=పెండింగ్ సమస్యలపై ఉద్యోగుల సమర శంఖం
= తెలంగాణవ్యాప్తంగా మిన్నంటిన నిరసన జ్వాలలు
=పీఆర్సీ అమలు చేయకపోతే ఆందోళనలు ఉధృతం
= వృద్ధాప్యంలో తప్పని పెన్షనర్ల తిప్పలు
= పాత పెన్షన్ విధానంపై వెనక్కి తగ్గేదే లేదన్న ఉపాధ్యాయ లోకం
= హెల్త్ కార్డుల అమలులో విఫలం.. కార్పొరేట్ వైద్యం అందక విలవిల
= బదిలీల జాప్యంపై భగ్గుమన్న టీచర్లు
= సాధారణ బదిలీల ప్రక్రియ వెంటనే చేపట్టాలని డిమాండ్
= ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేసిన ఉద్యోగ సంఘాలు

వేద న్యూస్, ఎల్.కే (ప్రత్యేక ప్రతినిధి) :
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత తమ సమస్యలు పరిష్కారమవుతాయని ఆశించిన ఉద్యోగులకు నిరాశే ఎదురవుతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, మౌఖికంగా వెల్లడించిన హామీలు నేటికీ కాగితాలకే పరిమితమయ్యాయని జేఏసీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు క్షేత్రస్థాయిలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పెండింగ్ బకాయిలు, పీఆర్సీ అమలు, పాత పెన్షన్ విధానం వంటి కీలక అంశాలపై ప్రభుత్వం మొండి వైఖరి వీడాలని డిమాండ్ చేస్తున్నారు.

సర్కార్ కు జేఏసీ డెడ్ లైన్
ఉద్యోగుల ప్రధాన డిమాండ్లలో కొత్త పీఆర్సీ అమలు అత్యంత కీలకమైనది. గత కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తున్న పీఆర్సీని ఈ ఏడాది జూన్ 2వ తేదీ నాటికి ఖచ్చితంగా అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు అల్టిమేటం జారీ చేశాయి. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతన సవరణ జరగకపోతే ఉద్యోగుల ఆర్థిక పరిస్థితి దిగజారుతుందని, ప్రభుత్వం తక్షణమే దీనిపై స్పష్టమైన ప్రకటన చేయాలని కోరుతున్నారు.

పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ కోసం..
జీవితాంతం ప్రభుత్వానికి సేవలందించి పదవీ విరమణ పొందిన పెన్షనర్ల పరిస్థితి మరీ దారుణంగా ఉందని ఉద్యోగ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. రిటైర్డ్ ఉద్యోగులకు రావలసిన బెనిఫిట్స్, పెండింగ్ బిల్లులు నెలల తరబడి పెండింగ్‌లో ఉండటంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం తక్షణమే నిధులు విడుదల చేసి, వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లకు ఆర్థిక భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.


హెల్త్ కార్డులు.. సీపీఎస్ రద్దుపై పోరాటం
ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసం జారీ చేసిన హెల్త్ కార్డులు ప్రస్తుతం చాలా చోట్ల నామమాత్రంగానే మిగిలాయి. కార్పొరేట్ ఆసుపత్రుల్లో నగదు రహిత చికిత్స అందడం లేదని, హెల్త్ కార్డులను తక్షణమే పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలని కోరుతున్నారు. మరోవైపు, ఉద్యోగుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. ముఖ్యంగా 2004 సెప్టెంబర్ 1వ తేదీ కంటే ముందు నియామక ప్రక్రియ ప్రారంభమైన వారందరికీ పాత పెన్షన్ వర్తింపజేయాలని వారు పట్టుబడుతున్నారు.

డీఏ బకాయిలు, బదిలీల కోసం
చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న డీఏలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. అలాగే, ఉపాధ్యాయులు మరియు ఉద్యోగులకు సంబంధించిన సాధారణ బదిలీల ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. సుదీర్ఘకాలంగా ఒకే చోట పనిచేస్తున్న వారికి, బదిలీల కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ నిర్ణయం ఊరటనిస్తుందని వారు పేర్కొన్నారు.

వీఆర్ఏల సమస్యలు, ఉద్యోగుల భద్రతా కార్పొరేషన్
గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 61 ఏళ్లు నిండిన వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని నిరసనకారులు కోరారు. అలాగే, బడ్జెట్‌లో ఉద్యోగుల సంక్షేమం కోసం ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, తద్వారా ఉద్యోగులందరికీ సామాజిక మరియు ఆర్థిక భద్రత కల్పించాలని వారు సూచించారు.

ప్రభుత్వం దిగిరాకపోతే..
ప్రభుత్వానికి ఇచ్చిన గడువులోగా సమస్యల పరిష్కారానికి దిగిరాకపోతే, పోరాటాన్ని మరో స్థాయికి తీసుకెళ్తామని డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడు, జేఏసీ చైర్మన్ వి. లచిరెడ్డి, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు మరియు జేఏసీ సెక్రటరీ జనరల్ వొడ్నాల రాజశేఖర్ సంయుక్తంగా హెచ్చరించారు. ప్రభుత్వం కేవలం హామీలకే పరిమితం కాకుండా, ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం తక్షణమే ఒక సమగ్రమైన ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని వారు డిమాండ్ చేశారు. కేవలం మాటలతో సరిపెట్టే కాలం చెల్లిపోయిందని, తమ న్యాయమైన కోర్కెలను తీర్చడంలో జాప్యం చేస్తే మండల స్థాయి నుంచి రాష్ట్ర రాజధాని వరకు నిరసన జ్వాలలను మరింత ఉధృతం చేస్తామని వారు స్పష్టం చేశారు. అవసరమైతే విధులను బహిష్కరించి సమ్మెకు కూడా వెనుకాడబోమని, తమ హక్కుల సాధన కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని రేవంత్ సర్కార్‌పై వారు సమర శంఖం పూరించారు.