- మారుతున్న జలచక్రం – అడుగంటుతున్న భూగర్భజలాలు
- మానవ కుత్రిమ చేష్టల వల్ల మారుతున్న వాతావరణ మార్పులే అసలు కారణం
- మారుతున్ననీటి కొరత వల్ల జీవవైవిధ్యంలో వేగవంతమైన మార్పులు
నీరు… ఇది మనిషి సహా భూమిపై ఉన్న ప్రతి జీవికి జీవనాధారం. ప్రతీ నీటి బొట్టు ఎంతో విలువైనది కానీ, ప్రపంచవ్యాప్తంగా పర్యావరణంలో జరుగుతున్న మార్పులు మన జీవన విధానాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా జలచక్రం మార్పులు, భూగర్భజలాల తగ్గుదల, జీవవైవిధ్యంలో వేగవంతమైన మార్పులు మన ముందున్న అతిపెద్ద సవాళ్లుగా మారాయి. ఇవి ఒక్కొక్కటిగా కనిపించినా, పరస్పరం బలమైన సంబంధం కలిగి ఉన్నాయి. నీటి లభ్యత స్థాన ఆధారంగానే ఈజిప్ట్, మెసపాటోమియా, సింధూ మొదలగు ఆది మానవ నాగరికథలు మొదలయ్యాయని చరిత్రలు సాక్ష్యధారంగా తెలియ చేస్తున్నాయి. కానీ నేటి పరిస్థితుల్లో ఈ అమూల్యమైన నీటి వనరుపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతోంది.
అవసరమున్న నీటి వినియోగానికి ప్రాధాన్యత ఇవ్వకుండా నిజమైన నీటి అవసరాన్ని పక్కనపెట్టి మానవ స్వార్ధం, నూతన అలవాట్ల పోకడలు, అభివృద్ధి అనే ముసుగులో అవసరానికి మించి మితిలేని నీటి వినియోగం కూడా సమస్యను పెంచి పోసిస్తుంది. మరచిపోతున్న వాన నీటి సంరక్షణ భూగర్భజలాలు వేగంగా తగ్గిపోవడం, నదులు మరియు సరస్సులు కాలుష్యానికి గురవడం, క్లైమేట్ చేంజ్ కారణంగా వేగవంతమైన మార్పుల ప్రభావంతో జలచక్రం అసమతుల్యంగా మారడం వంటి పరిణామాలు మనకు స్పష్టమైన ప్రమాద సంకేతాలుగా కనిపిస్తున్నాయి.
వర్షపాతం నమూనాలు మారిపోవడం వల్ల ఒకవైపు వరదలు, మరోవైపు కరువు పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇదంతా మన జీవన విధానంలో, నీటి వినియోగంలో ఉన్న నిర్లక్ష్యం మరియు ప్రకృతి పట్ల మనం చూపిస్తున్న అవగాహన లోపానికి ప్రతిబింబం.
ఈ పరిస్థితులను అధిగమించాలంటే తక్షణమే సమగ్ర చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి వ్యక్తి తన దైనందిన జీవితంలో నీటి పొదుపు అలవాటు చేసుకోవాలి — చిన్న చిన్న చర్యలే పెద్ద మార్పులకు దారితీస్తాయి. వర్షపు నీటి నిల్వ (రెయిన్ వాటర్ హార్వెస్టింగ్) విధానాలను ఇళ్లలో, కార్యాలయాల్లో అమలు చేయడం ద్వారా భూగర్భజలాల స్థాయిని పెంచవచ్చు. అలాగే పరిశ్రమల నుంచి వచ్చే మలినాలను నియంత్రించడం, మురుగునీటిని శుద్ధి చేయడం వంటి చర్యలు నీటి కాలుష్యాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. మరోవైపు, చెట్లను నాటడం మరియు అడవులను పునరుద్ధరించడం ద్వారా జలచక్రం సహజ సమతుల్యతను తిరిగి పొందుతుంది.
