= నెల రోజులు దాటుతున్నా ఎక్కడి ధాన్యం అక్కడే
= పంట కొనుగోళ్లలో జాప్యం..
= లారీలు, గన్నీలు, హమాలీలు లేక నిలిచిపోయిన ధాన్యం కాంటాలు
= రేవంత్ సర్కార్‌పై భగ్గుమంటున్న అన్నదాతలు
= మార్కెట్లు, మిల్లులు, ఐకేపీ సెంటట్ల వద్ద కిలోమీటర్ల మేర రైతుల క్యూ
= ప్రభుత్వం కొనకపోవడంతో తక్కువ ధరకు మిల్లర్లకు అమ్ముతున్న వైనం
= అకాల వర్షాలతో కల్లాలు, కేంద్రాల్లో తడిసిపోతున్న వడ్లు, మక్కలు
= నెల రోజులుగా పడిగాపులు..
= వడదెబ్బతో పది మందికి పైగా రైతుల మృతి
= 40 కేజీల బస్తాకు 900 గ్రాముల అదనపు తూకం
= డబ్బులు వసూలు చేస్తున్నా పట్టించుకోని అధికారులు
వేద న్యూస్, తెలంగాణ బ్యూరో:
నెల రోజుల నుండి పంటల కొనుగోలు కోసం రాష్ట్రంలోని మార్కెట్లు, రహదారులు, మిల్లులు, గోదాముల ముందు రైతన్నలు పడిగాపులు పడుతున్నారు. ధాన్యం సేకరణలో పూర్తిగా వైఫల్యం చెందడంతో, ఎక్కడ చూసినా కిలోమీటర్ల మేర ట్రాక్టర్లతో అన్నదాతలు రోడ్లపైనే వేచి ఉండాల్సిన దైన్య పరిస్థితి ఏర్పడింది. లారీలు, గన్నీ సంచులు, హమాలీల కొరత కారణంగా కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆరుగాలం కష్టపడి పండించిన వడ్లు, మక్కలను అమ్ముకోవడానికి ఇటు ప్రకృతితో, అటు ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు ప్రతిరోజూ నరకప్రాయమైన పోరాటం చేయాల్సి వస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న ఉదాసీన వైఖరిపై రాష్ట్రవ్యాప్తంగా రైతాంగం భగ్గుమంటోంది. యాసంగి పంటలు చేతికొచ్చి నెల రోజులు దాటుతున్నా, ప్రభుత్వం మాత్రం కొనుగోళ్లు చేపట్టకుండా కాలయాపన చేస్తూ తప్పించుకుంటోందని అన్నదాతలు ఆగ్రహజ్వాలలు కురిపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తమ బతుకులు మారుతాయని ఆశించి, ఓటు వేసి ఘోరంగా నష్టపోయామంటూ రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. నాడు విత్తనాలు, యూరియా కోసం మొదలైన క్యూలైన్ల తిప్పలు.. నేడు పండించిన పంటను అమ్ముకునే వరకు నిరంతరాయంగా సాగుతూనే ఉన్నాయని, ఈ ప్రభుత్వం రైతులకు ఏమాత్రం అనుకూలంగా లేదని క్షేత్రస్థాయిలో రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
లారీలు లేవు.. గన్నీలు లేవు..
రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్లు, రైస్ మిల్లులు, ఐకేపీ కొనుగోలు కేంద్రాలు ఎక్కడ చూసినా కిలోమీటర్ల మేర ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లతో రైతులు బారులు తీరి కనిపిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో కనీసం గన్నీ బ్యాగులు అందుబాటులో లేవు, లోడింగ్ చేయడానికి హమాలీలు రారు, పంటను మిల్లులకు తరలించడానికి లారీలు రావడం లేదు. దీంతో కాంటాలు పూర్తిగా నిలిచిపోయి కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతోంది. నెల రోజులుగా మార్కెట్లు, రహదారులు, గోదాముల ముందు అన్నదాతలు పడిగాపులు పడుతున్నారు. ఈ క్రమంలోనే ఎండల తీవ్రతను తట్టుకోలేక, వడదెబ్బ తగిలి రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 10 మందికి పైగా రైతులు కొనుగోలు కేంద్రాల వద్దే ప్రాణాలు కోల్పోవడం అత్యంత కలిచివేసే అంశం.
