= సామాన్యుడికి అందనంత ఎత్తులో న్యాయదేవత
= 5.58 కోట్ల పెండింగ్ కేసుల సుడిగుండంలో భారత్
= ఐఎన్ఏఎం సంచలన నివేదిక
= కోర్టుల చుట్టూ కోట్లాది జీవితాలు
= జిల్లా కోర్టుల్లో 4.89 కోట్లు, హైకోర్టుల్లో 63 లక్షల ఫైళ్లు పెండింగ్
= న్యాయ జాప్యం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం
= పేదవాడికి పెరిగిన లాయర్ల భారం
= వేధిస్తున్న న్యాయమూర్తుల తీవ్ర కొరత
= ఖాళీల భర్తీ ఎప్పుడు? వ్యవస్థకు విముక్తి ఎప్పుడు?
= సింగపూర్ నమూనాయే పరిష్కారం
= ఒక్క రోజులోనే 80 శాతం విచారణలు ముగించే పద్ధతులపై చర్చ

వేద న్యూస్, ప్రత్యేక ప్రతినిధి:
భారతదేశ న్యాయస్థానాలు నేడు కేసుల ఫైళ్లతో నిండిపోయి, సామాన్యుడి ఆశలను సమాధి చేస్తున్నాయి.‘ఆలస్యమైన న్యాయం.. న్యాయాన్ని నిరాకరించడమే’ అన్న నానుడి భారత దేశంలో అక్షరాలా నిజమవుతోంది. తాజాగా ఇండియన్ నేషనలిస్ట్ మూవ్‌మెంట్ ఏప్రిల్ 2026లో విడుదల చేసిన గణాంకాలు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. దేశంలోని వివిధ కోర్టులలో ఏకంగా 5.58 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉండటం, వాటిని పరిష్కరించడానికి ప్రస్తుత వేగంతో మరో మూడు శతాబ్దాల సమయం పడుతుందన్న విశ్లేషణ వ్యవస్థలోని డొల్లతనాన్ని ఎత్తిచూపుతోంది.

కోట్లాది జీవితాలను మింగేస్తున్న గణాంకాలు
నేషనల్ జ్యుడీషియల్ డేటా గ్రిడ్ అందించిన తాజా సమాచారం ప్రకారం, న్యాయవ్యవస్థపై భారం గతంలో ఎన్నడూ లేనంత స్థాయికి చేరుకుంది. దిగువ కోర్టులలోనే 4.89 కోట్ల కేసులు పేరుకుపోగా, హైకోర్టులలో 63.94 లక్షల కేసులు, అత్యున్నత ధర్మాసనం సుప్రీంకోర్టులో 93 వేలకు పైగా కేసులు తీర్పు కోసం వేచి చూస్తున్నాయి. ఇందులో అత్యంత ఆందోళనకరమైన అంశం ఏమిటంటే.. జిల్లా కోర్టులలోని 69 శాతం కేసులు, హైకోర్టులలోని 76 శాతం కేసులు ఏడాదికి పైగా పెండింగ్‌లో ఉన్నవే. వందలాది కేసులు 30 ఏళ్ల క్రితం దాఖలైనవి కావడం గమనార్హం.

సామాన్యుడి సంపాదన లాయర్ల పాలు
న్యాయం కోసం కోర్టు మెట్లెక్కుతున్న సామాన్యుడు ఆర్థికంగా, మానసికగా చితికిపోతున్నాడని ఐఎన్ఏఎం నివేదిక ఆవేదన వ్యక్తం చేసింది. న్యాయపరమైన జాప్యం కారణంగా భారతదేశం ఏటా తన జీడీపీలో 1.5 శాతం మేర నష్టపోతోందని నిపుణులు లెక్కగడుతున్నారు. కేవలం భూ వివాదం లేదా ఒక చిన్న సివిల్ కేసు కోసం రైతు, కూలీ తన జీవితకాల పొదుపునంతా లాయర్లకు, ప్రయాణాలకు, కోర్టు ఫీజులకు ఖర్చు చేయాల్సి వస్తోంది. కేసు కొలిక్కి వచ్చేసరికి వాది వృద్ధుడైపోవడమో లేదా ఆస్తి మొత్తం అప్పుల పాలు కావడమో జరుగుతోంది.