*నీటి పొదుపు:* ప్రతి చుక్కను జాగ్రత్తగా వాడుకోవడం మరియు అనవసరమైన నీటి వృధాను అరికట్టడం మన బాధ్యత. *వర్షపు నీటి నిల్వ:* మన ఇళ్లలో మరియు కార్యాలయాల్లో వర్షపు నీటిని నిల్వ చేసుకునే వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా భూగర్భ జలాలను పెంచవచ్చు. *కాలుష్య నివారణ:* పరిశ్రమల వ్యర్థాలు మరియు రసాయనాలు నేరుగా నీటి వనరుల్లోకి చేరకుండా చూడాలి మరియు మురుగునీటిని శుద్ధి చేసేలా చర్యలు తీసుకోవాలి. *అటవీకరణ:* చెట్లను నాటడం మరియు అడవులను పునరుద్ధరించడం వల్ల వర్షపాతం మెరుగుపడటమే కాకుండా భూగర్భ జలాల నిల్వలు పెరుగుతాయి. *ప్రజల భాగస్వామ్యం:* పర్యావరణ పరిరక్షణ కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు, ఇది ప్రతి పౌరుడి బాధ్యత. ప్రతి ఒక్కరూ భాగస్వాములైనప్పుడే మనం భవిష్యత్ తరాలకు నీటిని అందించగలము.
ప్రజల భాగస్వామ్యం, అవగాహన, మరియు బాధ్యతాయుతమైన ప్రవర్తన ఉన్నప్పుడే నిజమైన మార్పు సాధ్యమవుతుంది. “ప్రకృతిని కాపాడడమంటే, మన భవిష్యత్తును కాపాడుకోవడమే” అనే భావనను మనసులో పెట్టుకుని ప్రతి ఒక్కరూ ముందడుగు వేస్తేనే రాబోయే తరాలకు నీటి భద్రతను అందించగలుగుతాం.
జలచక్రంలో మార్పుల వల్ల వాతావరణ సమతుల్యతలో పెనుమార్పులు
జలచక్రం అనేది సముద్రాలు, వాతావరణం మరియు భూమి మధ్య జరిగే నిరంతర నీటి మార్పిడి ప్రక్రియ, ఇది భూమిపై ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే, ప్రస్తుతం గ్లోబల్ వార్మింగ్ కారణంగా వాతావరణం వేడెక్కడం వల్ల ‘క్లాసియస్-క్లాపిరాన్’ (క్లాసియస్–క్లాపెరాన్ సూత్రం (క్లాసియస్ – క్లాపెరాన్ ఈక్వషన్) అనేది ఉష్ణోగ్రత మార్పుతో ఒక పదార్థం ద్రవం ఆవిరి (లిక్విడ్ –వాపౌర్) మధ్య మార్పులో ఒత్తిడి (ప్రెషర్) ఎలా మారుతుందో తెలిపే ఒక ముఖ్యమైన శాస్త్రీయ సూత్రం) సూత్రం ప్రకారం, గాలిలో తేమను నిల్వ ఉంచుకునే సామర్థ్యం ప్రతి 1°C ఉష్ణోగ్రత పెరుగుదలకు సుమారు 7% పెరుగుతోంది. దీనివల్ల బాష్పీభవన ప్రక్రియ వేగవంతమై, వాతావరణంలో అదనపు శక్తి చేరి మేఘాల నిర్మాణం మరియు వర్షపాత తీరులో అస్థిరత ఏర్పడుతోంది.
శాస్త్రీయ గణాంకాల ప్రకారం, గత ఐదు దశాబ్దాలలో ప్రపంచవ్యాప్తంగా అతి భారీ వర్షపాత ఘటనలు (ఎక్ట్రీమ్ ప్రేసిపీటేషన్ ఈవెంట్స్) 30% వరకు పెరిగాయి. ఈ మార్పు కేవలం వర్షం కురవడంలోనే కాకుండా, హిమానీనదాలు కరగడం మరియు సముద్ర మట్టాలు పెరగడంలో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. పట్టణీకరణ వల్ల నేల ఉపరితలం కాంక్రీట్ మయం కావడంతో, కురిసిన వర్షపు నీరు భూమిలోకి ఇంకకుండా (ఇన్ఫిల్ట్రేషన్) నేరుగా ప్రవహించి వరదలకు దారితీస్తోంది.
ఫలితంగా, ఒకవైపు తక్కువ సమయంలోనే అసాధారణ వర్షం కురిసి ప్రాణ, ఆస్తి నష్టం కలిగిస్తుంటే, మరోవైపు వర్షాలు లేని కాలంలో భూగర్భజలాలు రీఛార్జ్ కాక తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ అసమతుల్యత ఆహార భద్రతను మరియు జీవవైవిధ్యాన్ని నేరుగా దెబ్బతీస్తూ, పర్యావరణ వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తోంది.