కళ్లముందే కొట్టుకుపోతున్న శ్రమ!
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలు రైతుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో ఓపెన్ మార్కెట్‌లోనే ఉంచిన వరి ధాన్యం, మొక్కజొన్న పంటలు వర్షానికి తడిసి ముద్దవుతున్నాయి. గత 20 రోజులుగా మొక్కజొన్న పంట తడుస్తూ, ఎండుతున్నా కనీసం పట్టించుకునే నాథుడే కరువయ్యాడని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాల ధాటికి మార్కెట్లలో గుట్టలుగా పోసిన ధాన్యం, ఇతర పంటలు కొట్టుకుపోయిన దైన్య పరిస్థితులు కనిపిస్తున్నాయి. అటు ప్రకృతి కన్నెర్ర చేసినా, ఇటు ప్రభుత్వ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని, పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి కూడా ఇంతటి నరకం చూడాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు.
కొనుగోలు కేంద్రాల్లో యథేచ్ఛగా అవినీతి!
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అవినీతి పతాకస్థాయికి చేరిందని, అధికారులు, సిబ్బంది తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారని రైతులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. నిబంధనల ప్రకారం 40 కేజీల బస్తాకు సంచి తూకం పోగా.. తేమ, తాలు నెపంతో ఏకంగా 900 గ్రాముల చొప్పున అదనంగా తూకం వేస్తూ తరుగు పేరిట దగా చేస్తున్నారు. దీనికి తోడు ప్రతి చిన్న పనికీ, కాంటా వేయడానికీ సిబ్బంది డబ్బులు డిమాండ్ చేస్తున్నారని బాధితులు చెప్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం. ప్రభుత్వ కేంద్రాల్లో రోజులు గడుస్తున్నా కాంటా కాకపోవడం, అవినీతి వేధింపులు తట్టుకోలేక.. చివరకు రైతులు తక్కువ ధరలకే స్థానిక మిల్లర్లకు, దళారులకు తమ పంటను అమ్ముకుని నిలువునా నష్టపోతున్నారు.
కొనుగోలు కేంద్రాల వద్దే ప్రాణాలు కోల్పోయారు
ఈ సుదీర్ఘ నిరీక్షణల వేళ ఎండ తాకిడికి, తీవ్రమైన వడదెబ్బతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 10 మందికి పైగా రైతులు కొనుగోలు కేంద్రాల వద్దే ప్రాణాలు కోల్పోయారు. కల్లాల వద్దే రాత్రింబవళ్లు కావలి ఉంటూ, కనీస నీడ, తాగునీటి సదుపాయాలు కూడా లేక ఎండ తీవ్రతకు అన్నదాతలు అక్కడికక్కడే కుప్పకూలిపోతున్నారు. పండించిన పంటను అమ్ముకునే క్రమంలో ఇలా రైతులు ప్రాణాలు కోల్పోతుండటం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతాంగంలో పెల్లుబుకుతున్న ఆగ్రహాన్ని స్పష్టం చేస్తోంది.
రైతాంగం ఆక్రందన!
మహాత్మా గాంధీ కన్న కలలు, ఇందిరమ్మ రాజ్యం తెస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం.. నేడు అన్నదాతలను నడిరోడ్డుపై నిలబెట్టిందని రైతులు మండిపడుతున్నారు. ఎంతో నమ్మకంతో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి పెద్ద తప్పు చేశామని, ఇప్పుడు పంటలు అమ్ముకోలేక అప్పులపాలవుతున్నామని ఆక్రోశిస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను ప్రభుత్వమే కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయకుండా తప్పించుకుంటే, తాము ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా రేవంత్ సర్కార్ నిద్రమత్తు వీడి, తక్షణమే యుద్ధప్రాతిపదికన గన్నీ సంచులు, లారీలను సమకూర్చి, తడిసిన ధాన్యాన్ని సైతం ఎలాంటి కోతలు లేకుండా కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.