వ్యవస్థ వైఫల్యానికి సజీవ సాక్ష్యాలు
ఈ సంక్షోభం ఎంత తీవ్రంగా ఉందో చెప్పడానికి నివేదిక మూడు హృదయ విదారక ఘటనలను ఉదహరించింది..
53 ఏళ్ల పోరాటం.. 108 ఏళ్ల మరణం.. మహారాష్ట్రకు చెందిన సుపన్ నర్సింగ్ గైక్వాడ్ 1968లో కొన్న భూమి వివాదంపై 53 ఏళ్లు పోరాడారు. విచారణ రోజునే ఆయన సుప్రీంకోర్టు ప్రాంగణంలోనే ప్రాణాలు విడిచారు. ఆయన గెలిచినా ఆ విజయం ఆయనకు దక్కలేదు.
తప్పుడు కేసుతో 20 ఏళ్ల జైలు.. లలిత్‌పూర్‌కు చెందిన విష్ణు తివారీ 20 ఏళ్లపాటు అన్యాయంగా జైలు శిక్ష అనుభవించి, 2021లో నిర్దోషిగా తేలారు. కానీ అప్పటికే ఆయన కుటుంబం, ఉద్యోగం, ఆరోగ్యం అన్నీ కనుమరుగయ్యాయి.
ఒక్క అక్షరం-45 ఏళ్ల వేదన.. కాన్పూర్‌కు చెందిన ఒక వితంతువు తన పేరులోని ఒక చిన్న స్పెల్లింగ్ తప్పు వల్ల 45 ఏళ్లు పెన్షన్ కోసం పోరాడాల్సి వచ్చింది. లక్షల రూపాయల ఖర్చు, దశాబ్దాల మానసిక వేదన తర్వాతే ఆమెకు న్యాయం లభించింది.

సంక్షోభానికి అసలు కారణాలేమిటి?
న్యాయవ్యవస్థ ఇంతలా కుంటుపడటానికి ప్రధాన కారణాలను మాజీ జస్టిస్ అభయ్ ఓకా, మాజీ సీజేఐ ఎన్.వి. రమణ వంటి ప్రముఖుల వ్యాఖ్యల ఆధారంగా నివేదిక విశ్లేషించింది. న్యాయమూర్తుల కొరత. ప్రతి 10 లక్షల జనాభాకు 50 మంది న్యాయమూర్తులు ఉండాలి, కానీ మన దగ్గర కేవలం 21 మందే ఉన్నారు. వేలాది పోస్టులు ఖాళీగా ఉండటం విచారణల జాప్యానికి ప్రధాన కారణం. ప్రభుత్వ వ్యాజ్యాలు.. ప్రతి ఏటా నమోదవుతున్న 2 నుంచి 3 కోట్ల కేసుల్లో దాదాపు సగం కేసులు ప్రభుత్వం దాఖలు చేస్తున్నవే. చిన్న చిన్న కారణాలతో ప్రభుత్వం చేసే అప్పీళ్లు కోర్టులపై భారాన్ని పెంచుతున్నాయి. మౌలిక సదుపాయాల లేమి.. పాత కాలపు చట్టాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడం, ఇ-ఫైలింగ్ సదుపాయాలు సరిగ్గా అందరికీ అందుబాటులో లేకపోవడం వల్ల ప్రక్రియ నత్తనడకన సాగుతోంది.

సింగపూర్ నమూనా డిమాండ్
ప్రపంచ దేశాల నుంచి పాఠాలు నేర్చుకోవాలని ఐఎన్ఏఎం సూచించింది. ముఖ్యంగా సింగపూర్ తరహాలో కేసుల నిర్వహణ ఉండాలని డిమాండ్ చేస్తోంది. సింగపూర్‌లో 80 శాతం కేసులు ఒక్క రోజులోనే పరిష్కారమవుతుంటాయి. అక్కడ సమయం వృధా చేస్తే కోర్టు ఫీజులు భారీగా పెరుగుతాయి. జర్మనీ, బ్రిటన్ దేశాల్లో కూడా చిన్న చిన్న వివాదాలను కోర్టు బయటే పరిష్కరించే పద్ధతులు విజయవంతమవుతున్నాయి.

ఐఎన్ఏఎం 5 సూత్రాల డిమాండ్
ఐఎన్ఏఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ముహమ్మద్ అబ్దుల్ అలీ జుబేర్ ప్రభుత్వానికి 5 కీలక డిమాండ్లు సమర్పించారు వెంటనే న్యాయమూర్తుల సంఖ్యను రెట్టింపు చేసి, ఖాళీలను భర్తీ చేయాలి. సింగపూర్ కేస్ మేనేజ్‌మెంట్ విధానాన్ని అమలు చేయాలి. కోర్టుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు డిజిటల్ టెక్నాలజీ వినియోగాన్ని పెంచాలి. అనవసరమైన ప్రభుత్వ కేసులను ఉపసంహరించుకోవాలి. బడ్జెట్‌లో న్యాయవ్యవస్థకు కేటాయింపులు పెంచి మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలి. ‘సామాన్యుడు తన రక్తం, చెమటతో దేశాన్ని నిర్మిస్తున్నాడు. అతనికి 300 ఏళ్ల తర్వాత కాదు, ఈరోజే న్యాయం కావాలి. కోర్టుల ప్రాంగణాల్లో కన్నీళ్లు ఆగాలి’ అంటూ జుబేర్ ముహమ్మద్ చేసిన హెచ్చరిక ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. భారత న్యాయవ్యవస్థలో సమూల మార్పులు వస్తేనే కోట్లాది మంది భారతీయులకు విముక్తి లభిస్తుంది.