భూగర్భజలాల క్షీణత ప్రభావం: పాతాళానికి పడిపోతున్న జీవనాడి
భూగర్భజలాలు భూమి లోపల ఉండే నీటిని నిల్వచేసుకునే సామర్థ్యం ఉన్న భూమి లోపల ఉండే ‘అక్విఫర్లు’ అనే రాతి పొరలలో నిక్షిప్తమై ఉంటాయి. ఇవి వర్షపు నీరు భూమిలోకి ఇంకడం (ఇన్ఫిల్ట్రేషన్) ద్వారా కొన్ని వందల ఏళ్లలో సహజంగా నిండుతాయి. అయితే, ప్రస్తుతం మనం తిరిగి నిండే రేటు (రీఛార్జ్ రేట్) కంటే అత్యంత వేగంగా నీటిని వెలికితీస్తున్నాం. శాస్త్రీయ దృక్పథంలో చూస్తే, భారతదేశం ప్రపంచంలోనే అత్యధికంగా—అమెరికా మరియు చైనా కలిపి వాడే దానికంటే ఎక్కువగా—భూగర్భజలాలను వినియోగిస్తోంది.
సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ (సి.జి.డబ్ల్యూ.బి.) మరియు నాసా వారి ‘గ్రేస్’ ఉపగ్రహ సమాచారం ప్రకారం, ఉత్తర భారతదేశం మరియు దక్కన్ పీఠభూమి ప్రాంతాల్లో భూగర్భజల మట్టాలు ఏటా సగటున 0.3 మీటర్ల మేర పడిపోతున్నాయి. ఏటా మనం వెలికితీస్తున్న 230 క్యూబిక్ కిలోమీటర్ల నీటిలో సుమారు 89% కేవలం వ్యవసాయ సాగుకే వినియోగించబడుతోంది. నీటి మట్టాలు లోతుకు వెళ్లేకొద్దీ, భూమి పొరల్లో సహజంగా ఉండే ఆర్సెనిక్, ఫ్లోరైడ్ వంటి భార లోహాల సాంద్రత పెరిగి నీరు విషతుల్యమవుతోంది. పట్టణీకరణ వల్ల నేల ఉపరితలంపై కాంక్రీట్ నిర్మాణాలు పెరిగి వాన నీటి ప్రవాహం (రన్-ఆఫ్) పెరగడం వల్ల, వర్షపు నీరు భూమిలోకి వెళ్లలేక ఈ సంక్షోభం మరింత తీవ్రమవుతోంది. ఇది కేవలం తాగునీటి కొరతకే కాకుండా, భూమి లోపల ఒత్తిడి తగ్గి కొన్ని చోట్ల భూమి కుంగిపోయే (ల్యాండ్ సబ్సిడెన్స్) ప్రమాదానికి కూడా దారితీస్తోంది.
