= కొత్త సీఐగా బాధ్యతలు స్వీకరించిన కర్రే స్వామి
= స్టేషన్ పరిధిలో యథేచ్ఛగా అసాంఘిక కార్యకలాపాలు
= యువతను పట్టిపీడిస్తున్న గంజాయి, మద్యం మహమ్మారి
= కుప్పలుతెప్పలుగా బెల్ట్ షాపులు
= రెచ్చిపోతున్న భూకబ్జాదారులు..
= స్టేషన్‌లో అడుగుపెట్టాలంటే పలుకుబడి ఉండాలనే భయం..
= కొత్త సీఐ పరిస్థితిని మార్చబోతున్నారా?
= అసాంఘిక శక్తులకు చెక్ పెడతారా?
= ఆశగా ఎదురుచూస్తున్న ప్రజలు

వేద న్యూస్, ఫోకస్ టీమ్:
మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు కొత్త సారథి వచ్చారు. మిల్స్ కాలనీ నూతన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ గా కర్రే స్వామి బాధ్యతలు చేపట్టారు. ఆయన బాధ్యతలు స్వీకరించిన క్షణం నుంచే స్థానిక ప్రజల్లో, బాధితుల్లో ఒక కొత్త ఆశ చిగురించింది. అయితే, కొత్త సీఐకి పదవీ బాధ్యతలు ఎంత ప్రతిష్టాత్మకమో.. క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు, సవాళ్లు అంతకంటే ఎక్కువగా ఉన్నాయి. మిల్స్ కాలనీ పరిధిలో ప్రస్తుతం నెలకొన్న శాంతిభద్రతల సమస్యలు, అసాంఘిక శక్తుల ఆగడాలను అణచివేయడం నూతన సీఐ ముందున్న అత్యంత ప్రధానమైన టాస్క్‌గా కనిపిస్తోంది.

కుప్పలు తెప్పలుగా బెల్ట్ షాపులు..
మిల్స్ కాలనీ పరిధిలో ప్రస్తుతం స్థానిక ప్రజలను తీవ్రంగా వేధిస్తున్న సమస్య.. విచ్చలవిడిగా వెలిసిన బెల్ట్ షాపులు. నిబంధనలకు విరుద్ధంగా గల్లీకో బెల్ట్ షాపు వెలిసి, అర్ధరాత్రి దాటినా మద్యం విక్రయాలు సాగిస్తూ అల్లర్లకు కారణమవుతున్నాయి. ఈ మద్యం మత్తు చాలదన్నట్లు, ఇటీవల కాలంలో గంజాయి సంస్కృతి కూడా ఇక్కడ వేగంగా విస్తరిస్తోంది. పదుల సంఖ్యలో యువత, విద్యార్థులు గంజాయి, మద్యం మత్తుకు బానిసలై తమ భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు. మత్తులో గ్యాంగులుగా ఏర్పడి, చిన్న చిన్న విషయాలకే గొడవలకు దిగుతూ స్థానికులను భయాందోళనలకు గురిచేస్తున్నారు. ఈ మత్తు నెట్‌వర్క్‌ల వేళ్లను కట్ చేయడం కొత్త సీఐ కు పెద్ద సవాల్‌గా మారనుంది.

దర్జాగా భూకబ్జాదారుల ఆగడాలు
మిల్స్ కాలనీ ఏరియాలో భూకబ్జాదారుల ఆగడాలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయి. అమాయకుల స్థలాలను, వివాదాస్పద భూములను టార్గెట్ చేస్తూ.. రాజకీయ, రౌడీ పలుకుబడితో భూబకాసురులు దర్జాగా కబ్జాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. తిరగబడితే బెదిరింపులకు దిగుతుండటంతో బాధితులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వీటికి తోడుగా కాలనీలోని కొన్ని ప్రాంతాలు గుట్టుచప్పుడు కాకుండా సాగే జూదం, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారాయనే విమర్శలు వస్తున్నాయి.

స్టేషన్‌లో అడుగుపెట్టాలంటే పలుకుబడి ఉండాలా?
సాధారణంగా పోలీస్ స్టేషన్ అంటే సామాన్యుడికి న్యాయం జరిగే దేవాలయం కావాలి. కానీ, మిల్స్ కాలనీ పరిధిలో ఉన్న పరిస్థితుల వల్ల ప్రజల్లో ఒక బలమైన అపోహ ఏర్పడింది. స్టేషన్‌లో అడుగుపెట్టాలన్నా, తాము పడుతున్న ఇబ్బందులపై ఫిర్యాదు చేయాలన్నా ఏదైనా రాజకీయ బ్యాక్‌గ్రౌండ్ లేదా పెద్దల పలుకుబడి ఉండాలనే భయం ప్రజల్లో నెలకొంది. కిందిస్థాయి సిబ్బంది వైఖరి వల్లో లేదా పాత పద్ధతుల వల్లో సామాన్యుడు నేరుగా వచ్చి ఫిర్యాదు చేసేందుకు జంకుతున్న పరిస్థితి ఉంది.

కొత్త సీఐపైనే ప్రజల ఆశలు..
ఈ నేపథ్యంలో బాధ్యతలు చేపట్టిన నూతన సీఐ కర్రే స్వామిపై మిల్స్ కాలనీ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆయన గతంలో పనిచేసిన ప్రాంతాల్లో ఉన్న మంచి ట్రాక్ రికార్డును గుర్తుచేసుకుంటున్న బాధితులు.. కచ్చితంగా ఈ కొత్త సారథి కాలనీలో మార్పు తెస్తారని నమ్ముతున్నారు. మిల్స్ కాలనీకి ‘ఫ్రెండ్లీ పోలీసింగ్’ నమ్మకాన్ని ఇస్తూనే.. నేరగాళ్ల పట్ల ‘స్ట్రాంగ్ పోలీసింగ్’ వైఖరిని అవలంబించి, ఇక్కడి సమస్యల వలయాన్ని ఛేదిస్తారని ప్రజలు గట్టిగా ఆశిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *