పు చేయనప్పుడు డబ్బు ఎందుకు ఇచ్చావ్..
= సోషల్ మీడియాలో నెటిజన్ల ప్రశ్నల వర్షం
= గతంలోనూ యూనివర్సిటీలో విద్యార్థులను కొట్టిన కేసులు
= సంజయ్ ను మంత్రి పదవి నుంచి తప్పించాలంటూ ఢిల్లీకి చేరిన ఫిర్యాదులు
= మోడీ రాష్ట్ర పర్యటన వేళ బండి సంజయ్ ఇమేజ్ డ్యామేజ్
వేద న్యూస్, ఫోకస్ టీమ్:
తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. ఒక వైపు కరీంనగర్లో బండి సంజయ్, పాడి కౌశిక్ రెడ్డి ఎపిపోడ్ కాస్త బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య రాష్ట్రవ్యాప్తంగా వేడి రగులుస్తుంటే.. మరోవైపు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తనయుడు సాయి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ భాగ్యనగర పర్యటనకు సిద్ధమవుతున్న తరుణంలో, కేంద్ర హోంశాఖలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న సహాయ మంత్రి కుమారుడే మైనర్ బాలికపై అత్యాచారం చేశారన్న ఆరోపణలు రావడంతో.. ఇది కేవలం ఒక నేరపూరిత ఉదంతంగానే కాకుండా, బండి సంజయ్ రాజకీయ భవిష్యత్తును శాసించే పెను సంక్షోభంగా మారింది.
అసలేం జరిగింది?
శుక్రవారం అర్ధరాత్రి హైదరాబాద్‌లోని పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ఒక 17 ఏళ్ల మైనర్ బాలిక తల్లిదండ్రులు తమ కూతురిపై బండి సాయి భగీరథ్ అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. బాలికకు బలవంతంగా మద్యం తాగించి, మొయినాబాద్‌లోని ఒక ఫామ్‌హౌస్‌లో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు బాధితురాలి తరపు వారు ఆరోపించారు. కేంద్ర మంత్రి కొడుకు కావడంతో తొలుత కేసు నమోదుకు వెనుకాడిన పోలీసులు, బాధితులు కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించడంతో చేసేది లేక పోక్సో చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ లోపే సదరు బాలిక రెండుసార్లు ఆత్మహత్యకు యత్నించిందన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ముందస్తు స్కెచ్‌గా ‘హనీట్రాప్’ ఫిర్యాదు?
పేట్బషీరాబాద్లో రేప్ కేసు నమోదు కావడానికి సరిగ్గా కొన్ని గంటల ముందే, సాయి భగీరథ్ కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదు చేయడం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. తనను ఒక యువతి, ఆమె తల్లిదండ్రులు హనీట్రాప్‌లోకి దించి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆయన అందులో పేర్కొన్నారు. అమ్మాయితో స్నేహం ఉన్న మాట నిజమేనని, కానీ దానిని అడ్డుపెట్టుకుని ఆమె తల్లిదండ్రులు తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చారని, లేదంటే రూ. 5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారని భగీరథ్ తన రాతపూర్వక ఫిర్యాదులో వివరించాడు. భయపడి గతంలోనే రూ. 50 వేలు చెల్లించానని చెప్పడం గమనార్హం.
డబ్బుల చెల్లింపు.. నేరానికి అంగీకారమేనా?
ఈ కేసులో ప్రధానంగా చర్చకు వస్తున్న అంశం.. అసలు తప్పు చేయనప్పుడు భగీరథ్ సదరు కుటుంబానికి ఎందుకు డబ్బు చెల్లించారు? అనేది. హనీట్రాప్ బాధితుడిగా చెప్పుకుంటున్న భగీరథ్, బ్లాక్ మెయిలింగ్ మొదలైనప్పుడే పోలీసులను ఆశ్రయించకుండా రహస్యంగా డబ్బు ఇవ్వడం వెనుక అసలు రహస్యం ఏంటని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. రేప్ కేసు పెడతారనే భయంతోనే రాజీ కోసం ప్రయత్నించారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు, బాధితురాలి తల్లిదండ్రులు మాత్రం తమ బిడ్డకు న్యాయం చేయాలని, మంత్రి హోదాతో కేడర్‌ను, పోలీసులను ప్రభావితం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రధాని మోదీ రాకవేళ ‘బండి’ ఇమేజ్ డ్యామేజ్
ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనకు వస్తున్న సమయంలో ఈ వార్త వెలుగు చూడటం బండి సంజయ్‌ను తీవ్ర ఇరకాటంలోకి నెట్టింది. తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయాలన్న లక్ష్యంతో ఉన్న అధిష్టానం, కీలక నేత తనయుడి ప్రవర్తన వల్ల పార్టీకి జరగబోయే నష్టాన్ని లెక్కగడుతోంది. గతంలో మహీంద్రా యూనివర్సిటీలో ఒక విద్యార్థిని కొట్టిన వీడియో వైరల్ అయినప్పుడే భగీరథ్ తీరుపై విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఏకంగా పోక్సో కేసు నమోదు కావడంతో.. మహిళల భద్రతకు పెద్దపీట వేస్తామనే బీజేపీకి ఇది నైతికంగా పెద్ద దెబ్బ. బండి సంజయ్‌ను కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పించాలని ఇప్పటికే సోషల్ మీడియాలో ‘జస్టిస్ ఫర్ మైనర్’ పేరుతో ఉద్యమం మొదలైంది.
రాజకీయ కోణంలో బీజేపీ అంతర్గత పోరు?
ఈ కేసు వెనుక బండి సంజయ్ వ్యతిరేక వర్గం హస్తం ఉందన్న ప్రచారం కూడా బీజేపీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. రాష్ట్రంలో బండి ప్రాభవాన్ని తగ్గించడానికి ప్రత్యర్థి పార్టీల కంటే సొంత పార్టీలోని ప్రత్యర్థులే ఈ విషయాన్ని ఢిల్లీ పెద్దల దృష్టికి వేగంగా తీసుకెళ్తున్నట్లు సమాచారం. హోంశాఖ సహాయ మంత్రిగా ఉంటూ శాంతిభద్రతల గురించి మాట్లాడే బండి, తన ఇంట్లోనే ఇలాంటి పరిస్థితి ఉండటంపై ఢిల్లీ పెద్దలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.