నీటి కాలుష్యం – పర్యావరణ వ్యవస్థలపై రసాయనిక దాడి
నీటి కాలుష్యం అనేది కేవలం నీరు మురికిగా మారడం మాత్రమే కాదు, అది నీటిలోని భౌతిక, రసాయనిక మరియు జీవసంబంధమైన లక్షణాలు మారిపోయి జీవరాశికి హానికరంగా పరిణమించే క్లిష్టమైన ప్రక్రియ. శాస్త్రీయ దృక్పథంలో చూస్తే, పరిశ్రమల నుండి వెలువడే సీసం (లీడ్), పాదరసం (మెర్క్యూరీ), మరియు కాడ్మియం వంటి భార లోహాలు (హెవీ మెటల్స్) నీటిలో చేరి ‘బయో మాగ్నిఫికేషన్’ (బయోమాగ్నిఫికేషన్) ప్రక్రియ ద్వారా ఆహారపు గొలుసులోకి ప్రవేశించి మానవుల కేంద్ర నాడీ వ్యవస్థను దెబ్బతీస్తున్నాయి. వ్యవసాయంలో విచ్చలవిడిగా వాడే నైట్రేట్లు మరియు ఫాస్ఫేట్లు వర్షపు నీటితో కొట్టుకుపోయి జలవనరులలో చేరడం వల్ల ‘యూట్రోఫికేషన్’ (యూట్రోఫీకేషన్) ఏర్పడుతుంది. దీనివల్ల నీటిపై గుర్రపుడెక్క వంటి మొక్కలు విపరీతంగా పెరిగి, నీటిలోని కరిగిన ఆక్సిజన్ (డిస్సోల్వ్డ్ ఆక్సిజన్ ) స్థాయిని తగ్గించి వేస్తాయి, ఫలితంగా చేపలు వంటి జలచరాలు ఊపిరాడక మరణిస్తాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ.హెచ్.ఓ.) గణాంకాల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా సుమారు 200 కోట్ల మంది ప్రజలు మల మూత్రాల ద్వారా కలుషితమైన నీటినే తాగునీటి వనరుగా ఉపయోగిస్తున్నారు. దీనివల్ల కలరా, టైఫాయిడ్, మరియు డయేరియా వంటి వ్యాధుల కారణంగా ఏటా దాదాపు 14 లక్షల మంది మరణిస్తున్నారు. మన దేశంలో ప్రవహించే నదులలో సుమారు 40% నదులు కాలుష్య స్థాయిల పరంగా ప్రమాదకరమైన ‘సి’ (C) కేటగిరీలో ఉన్నాయని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సి.పి.సి.బి.) నివేదికలు హెచ్చరిస్తున్నాయి.
జీవవైవిధ్య క్షీణత: పర్యావరణ వ్యవస్థల పతనం
జీవవైవిధ్యం అనేది భూమిపై ఉన్న సమస్త జీవరాశుల మధ్య ఉండే పరస్పర ఆధారిత నెట్‌వర్క్. శాస్త్రీయంగా చూస్తే, నీటి లభ్యతలో మార్పులు మరియు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు జీవుల ‘ఫెనాలజీ’ (ఫేనాలజీ – అంటే వలసలు, పునరుత్పత్తి కాలాలు) పై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. జలచక్రం దెబ్బతినడం వల్ల చిత్తడి నేలలు (వెట్లాండ్స్) ఎండిపోతున్నాయి, ఇవి భూమిపై ఉన్న అత్యంత ఉత్పాదక పర్యావరణ వ్యవస్థలు. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐ.యు.సి.ఎన్.) రెడ్ లిస్ట్ 2023 నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా సుమారు 10 లక్షల (1 మిలియన్) జీవజాతులు రాబోయే కొద్ది దశాబ్దాలలో అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి.
ముఖ్యంగా ఉభయచరాలు (అంఫిబియన్స్) అత్యంత వేగంగా ప్రభావితమవుతున్నాయి; వీటిలో 41% జాతులు ఇప్పటికే అంతరించిపోయే దిశలో ఉన్నాయి. జలవనరులు కలుషితం కావడం వల్ల నీటిలోని ఆహారపు గొలుసు (ఆక్వాటిక్ ఫుడ్ చైన్) విచ్ఛిన్నమై, చేపల నుండి పక్షుల వరకు అన్నీ ‘నివాస నష్టాన్ని’ (హాబిటేట్ లాస్ ) ఎదుర్కొంటున్నాయి. పర్యావరణ వ్యవస్థలో ఒక్క కీటకం లేదా ఒక చిన్న మొక్క జాతి అంతరించినా, అది ‘కాస్కేడ్ ఎఫెక్ట్’ (క్యాస్కేడ్ ఎఫెక్ట్: కాస్కేడ్ ఎఫెక్ట్ అనేది ఒక పర్యావరణ వ్యవస్థలో లేదా ఒక క్రమపద్ధతిలో జరిగే గొలుసుకట్టు చర్య. సరళంగా చెప్పాలంటే, ఒక చిన్న మార్పు లేదా సంఘటన దానితో సంబంధం ఉన్న ఇతర అంశాలపై వరుసగా ప్రభావం చూపుతూ, చివరకు ఊహించని పెద్ద మార్పుకు లేదా వినాశనానికి దారితీయడాన్ని కాస్కేడ్ ఎఫెక్ట్ అంటారు) ద్వారా మొత్తం వ్యవస్థను అస్థిరపరుస్తుంది. పరాగసంపర్కం చేసే కీటకాలు తగ్గడం వల్ల ప్రపంచవ్యాప్తంగా పంటల దిగుబడి తగ్గి ఆహార సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
డేటా విశ్లేషణ: నీటి భద్రతపై శాస్త్రీయ హెచ్చరిక మరియు భవిష్యత్తు సవాళ్లు
ప్రస్తుత గణాంకాలను శాస్త్రీయ కోణంలో విశ్లేషిస్తే, భారతదేశం ఒక తీవ్రమైన ‘జల సంక్షోభ ముంగిట’ (వాటర్ స్ట్రెస్ త్రిషోల్డ్) ఉందని స్పష్టమవుతోంది.
