= జోరుగా నాలాల కబ్జా.. వెలుస్తున్న అక్రమ కట్టడాలు
= వానాకాలం ముంచుకొస్తున్నా వదలని నిర్లక్ష్యం
= మహా నగరం నీట మునిగాకే హడావుడి
= రొటీన్‌గా మారిన హంగామా.. శాశ్వత పరిష్కారం శూన్యం
= ప్రతి ఏటా ఇదే తంతూ.. నగర ప్రజలకు తప్పని తిప్పలు
= పాలక వర్గం లేదు.. రెగ్యులర్ కమిషనర్ ను నియమించరు
= వందల కోట్ల స్మార్ట్ సిటీ నిధులు వృథా
= అమలుకు నోచుకోని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి:
వరంగల్ నగరంలో ప్రతి ఏటా వర్షాలు రావడం, లోతట్టు ప్రాంతాలు జలమయం కావటం, ఆ వెంటనే అధికారులు, ప్రజాప్రతినిధులు హడావిడి చేయడం ఒక రొటీన్ ప్రక్రియగా మారిపోయింది. వరదలు వచ్చినప్పుడు పడవల్లో పర్యటిస్తూ, బాధితులకు హామీలు గుప్పించే పాలకులు, వానాకాలం వెళ్లిపోగానే ఆ ఊసే ఎత్తకపోవడం విచారకరం. గతాన్ని దృష్టిలో పెట్టుకొని కనీసం ఈ ఏడైనా ముందస్తు చర్యలు తీసుకోకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలుస్తోంది.
అస్తవ్యస్తమైన నాలాల వ్యవస్థ..
నగర వ్యాప్తంగా రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ అధ్వానంగా ఉండటమే కాకుండా, నాలాల నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. గత ప్రభుత్వాల నుంచి నేటి వరకు వరద ముంపు నివారణకు సరైన చర్యలు లేకపోవడం వల్లే వరంగల్ తరచూ నీట మునుగుతోంది. నగరంలో దాదాపు 20 నాలాలు ఉన్నప్పటికీ, అవి ఎక్కడికక్కడ కబ్జాలకు గురై తమ సహజ వెడల్పును కోల్పోయాయి. 20 మీటర్లు ఉండాల్సిన నాలాలు 10 మీటర్లకు కుదించుకుపోవడంతో వరద నీరు వెళ్లే మార్గం లేక కాలనీలను ముంచెత్తుతోంది.
మాయమైన చెరువులు..
వరంగల్ నగరవ్యాప్తంగా చెరువులు, కుంటల భూములు విచ్చలవిడిగా కబ్జాలకు గురయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో కాకతీయుల కాలం నాటి చెరువులు అడ్రస్ లేకుండా మాయమైపోవడం గమనార్హం. నగరం కాంక్రీట్ జంగిల్‌లా మారిపోవడంతో వర్షపు నీరు భూమిలోకి ఇంకే అవకాశం లేకపోయింది. చెరువుల పునరుద్ధరణ, కబ్జాల తొలగింపుపై పాలకులు శ్రద్ధ చూపకపోవడం వల్ల సామాన్య ప్రజలు మూల్యం చెల్లించుకుంటున్నారు.

అక్రమ కట్టడాల జోరు
వర్షాకాలం ముంచుకొస్తున్న తరుణంలో నగరంలో ముందస్తు ప్రణాళికలు ఎక్కడా కనిపించడం లేదు. నగరవ్యాప్తంగా విచ్చలవిడిగా వెలుస్తున్న అక్రమ కట్టడాలు వరద ముప్పును మరింత పెంచుతున్నాయి. నాలాలు, చెరువు శిఖం భూముల్లో నిర్మిస్తున్న కట్టడాలపై నిఘా ఉంచాల్సిన యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. సరైన డ్రైనేజీ ప్రణాళిక లేకుండా వెలుస్తున్న కొత్త కాలనీలు భవిష్యత్తులో జలసమాధి అయ్యే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
నిధుల వ్యయంపై విమర్శలు
స్మార్ట్ సిటీ, అమృత్ వంటి పథకాల కింద వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ, వరద ముంపు నివారణలో పురోగతి శూన్యం. మౌలిక వసతుల కోసం కోట్లాది రూపాయలు కేటాయించినా, వరద సమయంలో అవి పని చేయకపోవడం అధికారుల వైఫల్యమే. హంటర్ రోడ్ బొందివాగు నాలా విస్తరణ, పోతనగర్ నాలా పనులు వంటి కీలక ప్రాజెక్టులు నేటికీ మధ్యలోనే నిలిచిపోవడం ఆందోళన కలిగిస్తోంది.
నగరానికి దిక్కు ఎవరు?
వరంగల్ నగరానికి అసలు దిక్కు ఎవరూ అన్న ప్రశ్న ఇప్పుడు నగరవాసులను వేధిస్తోంది. నగరానికి ప్రస్తుతం పాలక వర్గం లేదు, అలాగే రెగ్యులర్ కమిషనర్ కూడా అందుబాటులో లేరు. వర్షాకాలం ముంచుకొస్తున్న తరుణంలో ఈ కీలక సమయంలో బాధ్యతాయుతమైన అధికారులు లేకపోవడంతో అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. పర్యవేక్షణ కరువై ఎక్కడికక్కడ అక్రమ నిర్మాణాలు పెరుగుతుంటే, ప్రజల సమస్యలను విన్నవించుకోవడానికి సరైన వేదిక లేకుండా పోయింది.
సీఎం ఆదేశించినా పట్టించుకోవట్లే..
గతేడాది వరదల సమయంలో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించి, శాశ్వత ముంపు నివారణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి స్వయంగా హామీ ఇచ్చినా, క్షేత్రస్థాయిలో పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. హనుమకొండ సమ్మయ్యనగర్ వద్ద గేట్లు అమర్చడం, ఇతర నాలాల విస్తరణ పనులు ఇప్పటికీ ప్రతిపాదన దశలోనే ఉండటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాలకుల మాటలకు, అధికారుల చేతలకు పొంతన లేదన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.
తీరేనా ఓరుగల్లు కష్టాలు?
వచ్చే వర్షాకాలంలోనైనా ఓరుగల్లు ప్రజల బాధలు తీరుతాయా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. వర్షాలు రావడం, నగరం నీట మునగటం రొటీన్‌గా మారిన నేపథ్యంలో, ప్రజలు ప్రాణభయంతో వణికిపోతున్నారు. ముందస్తు జాగ్రత్తలు లేక వేలాది కుటుంబాలు నిరాశ్రయులవుతుంటే, పాలకులు కేవలం హడావిడికే పరిమితమవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, శాశ్వత ముంపు నివారణ చర్యలు చేపట్టకపోతే ఓరుగల్లు చరిత్రలో మరో విషాదం తప్పదు.
