= రైతన్న కష్టం నీళ్లపాలు
= తెలంగాణలో అకాల వర్షాల బీభత్సం
= కల్లాల్లోనే తడిసి ముద్దయిన ధాన్యం
= నెల రోజులైనా సాగని ధాన్యం కొనుగోళ్లు
= లారీలు, గన్నీ సంచుల కొరతతో కాలయాపన
= వరద నీటిలో కొట్టుకుపోయిన ధాన్యపు రాశులు
= చేతికొచ్చిన పంట పోయి అన్నదాతల ఆక్రందన
= అధికారుల నిర్లక్ష్యం.. కళ్లముందే కన్నీటి కష్టం
వేద న్యూస్, ప్రత్యేక ప్రతినిధి:
అటు సర్కార్ నయవంచన.. ఇటు వరుణ దేవుడి కన్నెర్ర.. వెరసి తెలంగాణలో అన్నదాతల బతుకులు ఆగమైపోయింది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అధికారులు, మిల్లుల యజమానులు కుమ్మక్కై ధాన్యం కొనకుండా రోజుల తరబడి, వారాల తరబడి ఆలస్యం చేసినందుకే నేడు అన్నదాతలకు ఈ ఘోర దుస్థితి దాపురించింది. ఆరుగాలం కష్టపడి పండించిన వడ్లు, మక్కలను విక్రయించడానికి రైతులు సుమారు నెల రోజులుగా మార్కెట్ల ముందు, ఐకేపీ కేంద్రాల వద్ద, రహదారుల పక్కన పడిగాపులు కాస్తున్నా పాలకులలో కనీస చలనం లేకుండా పోయింది. హమాలీలు లేరని, లారీలు రావడం లేదని, గన్నీ బ్యాగుల కొరత ఉందంటూ అధికారులు రోజుకో సాకు చెబుతూ కాలయాపన చేయడంతో.. చివరకు అన్నదాతల శ్రమంతా అకాల వర్షాల పాలైంది.
పట్టించుకోని పాలకులు
రెక్కలు ముక్కలు చేసుకుని, కన్నబిడ్డలా కాపాడుకుంటూ వచ్చిన పంట కళ్ల ముందే వరద నీటిలో కొట్టుకుపోతుంటే, ‘రైతన్న బతుకు ఎప్పటికీ ఇంతేనా?’ అంటూ అన్నదాతలు గుండెలవిసేలా రోదిస్తున్నారు. విత్తనాలు, యూరియా కొనుగోలు దగ్గర నుండి పండించిన పంటను అమ్ముకునే వరకు ప్రతి దశలోనూ రోడ్లపై క్యూలైన్లలో నిలబడటమే తమ బతుకైపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండ తీవ్రతకు వడదెబ్బలు తగిలి కొనుగోలు కేంద్రాల వద్దే దాదాపు 10 మందికి పైగా రైతులు ప్రాణాలు కోల్పోతున్నా, అకాల వర్షాలకు సర్వస్వం కోల్పోతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని అన్నదాతలు ఆక్రోశిస్తున్నారు.

సకాలం కొనుగోలు చేసుంటే…
ప్రభుత్వం సకాలంలో రవాణా వసతులు కల్పించి, మిల్లులకు ధాన్యం తరలించి, తూకాలు వేసి ఉంటే ఈపాటికి పంట అంతా సురక్షితంగా గోదాములకు చేరేదని రైతాంగం చెబుతోంది. సర్కార్ చేసిన నయవంచన, కాలయాపన వల్లే తమ శ్రమంతా అకాల వర్షాల పాలైందని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల నిర్వహణలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా వైఫల్యం చెందడం వల్లే తాము ప్రకృతి విపత్తుకు బలికావాల్సి వచ్చిందని, ఐకేపీ కేంద్రాలు చెరువులను తలపిస్తున్నా పాలకులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు.
ఇన్ని విధాల మునుగుతున్నా..
ఇలా అన్ని విధాలుగా నిండా మునిగిన రైతన్నను ఆదుకోవడానికి ప్రభుత్వం తదుపరి చర్యలు ఏమైనా తీసుకుంటుందా? లేదా? అనే ఆందోళన ఇప్పుడు క్షేత్రస్థాయిలో వేధిస్తోంది. కళ్లాల్లో ఉన్న వడ్లు, మక్కలు తడిసిపోవడంతో అప్పుడే తేమ, తాలు నెపంతో క్షేత్రస్థాయిలో మిల్లర్లు, అధికారులు తరుగు పేరిట క్వింటాళ్లకు కిలోల కొద్దీ కోతలు విధిస్తూ అదనపు తూకాలతో దోపిడీకి తెరలేపారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ప్రకృతి దెబ్బకు సగం పంట నష్టపోతే, మిగిలిన దానికి కూడా మిల్లర్లు తరుగు కోతలు విధిస్తుండటంతో అన్నదాతలు నిలువునా లబోదిబోమంటున్నారు.
ఎక్కడికక్కడ తడిసిన గింజలు..
ప్రకృతి కన్నెర్ర చేసి పంటంతా తడిసి ముద్దయిన వేళ.. కనీసం ఈ తడిసిన ధాన్యాన్నైనా ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనుగోలు చేస్తుందా? లేదా? అని రైతాంగం ఎదురుచూస్తోంది. ఒకవైపు ఎండ తీవ్రతకు అల్లాడి, మరోవైపు వాన దెబ్బకు కుప్పకూలి, అన్ని రకాలుగా సర్వస్వం కోల్పోయిన శ్రమజీవికి అండగా నిలవాల్సిన బాధ్యత పాలకులపై ఉందనే వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ సర్కార్ ఇప్పటికైనా క్షేత్రస్థాయిలో ఉన్న దైన్య పరిస్థితిని గమనించి తక్షణమే స్పందించకపోతే రైతాంగం మరింత సంక్షోభంలోకి కూరుకుపోయే ప్రమాదం పొంచి ఉంది.
న్యాయం చేయాలి..
ఇప్పటికైనా రేవంత్ సర్కార్ మానవత్వంతో స్పందించి, ఎలాంటి ఆంక్షలు, తేమ నిబంధనలు, తరుగు కోతలు లేకుండా తడిసిన, రంగుమారిన ప్రతి గింజనూ కనీస మద్దతు ధరకే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో లారీల సంఖ్యను పెంచి, గన్నీ సంచులను యుద్ధప్రాతిపదికన సరఫరా చేసి కళ్లాల్లో ఉన్న మిగిలిన పంటనైనా త్వరగా మిల్లులకు తరలించాలని కోరుతున్నారు. దగాపడ్డ అన్నదాతను కాపాడటానికి ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక ప్యాకేజీ లేదా నష్టపరిహారం ప్రకటించి ఆదుకోవాలని, లేదంటే అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులకు ఆత్మహత్యలే శరణ్యమవుతాయని రైతాంగం కన్నీటితో వేడుకుంటోంది.