ముఖ్యంగా మన దేశంలో లభ్యమయ్యే తాగునీటిలో *70% కేవలం వ్యవసాయ రంగానికే* వినియోగించబడుతుండటం గమనార్హం. శాస్త్రీయంగా చూస్తే, వరి, చెరకు వంటి నీటిని అధికంగా వినియోగించే పంటలను (వాటర్ – ఇంటెన్సివ్ క్రాప్స్) అశాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేయడం వల్ల ‘వాటర్ ఫుట్‌ప్రింట్’ (వాటర్ ఫుట్ప్రింట్) పెరిగి, ఉపరితల మరియు భూగర్భ జలాలు వేగంగా హరించుకుపోతున్నాయి.
నీటి లభ్యత మరియు జనాభా అవసరాల మధ్య సమతుల్యతను కొలిచే ‘ఫాల్కెన్‌మార్క్ ఇండికేటర్’ (ఫాల్కెన్మార్క్ ఇండికేటర్) ప్రకారం, *60% భారత భూభాగం* ఇప్పటికే నీటి ఒత్తిడిని (వాటర్ స్ట్రెస్) ఎదుర్కొంటోంది. దీనికి తోడు, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నివేదికల ప్రకారం, మన దేశంలోని *40% నదులు* పారిశ్రామిక వ్యర్థాలు మరియు మురుగునీటి కారణంగా కలుషితమై ‘బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్’ (బి.ఓ.డి) పరిమితులను మించిపోయాయి. నీటి నాణ్యత తగ్గడం వల్ల లభ్యత ఉన్నా అది వినియోగానికి పనికిరాకుండా పోతోంది. నీటి సరఫరా మరియు డిమాండ్ మధ్య అంతరాన్ని విశ్లేషించే ‘నీతి ఆయోగ్’ నివేదికల ప్రకారం, *2030 నాటికి నీటి డిమాండ్ ప్రస్తుతమున్న దానికంటే 2 రెట్లు పెరిగే* అవకాశం ఉంది. అంటే, మనం తక్షణమే నీటి నిర్వహణ పద్ధతుల్లో విప్లవాత్మక మార్పులు చేయకపోతే, భవిష్యత్తులో తీవ్రమైన ఆహార సంక్షోభం మరియు ఆర్థిక అస్థిరత తలెత్తే ప్రమాదం ఉందని ఈ డేటా మనల్ని హెచ్చరిస్తోంది.
సమగ్ర పరిష్కార మార్గాలు: పర్యావరణ పునరుద్ధరణకు శాస్త్రీయ కార్యాచరణ
ప్రస్తుత పర్యావరణంలో నీటి సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి కేవలం అవగాహన సరిపోదు, శాస్త్రీయమైన మరియు వ్యవస్థాగతమైన మార్పులు తక్షణ అవసరం. *వర్షజల సంరక్షణ (రెయిన్వాటర్ హార్వెస్టింగ్ )* అనేది కేవలం నీటిని ఆదా చేయడం మాత్రమే కాదు, అది భూగర్భజల ‘రీఛార్జ్ రేటు’ను పెంచి అక్విఫర్లలో హైడ్రోలిక్ ఒత్తిడిని పునరుద్ధరించే కీలక ప్రక్రియ.
పట్టణ ప్రాంతాల్లో శాస్త్రీయమైన ఇంకుడు గుంతల ద్వారా 40% నుండి 60% వరకు భూగర్భజల మట్టాలను మెరుగుపరచవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇక *అడవుల పునరుద్ధరణ (ఆఫరెస్టేషన్ )* విషయానికి వస్తే, చెట్లు ‘ట్రాన్స్‌పిరేషన్’ (ట్రాన్స్పిరేషన్) ప్రక్రియ ద్వారా వాతావరణంలో తేమను పెంచి, స్థానిక వర్షపాతాన్ని క్రమబద్ధీకరించడమే కాకుండా, నేల క్రమక్షయాన్ని అరికట్టి నీటిని భూమిలోకి ఇంకేలా చేస్తాయి. వ్యవసాయ రంగంలో *సూక్ష్మ సాగు పద్ధతులు (డ్రిప్ మరియు స్ప్రింక్లర్ ఇరిగేషన్ )* అవలంబించడం ద్వారా నీటి వినియోగ సామర్థ్యాన్ని 90% వరకు పెంచవచ్చు; ఇది సంప్రదాయ పద్ధతుల కంటే దాదాపు 40% నుండి 50% నీటిని ఆదా చేస్తుంది. *కాలుష్య నియంత్రణ*లో భాగంగా పరిశ్రమలు ‘ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్’ (ఈ.టి.పి) ద్వారా నీటిని శుద్ధి చేసి తిరిగి వాడటం (రీసైకిల్ అండ్ రియూస్ ) వల్ల నదులలోకి విషతుల్య రసాయనాలు చేరకుండా చూడవచ్చు. చివరగా, *జీవవైవిధ్య సంరక్షణ* అనేది కేవలం జంతువులను కాపాడటం కాదు, అది పర్యావరణ వ్యవస్థ యొక్క ‘రెసిలెన్స్’ (రెసిలియన్స్ – తట్టుకునే శక్తి) ని పెంచుతుంది. సరస్సులు, చిత్తడి నేలల పరిరక్షణ ద్వారా సహజమైన నీటి శుద్దీకరణ జరుగుతుంది, ఇది పరోక్షంగా మానవ మనుగడకు రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఈ చర్యలన్నీ సమన్వయంతో చేపట్టినప్పుడే మనం పర్యావరణ సమతుల్యతను సాధించగలం.
పర్యావరణ పునరుద్ధరణ – మన సామూహిక బాధ్యత
ప్రకృతిలో ప్రతి అంశం మరొకదానితో విడదీయలేని విధంగా ముడిపడి ఉంది. జలచక్రంలో ఏర్పడిన అస్థిరత కేవలం వర్షపాతానికి పరిమితం కాకుండా, భూగర్భజలాల క్షీణతకు మరియు తద్వారా జీవవైవిధ్య పతనానికి దారితీస్తోంది. దీనినే శాస్త్రీయ పరిభాషలో *’ఎకోలాజికల్ ఫీడ్‌బ్యాక్ లూప్’* అంటారు. అంటే, ఒక వ్యవస్థలో కలిగే నష్టం మరో వ్యవస్థను మరింత బలహీనపరుస్తుంది. నేడు మనం ఎదుర్కొంటున్న జల మరియు జీవవైవిధ్య సంక్షోభాలు మానవ ప్రేరిత పరిణామాలు మాత్రమే కాదు, అవి భూమి యొక్క సహజ రక్షణ కవచం దెబ్బతింటున్నాయనడానికి సంకేతాలు. శాస్త్రీయ పరిశోధనలు హెచ్చరిస్తున్నట్లుగా, మనం పర్యావరణ వ్యవస్థల పతనం (ఏకోసిస్టం కొల్లాప్స్) యొక్క అంచున ఉన్నాం. ఇప్పటికైనా ‘సస్టైనబుల్ డెవలప్‌మెంట్’ (సుస్థిర అభివృద్ధి) సూత్రాలను పాటిస్తూ, అత్యాధునిక సాంకేతికతను మరియు పురాతన జల సంరక్షణ పద్ధతులను మేళవించి ముందుకు సాగాలి.
జలసంరక్షణలో వాటర్షెడ్ యాజమాన్యం ముఖ్య పాత్ర
వాటర్‌షెడ్ మేనేజ్‌మెంట్ అనేది కేవలం భూభాగ నిర్వహణ కాదు, ఇది ఒక సమగ్ర శాస్త్రీయ ప్రక్రియ. వర్షపు నీరు భూమిపై పడినప్పుడు అది ఆవిరీభవనం, ఉపరితల ప్రవాహం, మరియు నేలలోకి చొరబడటం వంటి మార్గాల్లో ప్రయాణిస్తుంది; ఈ ప్రవాహాన్ని నియంత్రించి నిల్వ సామర్థ్యాన్ని పెంచడమే వాటర్‌షెడ్ లక్ష్యం. సమర్థవంతమైన వాటర్‌షెడ్ పద్ధతుల ద్వారా ఇంఫిల్ట్రేషన్ రేటు పెరిగి, భూగర్భ జలాల నిల్వలు మెరుగుపడతాయి, అదే సమయంలో ఉపరితల ప్రవాహం తగ్గి నేల క్షయం కూడా నియంత్రితమవుతుంది. కాంటూర్ ట్రెంచింగ్, చెక్‌డ్యామ్స్ వంటి చర్యలు నీటి నిల్వ సమయాన్ని పెంచి గ్రౌండ్వాటర్ రీఛార్జ్ ను వేగవంతం చేస్తాయి. పరిశోధనల ప్రకారం, ఈ విధానాలు అమలు చేసిన ప్రాంతాల్లో భూగర్భజల మట్టాలు గణనీయంగా పెరగడంతో పాటు నేల సారవంతత మెరుగుపడి బయోమాస్ ఉత్పత్తి కూడా పెరుగుతుంది. అంతేకాకుండా, ఈ ప్రక్రియ స్థానిక వాతావరణాన్ని సమతుల్యం చేసి క్లైమేట్ చేంజ్ ప్రభావాలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అందువల్ల, వాటర్‌షెడ్ మేనేజ్‌మెంట్ అనేది జల సంరక్షణ, వ్యవసాయ స్థిరత్వం మరియు జీవవైవిధ్య రక్షణకు అత్యంత అవసరమైన సుస్థిర పరిష్కారం.
అట్మాస్పియరిక్ వాటర్ హార్వెస్టింగ్: ఎడారి మనుగడకు సరికొత్త శాస్త్రీయ పరిష్కారం
ఎడారి ప్రాంతాల్లో వర్షపాతం అత్యల్పంగా ఉన్నప్పటికీ, గాలిలోని తేమను నీటిగా మార్చే అట్మాస్పియరిక్ వాటర్ హార్వెస్టింగ్ (ఎ.డబ్ల్యూ.హెచ్) ఒక విప్లవాత్మకమైన శాస్త్రీయ మార్గంగా అవతరించింది. భూమి వాతావరణంలో సుమారు 12.9 ట్రిలియన్ టన్నుల నీరు ఆవిరి రూపంలో నిరంతరం అందుబాటులో ఉంటుందని అంచనా. ఈ సాంకేతికత ప్రధానంగా థర్మోడైనమిక్ కండెన్సేషన్ (తెర్మోడైనమిక్ కాండెన్సేషన్) మరియు అడ్సార్ప్షన్ సూత్రాలపై పనిచేస్తుంది. ముఖ్యంగా మెటల్-ఆర్గానిక్ ఫ్రేమవర్క్స్ (ఎం.ఓ.ఎఫ్స్) వంటి అధునాతన పదార్థాలు, గాలిలో సాపేక్ష ఆర్ద్రత (రిలెటివ్ హుమిడిటీ ) కేవలం 10-20% ఉన్న అత్యంత పొడి ఎడారి పరిస్థితుల్లో కూడా తేమను పీల్చుకోగలవు. పరిశోధనల ప్రకారం, ఒక కిలోగ్రాము ఎం.ఓ.ఎఫ్. పదార్థం సూర్యరశ్మిని ఉపయోగించి రోజుకు దాదాపు 2.8 లీటర్ల నీటిని ఉత్పత్తి చేయగలదు. ఫాగ్ నెట్స్ (ఫాగ్ నెట్స్ ) మరియు సోలార్ హైగ్రోస్కోపిక్ (సోలార్ హైగ్రాస్కోపిక్) వ్యవస్థల ద్వారా విద్యుత్ అవసరం లేకుండానే స్వచ్ఛమైన నీటిని సేకరించడం సాధ్యమవుతోంది. ఇది భూగర్భ జలాలపై ఒత్తిడిని తగ్గించడమే కాకుండా, ఎడారి ప్రాంతాల్లో సుస్థిరమైన తాగునీటి భద్రతను (వాటర్ సెక్యూరిటీ ) కల్పించే ఒక శక్తివంతమైన మరియు పర్యావరణ హితమైన పరిష్కారంగా నిలుస్తోంది.
నీటిని పొదుపు చేయకపోతే రానున్న రోజుల్లో నీటి కష్టాలతో పాటు నీటి కొట్లాటలే
నీటిని పొదుపు చేయకపోతే రానున్న రోజుల్లో నీటి కొరత తీవ్రమై, అది కేవలం జీవన ఇబ్బందులకు మాత్రమే కాకుండా సామాజిక, ఆర్థిక సంఘర్షణలకు కూడా దారితీసే ప్రమాదం ఉంది. పెరుగుతున్న జనాభా, అతి వినియోగం, క్లైమేట్ చేంజ్ ప్రభావాలు కలిసి నీటి లభ్యతను మరింత తగ్గిస్తున్నాయి. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో తాగునీటి కోసం ప్రజలు కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోంది; భవిష్యత్తులో ఇదే పరిస్థితి మరింత తీవ్రమై నీటి కోసం గ్రామాల మధ్య, రాష్ట్రాల మధ్య కూడా వివాదాలు (వాటర్ కన్ఫ్లిక్ట్స్) పెరిగే అవకాశం ఉంది. అందుకే ప్రతి చుక్క నీటిని విలువైనదిగా భావించి, వృథాను తగ్గించి, వర్షపు నీటి సంరక్షణ వంటి చర్యలను అలవాటు చేసుకోవడం అత్యవసరం. “ఇప్పుడే జాగ్రత్త పడితేనే భవిష్యత్తులో నీటి కోసం పోరాటాలు నివారించగలం” అనే భావనతో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి.
పర్యావరణ పరిరక్షణ: మన ఉనికికి ఏకైక మార్గం
మారుతున్న జలచక్రం, అడుగంటుతున్న భూగర్భజలాలు మరియు వేగంగా క్షీణిస్తున్న జీవవైవిధ్యం ఒకదానితో ఒకటి పెనవేసుకున్న గొలుసుకట్టు విపత్తులు (క్యాస్కేడ్ ఎఫెక్ట్), ఇవి మానవ మనుగడకు తీవ్రమైన సవాలుగా పరిణమించాయి. భూతాపం పెరగడం వల్ల వాతావరణంలో తేమ నిల్వ సామర్థ్యం పెరిగి వర్షపాత తీరులో అస్థిరత ఏర్పడుతుంటే, మరోవైపు భారతదేశం ప్రపంచంలోనే అత్యధికంగా ఏటా 230 క్యూబిక్ కిలోమీటర్ల భూగర్భజలాలను వెలికితీస్తూ “ఓవర్-ఎక్స్‌ప్లాయిటెడ్” సంక్షోభంలోకి నెట్టబడుతోంది. ఈ నీటి కొరత మరియు పెరుగుతున్న కాలుష్యం కారణంగా ఐ.యు.సి.ఎన్. నివేదించినట్లుగా సుమారు 10 లక్షల జీవజాతులు అంతరించిపోయే ముంగిట ఉన్నాయి, ఇది పర్యావరణ వ్యవస్థల సమతుల్యతను దెబ్బతీస్తోంది. రాబోయే 2030 నాటికి నీటి డిమాండ్ రెట్టింపు కానున్న నేపథ్యంలో, కేవలం ప్రభుత్వాలపైనే ఆధారపడకుండా ప్రతి పౌరుడు వర్షపు నీటి సంరక్షణ, అడవుల పునరుద్ధరణ మరియు బాధ్యతాయుతమైన నీటి వినియోగాన్ని ఒక సామాజిక బాధ్యతగా స్వీకరించాలి. “ప్రకృతిని కాపాడటమంటే మన భవిష్యత్తును మనం కాపాడుకోవడమే”నని గుర్తించి, శాస్త్రీయ దృక్పథంతో తక్షణ చర్యలు చేపట్టినప్పుడే మనం రాబోయే తరాలకు సురక్షితమైన గ్రహాన్ని అందించగలం.
– రవిబాబు పిట్టల, పర్యావరణవేత్త, మాజీ సహాయ ఆచార్యులు, జలవనరుల అధ్యయన విభాగం (సెంటర్ ఫర్ వాటర్ రిసోర్సెస్), జె.ఎన్.టి.యు.హెచ్., హైదరాబాద్.